Womens Tennis Association
-
సూపర్ సబలెంకా
బ్రిస్బేన్: గత ఏడాదిని ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించింది. ఆదివారం ముగిసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) బ్రిస్బేన్ ఓపెన్–500 టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన సింగిల్స్ ఫైనల్లో సబలెంకా 4–6, 6–3, 6 2తో ప్రపంచ 107వ ర్యాంకర్, క్వాలిఫయర్ పొలీనా కుదెర్మెతోవా (రష్యా)పై గెలిచింది. విజేతగా నిలిచిన సబలెంకాకు 1,92,475 డాలర్ల (రూ. 1 కోటీ 65 లక్షలు)ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కుదెర్మెతోవాతో జరిగిన తుది పోరులో సబలెంకా తొలి సెట్‌ను కోల్పోయినా... నెమ్మదిగా తేరుకొని ఆ తర్వాత వరుసగా రెండు సెట్లను సొంతం చేసుకుంది. 1 గంట 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఐదు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి... ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. కుదెర్మెతోవా ఆరు ఏస్‌లు సంధించినా... తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. టోర్నీ మొత్తంలో కేవలం ఒక సెట్‌ను కోల్పోయిన సబలెంకా తాజా విజయంతో కెరీర్లో 18వ సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సబలెంకా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. -
సబలెంక శుభారంభం
రియాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫైనల్స్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ అరైనా సబలెంక (బెలారస్) శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్ పోరులో సబలెంక 6–3, 6–4తో చైనా స్టార్, ఏడో సీడ్ జెంగ్ కిన్వెన్ను వరుససెట్లలో ఓడించింది. రెండు సెట్లలోనూ టాప్‌సీడ్ జోరుకు ఎదురే లేకుండాపోయింది. చైనా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సబలెంక గంటా 24 నిమిషాల్లో మ్యాచ్ గెలిచింది. నంబర్‌వన్ ప్లేయర్ 3 ఏస్‌లు సంధించి ఒకే ఒక్క డబుల్ ఫాల్ట్ చేయగా, జెంగ్ కిన్వెన్ 4 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 8 ఏస్‌లు సంధించినప్పటికీ టాప్‌సీడ్ జోరుకు చతికిలబడింది. ఓవరాల్‌గా వీళ్లిద్దరు ముఖాముఖిగా తలపడిన ఐదుసార్లు కూడా బెలారస్ స్టారే విజయం సాధించింది. ఈ ఏడాదే నాలుగుసార్లు చైనా ప్రత్యర్థిని ఓడించింది. ఈ సీజన్లో ఆ్రస్టేలియా ఓపెన్ ఫైనల్లో కిన్వెన్ను ఓడించి గ్రాండ్‌స్లామ్ గెలిచిన సబలెంక... యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్‌కు ఇంటిదారి చూపింది. ఇటీవల సొంతగడ్డ వూహాన్‌లోనూ కిన్‌వెన్‌కు సబలెంక చేతిలో నిరాశే ఎదురైంది. ఈ గ్రూప్‌లోని తర్వాతి రెండు మ్యాచ్‌లలో జాస్మిన్ పావొలిని, ఎలెనా రైబాకినాలపై గెలిస్తే సబలెంక వరల్డ్ నంబర్‌వన్ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు. -
‘ఫినిషింగ్ టచ్’ ఎవరిదో?
కాన్కున్ (మెక్సికో): మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరిగిన టోర్నీల్లో సాధించిన పాయింట్ల ఆధారంగా టాప్–8లో నిలిచిన క్రీడాకారిణులు ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి అర్హత సాధించారు. నవంబర్ ఐదో తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి మెక్సికోలోని కాన్కున్ నగరం ఆతిథ్యమిస్తోంది. ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), మూడో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా), నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్), ఐదో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా), ఆరో ర్యాంకర్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), ఏడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), తొమ్మిదో ర్యాంకర్ మరియా సాకరి (గ్రీస్) ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఎనిమిదో ర్యాంకర్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా వైదొలగడంతో సాకరికి ఈ టోర్నీలో ఆడే అవకాశం లభించింది. ‘బాకలార్ గ్రూప్’లో సబలెంకా, రిబాకినా, పెగూలా, సాకరి... ‘చెటుమల్ గ్రూప్’లో స్వియాటెక్, కోకో గాఫ్, జబర్, వొండ్రుసోవా ఉన్నారు. గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. గత ఏడాది రన్నరప్ సబలెంకా ఈసారి ఫైనల్ చేరితే ఆమె ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగిస్తుంది. ఈ సంవత్సరం సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి, యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరుకుంది. స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో, వొండ్రుసోవా వింబుల్డన్ టోర్నీలో, కోకో గాఫ్ యూఎస్ ఓపెన్‌లో టైటిల్స్ సాధించారు. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ 90 లక్షల డాలర్లు (రూ. 75 కోట్లు). పార్టిసిపేషన్ ఫీజు రూపంలో ఎనిమిది మందికి 1,98,000 డాలర్ల (రూ. కోటీ 65 లక్షలు) చొప్పున లభిస్తాయి. లీగ్ దశలో ఒక్కో విజయానికి అదనంగా 1,98,000 డాలర్లు (రూ. కోటీ 65 లక్షలు) అందజేస్తారు. ఈ టోర్నీలో అజేయంగా విజేతగా నిలిచిన క్రీడాకారిణి 30,24,000 డాలర్లు (రూ. 25 కోట్ల 21 లక్షలు) ప్రైజ్‌మనీగా అందుకుంటుంది. -
స్వియాటెక్‌కు సబలెంకా షాక్
టెక్సాస్ (అమెరికా): ఈ ఏడాదిని మరో టైటిల్‌తో ముగించాలని ఆశించిన ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)కు నిరాశ ఎదురైంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. బెలారస్ ప్లేయర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–2, 2–6, 6–1తో స్వియాటెక్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన స్వియాటెక్ సెమీస్‌లో మాత్రం సబలెంకా ధాటికి తడబడింది. ఈ ఏడాది స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు మరో ఆరు టోర్నీలలో విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఆమె 67 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో సెమీఫైనల్లో కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–2తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచి ఫైనల్లో సబలెంకాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. సాకరి కూడా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి కీలకమైన సెమీఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. -
నాటకీయ పరిణామాలు.. చైనాకు దిమ్మతిరిగే షాక్
అగ్రదేశాలతో పోటీ పడి పరుగులు తీసే క్రమంలో.. డ్రాగన్ కంట్రీ బొక్కాబోర్లా పడుతోంది. అది ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. అలాగే అంతర్జాతీయ సమాజంలో చైనా పేరును బద్నాం చేసేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా, చేష్టలకు పాల్పడ్డా సహించడం లేదు. ఈ క్రమంలోనే సొంత క్రీడాకారిణి విషయంలో తప్పటడుగు వేసి.. ఫలితం అనుభవిస్తోంది ఇప్పుడు. క్రీడలంటే అమిత ఆసక్తి చూపే చైనాపైనే ఇప్పుడు క్రీడాలోకం తిరగబడింది. కనిపించకుండా పోయిన చైనా టెన్సిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి ఆచూకీ చెప్పాల్సిందేనంటూ వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్(WTA) చైనాను ఏకీపారేసింది. ఆమె ఆచూకీ చెప్పేవరకు చైనాలో జరగాల్సిన అంతర్జాతీయ పోటీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి డబ్ల్యూటీఏ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పెంగ్ ఆచూకీ చెప్పేవరకు అంతర్జాతీయ టెన్నిస్ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న చైనాలో తక్షణమే పోటీలను నిలిపివేస్తున్నట్లు డబ్ల్యూటీఏ అధ్యక్షుడు స్టీవ్ సిమన్ ప్రకటించారు. ఈ విషయంలో డబ్ల్యూటీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి పూర్తి మద్దతు ఉన్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విషయంలోకి వెళితే.. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కీలకనేత జాంగ్ గవోలి (అధ్యక్షుడు జిన్ పింగ్‌కు కీలక అనుచరుడు) తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పెంగ్ షువాయి నవంబర్ 2న సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది. అయితే ఆమె ఏరోజైతే పోస్ట్ డిలీట్ చేసిందో ఆరోజు నుంచి కనిపించకుండా పోయింది. ఈ విషయం బయటకు తెలియడంతో పెంగ్ షువాయి అదృశ్యంపై పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. అంతర్జాతీయ టెన్నిస్ స్టార్లు నొవాక్ జకోవిచ్ మొదలుకొని సెరెనా, నవామీ ఒసాకా, నాదల్, పలువురు మాజీ టెన్నిస్ క్రీడాకారులతో పాటు ఇతర రంగాలకు చెందిన క్రీడాకారులు సైతం ఆమె ఆచూకీ చెప్పాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మోసం బట్టబయలు! కాగా, పెంగ్ కనిపించకపోవడంపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టీవ్ సిమన్. ఆమె ఆచూకీపై సందేహాలు వ్యక్తం చేస్తూ వెంటనే చైనా ప్రభుత్వం ఆమె ఆచూకీ గురించి చెప్పాలని.. లేదంటే ఆ దేశంలో జరగనున్న అన్ని టోర్నీలను తక్షణమే నిలిపివేస్తామని హెచ్చరించారు. దీంతో చైనా అధికార మీడియా సంస్థ హడావిడి మొదలుపెట్టింది. పెంగ్ పేరుతో డబ్ల్యూటీఏకి ఒక ఈ మెయిల్ పంపించింది. ''తాను సురక్షితంగానే ఉన్నానని.. నేను చేసిన ఆరోపణలు నిజం కావని.. త్వరలోనే బయటికి వస్తానని'' పేర్కొంది. ఇంకో మెట్టు ఎక్కి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఛైర్మన్ థామస్ బాచ్‌తో పెంగ్ మాట్లాడిదంటూ చైనా ప్రభుత్వం అక్కడి చానెళ్లలో పలు వీడియోలు ప్రసారం చేసింది. అయితే ఈ తతంగం అంతా డబ్ల్యూటీఏకు అనుమానాల్ని కలిగించింది. చైనా ప్రభుత్వం పంపించిన ఈమెయిల్, వీడియోకాల్‌పై అనుమానం వ్యక్తం చేసిన స్టీవ్ సిమన్ పెంగ్.. ఆచూకీపై స్పష్టమైన ఇవ్వాలని చైనాను కోరాడు. అయితే ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఆ దేశంలో నిర్వహించాల్సిన అన్ని టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోరీ్నకి యాష్లే బార్టీ దూరం
మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ నుంచి ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ యాష్లే బార్టీ వైదొలిగింది. వచ్చే నెల 10 నుంచి 17 వరకు మెక్సికోలని గ్వాడాలహారా నగరంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లోని టాప్–8 క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. ‘వచ్చే ఏడాదిలో కొత్త ఉత్సాహంతో బరిలో దిగేందుకు సీజన్ ముగింపు టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను’ అని 25 ఏళ్ల బార్టీ తెలిపింది. ఈ సీజన్లో బార్టీ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీతో కలిపి మొత్తం ఐదు టైటిల్స్ సాధించి ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనుంది. -
సూపర్ స్వియాటెక్
రోమ్ (ఇటలీ): పోలాండ్ టెన్నిస్ టీనేజ్ సంచలనం ఇగా స్వియాటెక్ రోమ్ ఓపెన్–1000 మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నీలో అద్భుతం చేసింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 29 ఏళ్ల కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన ఫైనల్లో 19 ఏళ్ల స్వియాటెక్ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా 6–0, 6–0తో వరుసగా రెండు సెట్లు గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. టెన్నిస్ పరిభాషలో ఒక్క గేమ్ కోల్పోకుండా సెట్ గెలిస్తే దానిని ‘బేగల్’ అని అంటారు. స్వియాటెక్ రెండు సెట్లను కూడా 6–0తోనే నెగ్గి ‘డబుల్ బేగల్’ సాధించింది. 1930 నుంచి జరుగుతున్న రోమ్ ఓపెన్‌లో ఓ ప్లేయర్ 6–0, 6–0తో గెలిచి టైటిల్ నెగ్గడం ఇదే ప్రథమం. ప్లిస్కోవాపై కేవలం 46 నిమిషాల్లో నెగ్గిన స్వియాటెక్ మ్యాచ్ మొత్తంలో 12 గేముల్లో కలిపి కేవలం 13 పాయింట్లు ప్రత్యర్థికి కోల్పోయింది. తొలి సెట్లో నాలుగు పాయింట్లు, రెండో సెట్లో తొమ్మిది పాయింట్లు మాత్రమే స్వియాటెక్ చేజార్చుకుంది. వరుసగా మూడోసారి ఫైనల్ ఆడిన ప్లిస్కోవా 2019లో టైటిల్ గెలిచి 2020లో, ఈ ఏడాది రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం. విజేత హోదాలో స్వియాటెక్‌కు 1,78,630 యూరోలు (రూ. కోటీ 58 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి. కెరీర్లో మూడో టైటిల్ నెగ్గిన స్వియాటెక్ సోమవారం విడుదల చేసే డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–10లోకి వస్తుంది. తన ప్రొఫెషనల్ కెరీర్లో స్వియాటెక్కిదే తొలి ‘డబుల్ బేగల్’ విజయం కావడం విశేషం. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నెగ్గిన స్వియాటెక్ ఈ ఏడాది అడిలైడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. నాలుగోసారి... గత 21 ఏళ్లలో ఓ డబ్ల్యూటీఏ టోర్నీ ఫైనల్లో ‘డబుల్ బేగల్’ నమోదు కావడం ఇది నాలుగోసారి కావడం విశేషం. చివరిసారి 2016లో బుకారెస్ట్ ఓపెన్ ఫైనల్లో సిమోనా హలెప్ (రొమేనియా) 6–0, 6–0తో అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా)ను ఓడించింది. అంతకుముందు 2013 సిడ్నీ ఓపెన్ ఫైనల్లో అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) 6–0, 6–0తో డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా)పై... 2006 క్యూబెక్ సిటీ ఓపెన్ ఫైనల్లో మారియన్ బర్తోలీ (ఫ్రాన్స్) 6–0, 6–0తో ఓల్గా పుచ్కోవా (రష్యా)పై గెలిచారు. -
స్వియాటెక్ @ 17
పారిస్: అందరి అంచనాలను తారుమారు చేసి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయింది. ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 54వ స్థానంలో ఉన్న 19 ఏళ్ల స్వియాటెక్ ‘గ్రాండ్’ విజయంతో 37 స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 17వ ర్యాంక్‌కు చేరుకుంది. రన్నరప్‌గా నిలిచిన సోఫియా కెనిన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి చేరింది. యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... సిమోనా హలెప్ రెండో ర్యాంక్‌లో (రొమేనియా), నయోమి ఒసాకా (జపాన్) మూడో ర్యాంక్‌లో ఉన్నారు. పురుషుల ర్యాంకింగ్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ జొకోవిచ్ (సెర్బియా) నంబర్‌వన్ స్థానంలోనే కొనసాగుతుండగా... విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 14వ ర్యాంక్ నుంచి కెరీర్ బెస్ట్ 8వ ర్యాంక్‌కు చేరుకోగా... ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) తొలిసారి పదో ర్యాంక్‌ను అందుకున్నాడు. -
ఔను... ఒక్కటి చేద్దాం: కింగ్
