కరోలిన్ వోజ్నియాకి
నిజంగానే కరోలిన్ వోజ్నియాకికి ఇది ‘నంబర్‌వన్’ ట్రోఫీ. 43 సార్లు గ్రాండ్‌స్లామ్ బరిలోకి దిగిన ఈ డెన్మార్క్ క్రీడాకారిణి ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌తో తొలిసారి ఓ మేజర్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. దీంతో పాటు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. ఓవెన్‌ను తలపించిన వాతావరణంలో... ఒంట్లో సత్తువను పీల్చేస్తున్న వేడిలో... తుదికంటా పోరాడింది. నంబర్‌వన్ హలెప్‌పై టైటిల్ గెలిచేదాకా విశ్రమించలేదు. చివరకు టైటిల్‌తో 11 ఏళ్ల గ్రాండ్‌స్లామ్ పోరాటానికి విజయంతో తెరదించింది.
మెల్‌బోర్న్: కరోలిన్ వోజ్నియాకి... ఒకటా, రెండా ఏకంగా 11 ఏళ్ల పాటు గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం పరితపించింది. ఈ క్రమంలో రెండు సార్లు (2009, 2014 యూఎస్ ఓపెన్) టైటిల్ బరిలో నిలిచిన ఈ డానిష్ ప్రొఫెషనల్... గెలుపుదరిని మాత్రం చేరలేకపోయింది. కానీ ఈ సారి ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లోనే విజృంభించింది. చాంపియన్‌షిప్ దక్కేదాకా పోరాడింది. చివరకు అనుకున్నది సాధించింది. విరామమెరుగని పోరాటంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల కిరీటాన్ని అందుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో డెన్మార్క్ స్టార్ వోజ్నియాకి 7–6 (7/2), 3–6, 6–4తో టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై చెమటోడ్చి నెగ్గింది. ప్రపంచ నంబర్‌వన్ హలెప్ తన స్థాయికి తగ్గ పోరాటంతో మెప్పించింది. తాజాగా నంబర్‌వన్ ర్యాంకును ఖాయం చేసుకున్న వోజ్నియాకి 2010 తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని చేరనుంది.
గెలిచేదాకా... నువ్వా నేనా...
హోరా హోరీగా సాగిన టైటిల్ పోరు సుమారు మూడు గంటల (2.49 ని.) పాటు జరిగింది. ఇద్దరు ప్రత్యర్థులు హోరాహోరీగా తలపడుతూనే కనిపించని మరో ప్రత్యర్థి (ఉష్ణోగ్రత)నీ ఎదుర్కొన్నారు. తొలి సెట్‌లో చక్కని శుభారంభంతో వోజ్నియాకి 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం హలెప్ కూడా దీటుగా పుంజుకోవడంతో రసవత్తర పోరు జరిగింది. బ్రేక్ పాయింట్లతో వోజ్నియాకి జోరుకు కళ్లెం వేసిన రోమేనియన్ స్టార్ ఈ సెట్‌ను టైబ్రేక్ దాకా తీసుకెళ్లింది. అక్కడ డెన్మార్క్ క్రీడాకారిణి సత్తాచాటడంతో 4–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఎదురులేని సర్వీస్‌లతో టైబ్రేక్‌ను 7–2తో ముగించింది. తొలి సెట్ పరాజయాన్ని పక్కనబెట్టి తాజాగా రెండో సెట్ ఆడిన హలెప్ అద్భుతమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌ను తేల్చేందుకు మూడో సెట్ తప్పలేదు. ఈ సెట్‌లో మళ్లీ ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో 3–3 స్కోరు సమమైంది. వోజ్నియాకి బలహీనమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో తడబడటంతో 3–4తో వెనుకబడింది. ఈ దశలో ఫిజియోతో తన ఎడమ మోకాలికి మర్దన చేయించుకున్నాకే వోజ్నియాకి కోర్టులో చురుగ్గా కదంతొక్కింది. వేగవంతమైన సర్వీస్‌లతో వరుసగా రెండు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను, టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హలెప్ 6 ఏస్‌లు సంధించగా, వోజ్నియాకి 2 ఏస్‌లు సంధించింది. ఇద్దరు ఐదేసి బ్రేక్ పాయింట్లు సాధించగా... వోజ్నియాకి 6 సార్లు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. హలెప్ మాత్రం ఒకసారే డబుల్ ఫాల్ట్ చేసింది.
నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్స్
ఫెడరర్&సిలిచ్
మధ్యాహ్నం 2 గంటల నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment