'సారీ.. మేము కూడా రియోకు రాలేం'
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): ఇటీవల బ్రెజిల్లో వెలుగుచూసిన జికా వైరస్ కారణంగా పలువురు ఆటగాళ్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో పాల్గొనేందుకు సంకోచిస్తున్నారు. త్వరలో ఆరంభం కానున్న రియో ఒలింపిక్స్ నుంచి మరో ఇద్దరు టెన్నిస్ స్టార్లు వైదొలిగారు. చెక్ రిపబ్లిక్కు చెందిన వరల్డ్ ఎనిమిదో ర్యాంక్ ఆటగాడు టామస్ బెర్డిచ్తో పాటు అదే దేశానికి చెందిన మహిళా క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా రియో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కవింబుల్డన్ రన్నరప్ రానిచ్(కెనడా), 2014 ఫ్రెంచ్ ఓపెన్ మహిళా రన్నరప్ హాలెప్(రొమేనియా)లు రియోలో పాల్గొనడం లేదని ప్రకటించిన మరుక్షణమే ఆ సంఖ్య మరింత పెరగడం గమనార్హం.
'ఒలింపిక్స్లో పాల్గొనడం లేదని చెబుతున్నందుకు క్షమించండి. బ్రెజిల్లో ప్రాణాంతక జికా వైరస్ వ్యాప్తి చెందిన కారణంగా నేను వైదొలుగుతున్నాను. ఆరోగ్యపరమైన సమస్యలకు దూరంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది'అని బెర్డిచ్ తెలిపాడు. మరోవైపు కరోలినా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అక్కడ జికా వైరస్ ప్రబలడంతో నేను కూడా ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వస్తుందంటూ కరోలినా పేర్కొంది.