పారిస్: మహిళల, పురుషుల టెన్నిస్ పాలక మండళ్లను ఒకే గొడుగు కిందకు తెచ్చే డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ ఇటీవల ట్విట్టర్లో రెండు టెన్నిస్ పాలక వర్గాలను విలీనం చేయాలని సూచించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) విలీనానికి అతని సమకాలీన దిగ్గజం రాఫెల్ నాదల్ మద్దతు తెలపగా.... ఇప్పుడు ఈ జాబితాలో డబ్ల్యూటీఏ వ్యవస్థాపకులు బిల్లీ జీన్ కింగ్ చేరారు. విలీనానికి ఇదే సరైన సమయమని ఆమె అన్నారు. ఆమె 1973లో డబ్ల్యూటీఏను స్థాపించారు. అప్పట్లోనే తాను రెండు వర్గాలను ఏకం చేయాలని సూచించినా ఎవరూ పట్టించుకోలేదని... ఇప్పుడైనా సాకారం కావాలని ట్వీట్ చేశారు. -
వైరల్ : నీ ఏకాగ్రతను మెచ్చుకోవాల్సిందే
ముంబై : టెన్నిస్, క్రికెట్, ఇతర ఏ ఆటైనా సరే.. ఆటగాడు ఆడుతున్నాడంటే కచ్చితంగా కంటికి, చేతికి కో-ఆర్డినేషన్ చాలా అవసరం పడుతుంది. అప్పడే కదా ఒక ఆటగాడు పరిపూర్ణమైన షాట్ ఆడడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీంతో పాటు ఆటలో బ్యాలెన్సింగ్ అనేదానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తాజాగా వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్(డబ్ల్యూటీఏ) తన ట్విటర్లో ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక అమ్మాయి టెన్నిస్ ప్రాక్టీస్ సందర్భంగా బ్యాలెన్సింగ్ ఎంత బాగా చేసిందనేది చూపించారు. ఆమె తన కుడి చేతిలో రాకెట్ పట్టుకుని టెన్నిస్ బాల్‌తో ఆడుతూనే నడుముకు రింగ్ వేసుకొని బ్యాలెన్స్ చేసుకుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆమె ఆడుతున్నంత సేపు తన ఏకాగ్రత చెదరనివ్వడమే కాకుండా ఒక్కసారి కూడా రింగ్ కిందకు పడనివ్వలేదు. తర్వాత అదే రింగ్‌ను చేతిలోకి తీసుకొని.. రాకెట్‌తో బాల్‌ను కొడుతూనే ఏకకాలంలో రింగ్‌ను బ్యాలెన్స్ చేసింది. (అయ్యో ! రణ్వీర్ ఎంత పని జరిగే..) డబ్ల్యూటీఏ ట్విటర్లో స్పందిస్తూ.. ' ఈ అమ్మాయి టెన్నిస్ ఆడుతూనే రింగ్‌ను చక్కగా బ్యాలెన్స్ చేసింది. కంటికి చేతికి మధ్య సమన్వయం ఏర్పరచుకుంటునే ఏకాగ్రత కోల్పోకుండా ఆడింది. ఇదంతా చేయాలంటే ఏకాగ్రత, ప్రాక్టీస్‌తో పాటు ఓపిక కూడా ఎంతో అవసరం.. ఈ అమ్మాయి అవన్నీ ఎప్పుడో సాధించేసిందంటూ' క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నయోమి... నయా నంబర్‌వన్
పారిస్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లో జపాన్ ప్లేయర్ నయోమి ఒసాకా అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెల్చుకోవడంతో ఒసాకా మూడు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. అటు పురుషుల సింగిల్స్లోగాని, ఇటు మహిళల సింగిల్స్లోగాని ఆసియా నుంచి నంబర్‌వన్ స్థానాన్ని అందుకున్న తొలి ప్లేయర్‌గా ఒసాకా గుర్తింపు పొందింది. 1975లో అధికారికంగా కంప్యూటర్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక నంబర్‌వన్ స్థానానికి చేరిన 26వ మహిళా క్రీడాకారిణిగా ఒసాకా నిలిచింది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల ర్యాంకింగ్స్‌లో నొవాక్ జొకోవిచ్ 10,955 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మూడు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి చేరాడు. రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో స్థానంలో ఉండగా... అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఒక స్థానం మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌కు చేరాడు. -
ప్రాంజలకు నిరాశ
