వొజ్నియాకి అలవోకగా...  | Highlights of French Open Tennis Tournament | Sakshi
Sakshi News home page

వొజ్నియాకి అలవోకగా... 

May 31 2018 1:11 AM | Updated on May 31 2018 1:11 AM

Highlights of French Open Tennis Tournament - Sakshi

పారిస్‌: ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సాధించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన డెన్మార్క్‌ స్టార్‌ కరోలైన్‌ వొజ్నియాకి అదే జోరును ఫ్రెంచ్‌ ఓపెన్‌లో కొనసాగిస్తోంది. సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ అయిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో వొజ్నియాకి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. గార్సియా పెరెజ్‌ (స్పెయిన్‌)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో రెండో సీడ్‌ వొజ్నియాకి 6–1, 6–0తో అలవోకగా గెలిచింది. 51 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో వొజ్నియాకి తన ప్రత్యర్థికి కేవలం ఒక గేమ్‌ మాత్రమే కోల్పోయింది. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6–3, 6–4తో కుజ్మోవా (స్లొవేకియా)పై, ఎనిమిదో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–0, 6–4తో అరూబెరెనా (స్పెయిన్‌)పై నెగ్గి మూడో రౌండ్‌లో అడుగు పెట్టారు.  

శ్రమించిన హలెప్‌...  
మరోవైపు టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)కు తొలి రౌండ్‌లోనే ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అలీసన్‌ రిస్కీ (అమెరికా)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో హలెప్‌ 2–6, 6–1, 6–1తో విజయం సాధించి ఊరట చెందింది. 2014, 2017లలో రన్నరప్‌గా నిలిచిన హలెప్‌ తొలి సెట్‌లో 0–5తో వెనుకబడింది. ఆ తర్వాత రెండు గేమ్‌లు గెల్చుకున్నప్పటికీ తొలి సెట్‌ను దక్కించుకోలేకపోయింది. అయితే రెండో సెట్‌లో ఈ రొమేనియా స్టార్‌ పుంజుకుంది. నాలుగుసార్లు రిస్కీ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి అదే జోరులో సెట్‌ను సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో సెట్‌లోనూ హలెప్‌ దూకుడు కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మంగళవారమే హలెప్‌ తన తొలి రౌండ్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉన్నా వర్షం కారణంగా ఆమె మ్యాచ్‌ను బుధవారానికి మార్చారు.  

గట్టెక్కిన జ్వెరెవ్‌ 
పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), నాలుగో సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా), 19వ సీడ్‌ నిషికోరి (జపాన్‌) ఐదు సెట్‌ల పోరాటంలో గట్టెక్కారు. రెండో రౌండ్‌లో జ్వెరెవ్‌ 2–6, 7–5, 4–6, 6–1, 6–2తో లాజోవిక్‌ (సెర్బియా)పై, దిమిత్రోవ్‌ 6–7 (2/7), 6–4, 4–6, 6–4, 10–8తో డొనాల్డ్‌సన్‌ (అమెరికా)పై, నిషికోరి 6–3, 2–6, 4–6, 6–2, 6–3తో బెనోయిట్‌ పెయిర్‌ (ఫ్రాన్స్‌)పై కష్టపడి గెలిచారు. మాజీ చాంపియన్‌ జొకోవిచ్‌ 7–6 (7/1), 6–4, 6–4తో మునార్‌ (స్పెయిన్‌)పై, ఎనిమిదో సీడ్‌ గాఫిన్‌ (బెల్జియం) 7–5, 6–0, 6–1తో మూటెట్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించారు. 12వ సీడ్‌ సామ్‌ క్వెరీ (అమెరికా) 6–1, 6–7 (3/7), 4–6, 1–6తో సిమోన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement