రోమ్ (ఇటలీ): పోలాండ్ టెన్నిస్ టీనేజ్ సంచలనం ఇగా స్వియాటెక్ రోమ్ ఓపెన్–1000 మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నీలో అద్భుతం చేసింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 29 ఏళ్ల కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన ఫైనల్లో 19 ఏళ్ల స్వియాటెక్ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా 6–0, 6–0తో వరుసగా రెండు సెట్‌లు గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. టెన్నిస్ పరిభాషలో ఒక్క గేమ్ కోల్పోకుండా సెట్ గెలిస్తే దానిని ‘బేగల్’ అని అంటారు. స్వియాటెక్ రెండు సెట్‌లను కూడా 6–0తోనే నెగ్గి ‘డబుల్ బేగల్’ సాధించింది.
1930 నుంచి జరుగుతున్న రోమ్ ఓపెన్‌లో ఓ ప్లేయర్ 6–0, 6–0తో గెలిచి టైటిల్ నెగ్గడం ఇదే ప్రథమం. ప్లిస్కోవాపై కేవలం 46 నిమిషాల్లో నెగ్గిన స్వియాటెక్ మ్యాచ్ మొత్తంలో 12 గేముల్లో కలిపి కేవలం 13 పాయింట్లు ప్రత్యర్థికి కోల్పోయింది. తొలి సెట్‌లో నాలుగు పాయింట్లు, రెండో సెట్‌లో తొమ్మిది పాయింట్లు మాత్రమే స్వియాటెక్ చేజార్చుకుంది. వరుసగా మూడోసారి ఫైనల్ ఆడిన ప్లిస్కోవా 2019లో టైటిల్ గెలిచి 2020లో, ఈ ఏడాది రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం.
విజేత హోదాలో స్వియాటెక్‌కు 1,78,630 యూరోలు (రూ. కోటీ 58 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి. కెరీర్‌లో మూడో టైటిల్ నెగ్గిన స్వియాటెక్ సోమవారం విడుదల చేసే డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–10లోకి వస్తుంది. తన ప్రొఫెషనల్ కెరీర్‌లో స్వియాటెక్‌కిదే తొలి ‘డబుల్ బేగల్’ విజయం కావడం విశేషం. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నెగ్గిన స్వియాటెక్ ఈ ఏడాది అడిలైడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది.
నాలుగోసారి...
గత 21 ఏళ్లలో ఓ డబ్ల్యూటీఏ టోర్నీ ఫైనల్లో ‘డబుల్ బేగల్’ నమోదు కావడం ఇది నాలుగోసారి కావడం విశేషం. చివరిసారి 2016లో బుకారెస్ట్ ఓపెన్ ఫైనల్లో సిమోనా హలెప్ (రొమేనియా) 6–0, 6–0తో అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా)ను ఓడించింది. అంతకుముందు 2013 సిడ్నీ ఓపెన్ ఫైనల్లో అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) 6–0, 6–0తో డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా)పై... 2006 క్యూబెక్ సిటీ ఓపెన్ ఫైనల్లో మారియన్ బర్తోలీ (ఫ్రాన్స్) 6–0, 6–0తో ఓల్గా పుచ్‌కోవా (రష్యా)పై గెలిచారు.
సూపర్ స్వియాటెక్
Published Mon, May 17 2021 5:11 AM | Last Updated on Mon, May 17 2021 5:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment