ముగ్గురే మిగిలారు | Only three were left | Sakshi
Sakshi News home page

ముగ్గురే మిగిలారు

Published Sat, Sep 5 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

ముగ్గురే మిగిలారు

ముగ్గురే మిగిలారు

♦ మహిళల టాప్-10లో ఏడుగురు అవుట్
♦ నాలుగో సీడ్ వొజ్నియాకి ఇంటిముఖం
♦ యూఎస్ ఓపెన్ టోర్నీ
 
 న్యూయార్క్ : యువతారల తళుకులతో ఈసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల మోత మోగుతోంది. మూడో రౌండ్ పూర్తికాకముందే టాప్-10 సీడింగ్స్‌లో నుంచి ఏడుగురు క్రీడాకారిణులు ఇంటిముఖం పట్టారు. తాజాగా ఈ జాబితాలో నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్)... ఈ ఏడాది వింబుల్డన్ రన్నరప్, తొమ్మిదో సీడ్ గార్బినె ముగురుజా (స్పెయిన్) చేరారు. గాయం కారణంగా మూడో సీడ్ షరపోవా (రష్యా) చివరి నిమిషంలో వైదొలగగా... ఆరో సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్), ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్) తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. ఫలితంగా ప్రస్తుతం టాప్-10 నుంచి ముగ్గురు (టాప్ సీడ్ సెరెనా, రెండో సీడ్ సిమోనా హలెప్, ఐదో సీడ్ క్విటోవా) మాత్రమే బరిలో మిగిలారు.

 నాలుగు మ్యాచ్ పాయింట్లు వదులుకొని...
 కెరీర్‌లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గకుండానే గతంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన వొజ్నియాకికి ఈసారీ నిరాశే మిగిలింది. అన్‌సీడెడ్ పెట్రా సెట్‌కోవ్‌స్కా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో వొజ్నియాకి 4-6, 7-5, 6-7 (1/7)తో ఓడిపోయింది. 3 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొజ్నియాకి నాలుగు మ్యాచ్ పాయింట్లను వదులుకొని ఓటమి పాలవ్వడం గమనార్హం. నిర్ణాయక మూడో సెట్‌లో స్కోరు 5-4 వద్ద సెట్‌కోవ్‌స్కా సర్వీస్‌లో ఒకసారి... స్కోరు 6-5 వద్ద సెట్‌కోవ్‌స్కా సర్వీస్‌లోనే మూడుసార్లు వొజ్నియాకి మ్యాచ్ పాయింట్లను చేజార్చుకుంది.

 గట్టెక్కిన ఆండీ ముర్రే
 పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఐదు సెట్‌ల పోరాటంలో గట్టెక్కగా... రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) కేవలం 80 నిమిషాల్లోనే తన ప్రత్యర్థిని చిత్తు చేశాడు. అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో జరిగిన రెండో రౌండ్‌లో ముర్రే 5-7, 4-6, 6-1, 6-3, 6-1తో విజయం సాధించాడు. ఫెడరర్ 6-1, 6-2, 6-1తో స్టీవ్ డార్సిస్ (బెల్జియం)పై గెలిచాడు. యూఎస్ ఓపెన్‌లో 16వ సారి ఆడుతోన్న ఫెడరర్ మూడో రౌండ్ చేరుకునేలోపు తన ప్రత్యర్థులకు కేవలం తొమ్మిది గేమ్‌లు కోల్పోవడం ఇదే తొలిసారి.

ఐదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్), 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా), 15వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. మరోవైపు చివరి సారిగా యూఎస్ ఓపెన్‌లో ఆడిన 2001 చాంపియన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) 3-6, 2-6, 6-3, 7-5, 5-7తో బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత హెవిట్ వీడ్కోలు తీసుకోనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement