Karolina pliskova
-
సూపర్ స్వియాటెక్
రోమ్ (ఇటలీ): పోలాండ్ టెన్నిస్ టీనేజ్ సంచలనం ఇగా స్వియాటెక్ రోమ్ ఓపెన్–1000 మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నీలో అద్భుతం చేసింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 29 ఏళ్ల కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన ఫైనల్లో 19 ఏళ్ల స్వియాటెక్ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా 6–0, 6–0తో వరుసగా రెండు సెట్లు గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. టెన్నిస్ పరిభాషలో ఒక్క గేమ్ కోల్పోకుండా సెట్ గెలిస్తే దానిని ‘బేగల్’ అని అంటారు. స్వియాటెక్ రెండు సెట్లను కూడా 6–0తోనే నెగ్గి ‘డబుల్ బేగల్’ సాధించింది. 1930 నుంచి జరుగుతున్న రోమ్ ఓపెన్‌లో ఓ ప్లేయర్ 6–0, 6–0తో గెలిచి టైటిల్ నెగ్గడం ఇదే ప్రథమం. ప్లిస్కోవాపై కేవలం 46 నిమిషాల్లో నెగ్గిన స్వియాటెక్ మ్యాచ్ మొత్తంలో 12 గేముల్లో కలిపి కేవలం 13 పాయింట్లు ప్రత్యర్థికి కోల్పోయింది. తొలి సెట్లో నాలుగు పాయింట్లు, రెండో సెట్లో తొమ్మిది పాయింట్లు మాత్రమే స్వియాటెక్ చేజార్చుకుంది. వరుసగా మూడోసారి ఫైనల్ ఆడిన ప్లిస్కోవా 2019లో టైటిల్ గెలిచి 2020లో, ఈ ఏడాది రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం. విజేత హోదాలో స్వియాటెక్‌కు 1,78,630 యూరోలు (రూ. కోటీ 58 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి. కెరీర్లో మూడో టైటిల్ నెగ్గిన స్వియాటెక్ సోమవారం విడుదల చేసే డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–10లోకి వస్తుంది. తన ప్రొఫెషనల్ కెరీర్లో స్వియాటెక్కిదే తొలి ‘డబుల్ బేగల్’ విజయం కావడం విశేషం. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నెగ్గిన స్వియాటెక్ ఈ ఏడాది అడిలైడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. నాలుగోసారి... గత 21 ఏళ్లలో ఓ డబ్ల్యూటీఏ టోర్నీ ఫైనల్లో ‘డబుల్ బేగల్’ నమోదు కావడం ఇది నాలుగోసారి కావడం విశేషం. చివరిసారి 2016లో బుకారెస్ట్ ఓపెన్ ఫైనల్లో సిమోనా హలెప్ (రొమేనియా) 6–0, 6–0తో అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా)ను ఓడించింది. అంతకుముందు 2013 సిడ్నీ ఓపెన్ ఫైనల్లో అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) 6–0, 6–0తో డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా)పై... 2006 క్యూబెక్ సిటీ ఓపెన్ ఫైనల్లో మారియన్ బర్తోలీ (ఫ్రాన్స్) 6–0, 6–0తో ఓల్గా పుచ్కోవా (రష్యా)పై గెలిచారు. -
నాదల్ దూకుడు
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మహిళల ఈవెంట్లో మళ్లీ సంచలనాల మోత మోగింది. చెక్ రిపబ్లిక్ స్టార్, రెండో సీడ్ ప్లిస్కోవా ఆట మూడో రౌండ్లోనే ముగిసింది. ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ బెన్సిక్ (స్విట్జర్లాండ్)లపై ప్రత్యర్థులు సంచలన విజయాలు నమోదు చేశారు. పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ దిగ్గజం నాదల్ అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఏడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), 15వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), 23వ సీడ్ కిర్గియోస్ (ఆ్రస్టేలియా)లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఎదురేలేని నాదల్ టైటిల్ ఫేవరెట్, స్పానిష్ టాప్‌సీడ్ రాఫెల్ నాదల్ ఏకపక్ష విజయంతో ముందంజ వేశాడు. ఇప్పటికే 19 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఈ దిగ్గజ ఆటగాడు 20వ టైటిలే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో అతను వరుస సెట్లలో 6–1, 6–2, 6–4తో తన దేశానికే చెందిన 27వ సీడ్ కారెనో బుస్టాను ఓడించాడు.కేవలం గంటా 38 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించాడు. మిగతా పోటీల్లో మెద్వెదెవ్ 6–4, 6–3, 6–2తో అలెక్సి పొపిరిన్ (ఆ్రస్టేలియా)పై, డొమినిక్ థీమ్ 6–2, 6–4, 6–7 (5/7), 6–4తో అమెరికాకు చెందిన ఫ్రిట్జ్‌పై, జ్వెరెవ్ 6–2, 6–2, 6–4తో వెర్డాస్కో (స్పెయిన్)పై, పదో సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 7–6 (7/2), 6–4, 6–3తో క్వాలిఫయర్ ఎర్నెస్ట్స్ గుల్బిస్ (లాతి్వయా)పై గెలుపొందారు. 23వ సీడ్ కిర్గియోస్ 6–2, 7–6 (7/5), 6–7 (6/8), 6–7 (7/9), 7–6 (10/8)తో 16వ సీడ్ కచనోవ్ (రష్యా)పై చెమటోడ్చి నెగ్గాడు. వావ్రింకా 6–4, 4–1తో ఇస్నర్ (అమెరికా)పై ముందంజలో ఉండగా... ప్రత్యర్థి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ప్లిస్కోవాపై రష్యన్ సంచలనం గతేడాది ఈ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో సెమీస్ చేరిన ప్రపంచ రెండో ర్యాంకర్ ప్లిస్కోవా ఈసారి మూడోరౌండ్తోనే సరిపెట్టుకుంది. రష్యాకు చెందిన అనస్తాసియా పాల్యుచెంకొవా 7–6 (7/4), 7–6 (7/3)తో రెండో సీడ్ ప్లిస్కోవాపై సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో రెండు సెట్లు కూడా టైబ్రేక్‌కు దారితీశాయి. మిగతా మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో స్విస్ స్టార్, ఆరో సీడ్ బెన్సిక్ 0–6, 1–6తో 28వ సీడ్ అనెట్ కొంటవెట్ (ఈస్టోనియా) చేతిలో చిత్తుగా ఓడింది. మాజీ ప్రపంచ నంబర్‌వన్ ముగురుజా (స్పెయిన్) 6–1, 6–2తో ఐదో సీడ్ స్వితోలినాను ఇంటిదారి పట్టించగా... నాలుగో సీడ్ హలెప్ (రొమేనియా) 6–1, 6–4తో పుతినెత్సెవా (కజకిస్తాన్)పై సునాయాస విజయం సాధించింది. 2016 చాంపియన్, 17వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6–2, 6–7 (4/7), 6–3తో కెమిలా జియోర్జి (ఇటలీ)పై, 16వ సీడ్ మెర్టెన్స్ (బెల్జియం) 6–1, 6–7 (5/7), 6–0తో బెలిస్ (అమెరికా)పై నెగ్గారు. మిక్స్‌డ్‌లో బోపన్న జోడీ ముందంజ భారత సీనియర్ డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిచెనొక్తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలిరౌండ్లో భారత్–ఉక్రెయిన్ జోడి 7–5, 4–6, 10–6తో క్రాజిసెక్ (అమెరికా)– లైడ్మిలా కిచెనొక్ (ఉక్రెయిన్) జంటపై గెలిచింది. రెండో రౌండ్లో బోపన్న–నదియా ద్వయం... నికోల్ మెలిచర్ (అమెరికా)–బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంటతో తలపడుతుంది. నిజానికి బోపన్న హైదరాబాదీ స్టార్ సానియా మీర్జాతో జోడీ కట్టాలనుకున్నాడు. కానీ ఆమె గాయంతో ని్రష్కమించడంతో ఉక్రెయిన్ భాగస్వామితో కలిసి ఆడుతున్నాడు. -
గట్టెక్కిన బార్టీ, ప్లిస్కోవా
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 4–6, 1–6, 2–6తో ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో ఓడిన ప్రజ్నేశ్‌కు 58,000 డాలర్ల (రూ. 41 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో రెండో సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ ఇద్దరు మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులకు తమ ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన బార్టీ గంటా 41 నిమిషాల్లో 1–6, 6–3, 6–2తో జరీనా దియాస్ (కజకిస్తాన్)పై గెలుపొందగా... 2016 యూఎస్ ఓపెన్ రన్నరప్ ప్లిస్కోవా గంటా 46 నిమిషాల్లో 7–6 (8/6), 7–6 (7/3)తో తన దేశానికే చెందిన తెరెజా మార్టిన్కోవాను ఓడించింది. దియాస్తో జరిగిన మ్యాచ్‌లో బార్టీ ఎనిమిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో 16వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) 6–1, 4–6, 6–2తో కసత్కినా (రష్యా)పై, 12వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) 6–3, 6–3తో యూజిన్ బుషార్డ్ (కెనడా)పై గెలిచారు. 2016 రియో ఒలింపిక్స్ విజేత మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో) 3–6, 3–6తో రెబెకా (స్వీడన్) చేతిలో... 2011 యూఎస్ ఓపెన్ విజేత సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 1–6, 3–6తో ఎకతెరీనా (రష్యా) చేతిలో... 27వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–7 (8/10), 2–6తో ఓన్స్ జబీర్ (ట్యునీషియా) చేతిలో ఓడిపోయారు. -
రెండో సీడ్ ప్లిస్కోవాకు షాక్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మరో సీడెడ్ ప్లేయర్‌కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోనే నిష్క్రమించింది. తొమ్మిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ఇంటి దారి పట్టింది. పురుషుల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఏడో సీడ్ నిషికొరి అతికష్టమ్మీద మూడో రౌండ్ గట్టెక్కాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ ప్లిస్కోవా 3–6, 3–6తో 31వ సీడ్ పెట్రా మార్టిక్ (క్రొయేషియా) చేతిలో కంగుతింది. మొత్తానికి ప్లిస్కోవా పరాజయం ఒసాకాకు వరమైంది. ఆమె నంబర్‌వన్ ర్యాంకుకు ఢోకా లేకుండాపోయింది. ఫ్రెంచ్ ఓపెన్ ముగిశాక కూడా ఈ జపాన్ స్టార్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఇతర మ్యాచ్‌ల్లో స్వితోలినా 3–6, 3–6తో 19వ సీడ్ ముగురుజా (స్పెయిన్) చేతిలో... 15వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 4–6, 1–6తో డోనా వెకిచ్ (క్రొయేషియా) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 6–1, 7–6 (10/8) కాస్పర్ రూడ్ (నార్వే)పై, నాదల్ 6–1, 6–3, 4–6, 6–3తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో జపాన్ స్టార్, ఏడో సీడ్ సీడ్ నిషికోరి మూడో రౌండ్ దాటేందుకు నాలుగున్నర గంటలు పోరాడాల్సి వచ్చింది. చివరకు నిషికోరి 6–4, 6–7 (6/8), 6–3, 4–6, 8–6తో లాస్లో డెర్ (సెర్బియా)పై నెగ్గాడు. పేస్ జోడీ శుభారంభం పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్) జోడీ 6–4, 6–4తో ఇంగ్లంట్ (బ్రిటన్)–కిజాన్ (స్లోవేకియా) జంటను ఓడించింది. రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–కోపిల్ (రొమేనియా) ద్వయం 6–4, 6–4తో బెంజమిన్ బోంజీ–హోయంగ్ (ఫ్రాన్స్) జంటపై గెలుపొందింది. దివిజ్ శరణ్ (భారత్)–డెమోలైనర్ (బ్రెజిల్) ద్వయం 3–6, 4–6తో తొమ్మిదో సీడ్ కొంటినెన్ (ఫిన్లాండ్)–పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడింది. -
ఫ్రెంచ్ ఓపెన్: ప్లిస్కోవా ఇంటిబాట
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా(చెక్‌రిపబ్లిక్) ఇంటిబాట పట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్లిస్కోవా 3–6, 3–6తో 31వ సీడ్ పెట్రా మాట్రిచ్(క్రొయేషియా) చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 23 విన్నర్లు కొట్టిన ప్లిస్కోవా 28 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో సెవత్సోవా(లాత్వియా) 6–7 (3/7), 6–6, 11–9తో మెర్టెన్స్(బెల్జియం)పై, వాండ్రొసోవా(చెక్‌రిపబ్లిక్) 6–4, 6–4తో సూరజ్ నవారో(స్పెయిన్)పై, మాడిసన్ కీస్(అమెరికా) 7–5, 5–7, 6–3తో హాన్(ఆస్ట్రేలియా)పై, ముగురుజ(స్పెయిన్) 6–3, 6–3తో స్వితోలినా(ఉక్రెయిన్)పై నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. ఫెదరర్ టైబ్రేక్‌లో... పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్) 6–3, 6–1, 6–2, 7–6(10/8)తో రూడ్(నార్వే)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రెండు సెట్లు అలవోకగా గెల్చుకున్న ఫెదరర్‌కు మూడో సెట్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఈ సెట్‌ను టైబ్రేక్‌లో ఫెడెక్స్ గెలుచుకున్నాడు. కాగా, పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్(భారత్)–డెమోలైనర్(బ్రెజిల్) జోడీ పోరాటం ముగిసింది. హెన్నీ కొంటినెన్(ఫిన్లాండ్)–జాన్ పీర్స్(ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో 3–6, 4–6 దివిజ్ శరణ్ జోడీ పరాజయం పాలైంది. -
అయ్యో సెరెనా!
అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డు సమం చేసేందుకు స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ మరి కొంత కాలం వేచి చూడక తప్పదు. రెండేళ్ల క్రితం చివరిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదికపై మరో ట్రోఫీని ఆశించిన అమెరికా దిగ్గజం ఆట క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఇటీవలే యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో తన చేతిలోనే ఓడిన ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా అద్భుత ఆటతో సెరెనాపై ప్రతీకారం తీర్చుకుంది. మెల్బోర్న్: హోరాహోరీగా సాగిన సెరెనా విలియమ్స్ (అమెరికా), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మధ్య క్వార్టర్ ఫైనల్ పోరుకు అనూహ్య ముగింపు లభించింది. రెండు సెట్ల తర్వాత ఇద్దరూ చెరో సెట్ గెలిచి సమంగా నిలవగా... మూడో సెట్లో సెరెనా 5–1తో ఆధిక్యంలో నిలిచింది. మరో గేమ్ గెలిస్తే సెమీస్‌లో చోటు ఖాయమవుతుంది. కానీ ప్లిస్కోవా మొండిగా పోరాడింది. వరుసగా నాలుగు పాయింట్లు కాపాడుకొని ఆధిక్యాన్ని 2–5కు తగ్గించింది. ఆ తర్వాత అదే జోరుతో దూసుకుపోయి సెరెనా ఆట కట్టించింది. 2 గంటల 10 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో చివరకు ఏడో సీడ్ ప్లిస్కోవా 6–4, 4–6, 7–5 తేడాతో 16వ సీడ్ సెరెనాను చిత్తు చేసింది. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఓటమి అంచుల నుంచి... ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు సన్నాహకంగా సాగిన బ్రిస్బేన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి ఫామ్‌లో ఉన్న ప్లిస్కోవా తొలి సెట్లో ఆధిక్యం కనబర్చింది. పదో గేమ్‌ను నెగ్గి సెట్ గెలుచుకుంది. అయితే సెరెనా తన అనుభవాన్ని ఉపయోగిస్తూ రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. చివరి సెట్లో సెరెనా 5–1తో ముందంజలో నిలిచినప్పుడు మరో ఫలితం గురించి ఎవరూ ఊహించలేదు. కానీ ఈ దశలో సెరెనా ఆట గతి తప్పింది. కాలి మడమకు స్వల్ప గాయంతో సెరెనా కొంత ఇబ్బంది పడటాన్ని గుర్తించిన ఆమె ప్రత్యర్థి మరో అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా స్కోరు 5–5తో సమమైంది. 11వ గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన ప్లిస్కోవా... తర్వాతి గేమ్‌లో చెలరేగిపోయింది. సెరెనా కొట్టిన ఫోర్‌హ్యాండ్ నెట్‌ను తాకడంతో ప్లిస్కోవా గెలుపు ఖాయమైం ది. 4 డబుల్ ఫాల్ట్‌లు చేసిన అమెరికా స్టార్, ఏకంగా 37 అనవసర తప్పిదాలతో ఓటమిని ఆహ్వా నించింది. మరో క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–4, 6–1తో స్వితోలినా (ఉక్రె యిన్)పై నెగ్గి సెమీస్ చేరింది. 1994లో కిమికో డాటె తర్వాత తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ చేరిన తొలి జపాన్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. జొకోవిచ్ జోరు... పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. జపాన్‌కు చెందిన ఎనిమిదో సీడ్ కీ నిషికోరితో జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–1, 4–1తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి గాయం కారణంగా తప్పుకున్నాడు. హోరాహోరీగా సాగిన మరో క్వార్టర్స్‌లో లుకాస్ పుయి (ఫ్రాన్స్) 7–6 (7/4), 6–3, 6–7 (2/7), 6–4తో 16వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. నేటి షెడ్యూల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ క్విటోవాvsకొలిన్స్ ప్లిస్కోవాvsనయోమి ఒసాకా ఉదయం గం. 8.30 నుంచి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ రాఫెల్ నాదల్ vs సిట్సిపాస్ మధ్యాహ్నం గం. 2 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం.. సెరెనాకు షాక్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన మాజీ చాంపియన్ అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ కథ ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో సెరెనా అనూహ్యంగా ఓటమిపాలైంది. రెండు గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్లెస్కోవా 6-4, 4-6 7-5తో సెరెనాపై ఘనవిజయం సాధించి సెమీస్‌లోకి అడుగెట్టింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు ప్లెస్కోవానే పైచేయి సాధించింది. తొలి సెట్ కోల్పోయిన సెరెనా.. పుంజుకొని రెండోసెట్‌ను గెలిచింది. చివరి సెట్లో నువ్వా-నేనా అన్నట్లు గేమ్ సాగగా.. ప్లెస్కోవానే విజయం వరించింది. ఈ ఓటమితో 24వ గ్రాండ్ స్లామ్ నెగ్గాలని భావించిన సెరెనా ఆశలు గల్లంతయ్యాయి. దీంతో సెరెనా- ప్లిస్కోవా ముఖాముఖి 2-2గా నమోదైంది. 2016 యూఎస్ ఓపెన్ సెమీస్‌లో కూడా ప్లిస్కోవా చేతిలో సెరెనా ఖంగుతిన్నది. -
కెర్బర్కే కిరీటం
యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన జర్మనీ స్టార్ ఫైనల్లో కరోలినా ప్లిస్కోవాపై విజయం రూ. 23 కోట్ల 41 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ఆద్యంతం నిలకడగా రాణిస్తే అనుకున్న ఫలితం సాధించడం కష్టమేమీ కాదని జర్మనీ స్టార్ ఎంజెలిక్ కెర్బర్ నిరూపించింది. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఆమె కైవసం చేసుకుంది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరిన ఈ రెండో సీడ్ క్రీడాకారిణికి ఫైనల్లో మాత్రం గట్టిపోటీనే ఎదురైంది. అయితే క్లిష్ట సమయంలో సంయమనం కోల్పోకుండా ఆడిన కెర్బర్ యూఎస్ ఓపెన్ కిరీటాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. న్యూయార్క్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఎంజెలిక్ కెర్బర్ తన కెరీర్లో మరో గొప్ప విజయాన్ని సాధించింది. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గి, వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచి, రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ఈ జర్మనీ స్టార్ యూఎస్ ఓపెన్‌లోనూ తనదైన ముద్ర వేసింది. మహిళల సింగిల్స్ విభాగం టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో రెండో సీడ్ కెర్బర్ 6-3, 4-6, 6-4తో పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. విజేతగా నిలిచిన 28 ఏళ్ల కెర్బర్‌కు 35 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 41 లక్షలు), రన్నరప్ ప్లిస్కోవాకు 17 లక్షల 50 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 70 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విడుదలయ్యే మహిళల టెన్నిస్ సంఘం తాజా ర్యాంకింగ్స్‌లో కెర్బర్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంటుంది. ప్లిస్కోవా 11 నుంచి ఆరో ర్యాంక్‌కు ఎగబాకుతుంది. బ్రేక్‌తో మొదలు... విలియమ్స్ సిస్టర్స్ వీనస్, సెరెనాలను ఓడించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న 24 ఏళ్ల ప్లిస్కోవా ఈ కీలక మ్యాచ్‌లో ఒత్తిడికి లోనైంది. కెర్బర్ తొలి గేమ్‌లోనే ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కెర్బర్ శక్తివంతమైన రిటర్న్ షాట్లు సంధించగా... ప్లిస్కోవా పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. తొలి సెట్లో ఏకంగా 17 అనవసర తప్పిదాలు చేసిన ప్లిస్కోవా రెండో సెట్లో మాత్రం తేరుకుంది. ఏడో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ప్లిస్కోవా తన జోరు కొనసాగించింది. రెండో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని 3-1తో ముందంజ వేసింది. అయితే గతంలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన అనుభవంలేని ప్లిస్కోవా కీలకదశలో తడబడింది. ఆరో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ స్కోరును 3-3తో సమం చేసింది. ఆ తర్వాత పదో గేమ్‌లో మరోసారి ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ విజయాన్ని ఖాయం చేసుకుంది. 4 యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాలుగో ఎడంచేతి వాటం క్రీడాకారిణి కెర్బర్. గతంలో ఎవ్లీన్ సియర్స్ (1907), మార్టినా నవ్రతిలోవా (1983, 84, 86, 87), మోనికా సెలెస్ (1991, 92) మాత్రమే ఈ ఘనత సాధించారు. 4 ఓపెన్ శకంలో (1968 నుంచి) తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా, అదే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడిన నాలుగో క్రీడాకారిణి కెర్బర్. గతంలో గూలగాంగ్ కావ్లీ (1971), స్టెఫీ గ్రాఫ్ (1987), మార్టినా హింగిస్ (1997) ఈ ఘనత వహించారు. 4 పదేళ్లలో సెరెనా, అమెలీ మౌరెస్మో, జస్టిన్ హెనిన్ తర్వాత ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాలుగో క్రీడాకారిణి కెర్బర్. -
యూఎస్ ఓపెన్‌లో కొత్త చాంపియన్
గత ఏడాది మాదిరిగానే ఈసారీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ లో కొత్త చాంపియన్ అవతరించింది. రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) పై నెగ్గి తన ఖాతాలో తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను వేసుకుంది. చివరిసారిగా 1996లో స్టెఫీగ్రాఫ్ తర్వాత యూఎస్ ఓపెన్ నెగ్గిన జర్మనీ ప్లేయర్ గా కెర్బర్ నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన ఫైనల్లో నెంబర్ వన్ ర్యాంకర్ కెర్బర్ 6-3, 4-6, 6-4 తేడాతో చెక్ రిపబ్లిక్ భామ ప్లిస్కోవాపై విజయాన్ని సాధించింది. ఏ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నెగ్గిన కెర్బర్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడంతో ఆమెను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత కసితో వింబుల్డన్ లో మెరుగైన ఆటతీరుతో రన్నరప్ గా నిలిచి తన అభిమానుల్లో ఆశను రేకెత్తించింది. తాజాగా యూఎస్ ఓపెన్‌లో టాప్ ప్లేయర్స్ ను బోల్తాకొట్టిస్తూ ఫైనల్ చేరి.. సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనాను ఓడించిన ప్లిస్కోవాపై మూడు సెట్ల పోరులో తన సత్తా ఏంటో చూపించింది. ప్లిస్కోవా 17 అనవసర తప్పిదాలు చేసి తొలి సెట్ కోల్పోయింది. అయినా రెండో సెట్లో 17 విన్నర్లు సంధించి6-4తో సెట్ గెలవడంతో మూడో సెట్ కు వెళ్లింది. మూడో సెట్లో తక్కువ తప్పిదాలు చేసిన కెర్బర్ 4-4తో ఉన్న దశలో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా రెండు పాయింట్లు గెలచి సెట్ తో పాటు మ్యాచ్ నెగ్గింది. -
సెరెనాకు షాక్
న్యూయార్క్: అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కు షాక్ తగిలింది. 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవాలన్న ఆమె ఆశలపై చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా నీళ్లు చల్లింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సెమీఫైనల్లో సెరెనా ఓడించి ఫైనల్ కు చేరింది. వరుసగా 187 వారాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న సెరెనా.. 10 సీడ్ ప్లిస్కోవా చేతిలో 2-6, 7-6(7/5) తేడాతో పరాజయం పాలైంది. 1993 తర్వాత యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ప్రవేశించడం ఇదే మొదటిసారి. కెబర్ తో ఫైనల్లో కరోలినా ప్లిస్కోవా తలపడనుంది. సెరెనాకు ఓడించడం నమ్మలేకపోతున్నానని సెమీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లిస్కోవా వ్యాఖ్యానించింది. ‘నేను బాగా ఆడితే ఎవరినైనా ఓడిస్తానని నాకు తెలుసు. ఈరోజు బాగా ఆడాను. ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సెరెనా లాంటి గొప్ప క్రీడాకారిణిని ఓడించడం చాలా సంతోషంగా ఉంద’ని ప్లిస్కోవా పేర్కొంది. ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది. -
సెరెనా వర్సెస్ ప్లిస్కోవా
న్యూయార్క్:యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో అమెరికా స్టార్ క్రీడాకారిణి, నల్లకలువ సెమీస్‌కు చేరింది. మహిళల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెరెనా 6-2, 4-6, 6-3 తేడాతో సిమోనా హాలెప్(రొమేనియా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన సెరెనా.. రెండో సెట్‌ను కోల్సోయింది. ప్రత్యేకంగా రెండో సెట్లో హాలెప్ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలోనే సెరెనా డజనకు పైగా బ్రేక్ పాయింట్లను చేజార్చుకుని ఆ సెట్‌ను హాలెప్‌కు అప్పగించింది. ఈ టోర్నీలో సెరెనా సెట్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో సెరెనా పూర్తి నియంత్రణతో ఆడింది. ఈ సెట్ లో తొలుత 3-1 ఆధిక్యంలోకి వెళ్లిన సెరెనా వరుసగా పాయింట్లు సాధిస్తూ హాలెప్‌ను ఒత్తిడిలోకి నెట్టి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగే సెమీ ఫైనల్లో కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్)తో సెరెనా తలపడనుంది. గతేడాది యూఎస్ ఓపెన్ ను కోల్పోవడంతో క్యాలెండర్ స్లామ్‌ను సాధించే అవకాశాన్ని సెరెనా చేజార్చుకుంది. ఇప్పటివరకూ ఆరు యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్‌ను గెలిచిన సెరెనా మరో టైటిల్ పై కన్నేసింది. ఇప్పటివరకూ 22 గ్రాండ్ స్లామ్ లు గెలిచిన సెరెనా.. యూఎస్ ఓపెన్ ను గెలిస్తే అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. -
'సారీ.. మేము కూడా రియోకు రాలేం'
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): ఇటీవల బ్రెజిల్లో వెలుగుచూసిన జికా వైరస్ కారణంగా పలువురు ఆటగాళ్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సంకోచిస్తున్నారు. త్వరలో ఆరంభం కానున్న రియో ఒలింపిక్స్ నుంచి మరో ఇద్దరు టెన్నిస్ స్టార్లు వైదొలిగారు. చెక్ రిపబ్లిక్కు చెందిన వరల్డ్ ఎనిమిదో ర్యాంక్ ఆటగాడు టామస్ బెర్డిచ్‌తో పాటు అదే దేశానికి చెందిన మహిళా క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా రియో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కవింబుల్డన్ రన్నరప్ రానిచ్(కెనడా), 2014 ఫ్రెంచ్ ఓపెన్ మహిళా రన్నరప్ హాలెప్(రొమేనియా)లు రియోలో పాల్గొనడం లేదని ప్రకటించిన మరుక్షణమే ఆ సంఖ్య మరింత పెరగడం గమనార్హం. 'ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదని చెబుతున్నందుకు క్షమించండి. బ్రెజిల్లో ప్రాణాంతక జికా వైరస్ వ్యాప్తి చెందిన కారణంగా నేను వైదొలుగుతున్నాను. ఆరోగ్యపరమైన సమస్యలకు దూరంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది'అని బెర్డిచ్ తెలిపాడు. మరోవైపు కరోలినా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అక్కడ జికా వైరస్ ప్రబలడంతో నేను కూడా ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వస్తుందంటూ కరోలినా పేర్కొంది. -
ముగ్గురే మిగిలారు
♦ మహిళల టాప్-10లో ఏడుగురు అవుట్ ♦ నాలుగో సీడ్ వొజ్నియాకి ఇంటిముఖం ♦ యూఎస్ ఓపెన్ టోర్నీ న్యూయార్క్ : యువతారల తళుకులతో ఈసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల మోత మోగుతోంది. మూడో రౌండ్ పూర్తికాకముందే టాప్-10 సీడింగ్స్‌లో నుంచి ఏడుగురు క్రీడాకారిణులు ఇంటిముఖం పట్టారు. తాజాగా ఈ జాబితాలో నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్)... ఈ ఏడాది వింబుల్డన్ రన్నరప్, తొమ్మిదో సీడ్ గార్బినె ముగురుజా (స్పెయిన్) చేరారు. గాయం కారణంగా మూడో సీడ్ షరపోవా (రష్యా) చివరి నిమిషంలో వైదొలగగా... ఆరో సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్), ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. ఫలితంగా ప్రస్తుతం టాప్-10 నుంచి ముగ్గురు (టాప్ సీడ్ సెరెనా, రెండో సీడ్ సిమోనా హలెప్, ఐదో సీడ్ క్విటోవా) మాత్రమే బరిలో మిగిలారు. నాలుగు మ్యాచ్ పాయింట్లు వదులుకొని... కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గకుండానే గతంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన వొజ్నియాకికి ఈసారీ నిరాశే మిగిలింది. అన్‌సీడెడ్ పెట్రా సెట్‌కోవ్‌స్కా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో వొజ్నియాకి 4-6, 7-5, 6-7 (1/7)తో ఓడిపోయింది. 3 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొజ్నియాకి నాలుగు మ్యాచ్ పాయింట్లను వదులుకొని ఓటమి పాలవ్వడం గమనార్హం. నిర్ణాయక మూడో సెట్లో స్కోరు 5-4 వద్ద సెట్‌కోవ్‌స్కా సర్వీస్‌లో ఒకసారి... స్కోరు 6-5 వద్ద సెట్‌కోవ్‌స్కా సర్వీస్‌లోనే మూడుసార్లు వొజ్నియాకి మ్యాచ్ పాయింట్లను చేజార్చుకుంది. గట్టెక్కిన ఆండీ ముర్రే పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఐదు సెట్ల పోరాటంలో గట్టెక్కగా... రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) కేవలం 80 నిమిషాల్లోనే తన ప్రత్యర్థిని చిత్తు చేశాడు. అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో జరిగిన రెండో రౌండ్లో ముర్రే 5-7, 4-6, 6-1, 6-3, 6-1తో విజయం సాధించాడు. ఫెడరర్ 6-1, 6-2, 6-1తో స్టీవ్ డార్సిస్ (బెల్జియం)పై గెలిచాడు. యూఎస్ ఓపెన్‌లో 16వ సారి ఆడుతోన్న ఫెడరర్ మూడో రౌండ్ చేరుకునేలోపు తన ప్రత్యర్థులకు కేవలం తొమ్మిది గేమ్‌లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఐదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్), 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా), 15వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు చివరి సారిగా యూఎస్ ఓపెన్‌లో ఆడిన 2001 చాంపియన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) 3-6, 2-6, 6-3, 7-5, 5-7తో బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత హెవిట్ వీడ్కోలు తీసుకోనున్నాడు.