ముంబై: తొలిసారి మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఓపెన్ టోర్నీలో మెయిన్ డ్రాకు అర్హత సాధించిన హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు నిరాశ ఎదురైంది. ముంబై ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఆమె పోరాటం తొలిరౌండ్లోనే ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో ప్రపంచ 228వ ర్యాంకర్ ప్రాంజల 6–3, 5–7, 1–6తో ఐదో సీడ్ లక్‌సికా కుమ్‌ఖుమ్ (థాయ్‌లాండ్) చేతిలో 2 గంటల 13 నిమిషాల పాటు పోరాడి ఓడిపోయింది. ఇటీవలే వరుసగా రెండు ఐటీఎఫ్ (లాగోస్, నైజీరియా) టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచిన ప్రాంజల తొలిసెట్‌ను 6–3తో నెగ్గి... రెండో సెట్లోనూ ఒక దశలో 5–3తో నిలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకునేలా కనిపించింది. అయితే ఈ దశలో పుంజుకున్న థాయ్ క్రీడాకారిణి ప్రాంజల సర్వీస్‌ను బ్రేక్ చేసి 7–5తో సెట్‌ను గెలుచుకుని రేసులో నిలిచింది. మూడో సెట్లోనూ అదే ఆధిపత్యం ప్రదర్శించి గేమ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో కర్మన్ కౌర్(భారత్) 2–6, 4–6తో టాప్‌సీడ్ సెయ్‌సెయ్ జెంగ్ (చైనా) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయింది. -
మెయిన్ ‘డ్రా’కు ప్రాంజల అర్హత
ముంబై: అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల తొలిసారి మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఓపెన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన ముంబై ఓపెన్ మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో ప్రాంజల 6–4, 6–3తో ఒక్సానా కలిష్నికోవా (జార్జియా)పై గెలిచి మెయిన్ ‘డ్రా’కు చేరింది. గంటా 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ప్రాంజల వరుస సెట్లలో ప్రత్యర్థి ఆటకట్టించింది. గతేడాది ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ రౌండ్ దాటలేకపోయిన ఆమె ఈసారి సత్తాచాటింది. క్వాలిఫయింగ్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌లో మెహక్ జైన్ (భారత్) 3–6, 4–6తో హిరోకో కువాటా (జపాన్) చేతిలో ఓడింది. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు సోమవారం విశ్రాంతి దినం. ఇదే వేదికపై భారత్–వెస్టిండీస్‌ల మధ్య నాలుగో వన్డే జరుగనుండటంతో మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లను మంగళవారం నిర్వహించనున్నారు. -
సూపర్ స్వితోలినా
సింగపూర్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌ను ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్వితోలినా సొంతం చేసుకుంది. సింగపూర్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ స్వితోలినా 3–6, 6–2, 6–2తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)ను ఓడించింది. ఈ క్రమంలో 2013లో సెరెనా విలియమ్స్ తర్వాత ఈ టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్ దక్కించుకున్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గ్రూప్ దశలో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా వొజ్నియాకి (డెన్మార్క్), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)లపై నెగ్గిన స్వితోలినా... సెమీఫైనల్లో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించింది. విజేతగా నిలిచిన స్వితోలినాకు 23 లక్షల 60 వేల డాలర్లు (రూ. 17 కోట్ల 25 లక్షలు), రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్కు 12 లక్షల డాలర్లు (రూ. 8 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
సెరెనా చేజారనున్న నంబర్‌వన్ ర్యాంక్
లాస్ ఏంజిల్స్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో 11 రోజుల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోనుంది. మోకాలి గాయం కారణంగా సెరెనా బుధవారం మొదలైన ఇండియన్ వెల్స్ ఓపెన్ నుంచి... ఈనెల 21 నుంచి జరగాల్సిన మియామి ఓపెన్ నుంచి వైదొలిగింది. ఫలితంగా ఇండియన్ వెల్స్ టోర్నీ ముగిశాక ఈనెల 20న విడుదలయ్యే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా ర్యాంకింగ్స్‌లో సెరెనా తన టాప్ ర్యాంక్‌ను రెండో స్థానంలో ఉన్న జర్మనీ ప్లేయర్ ఎంజెలిక్ కెర్బర్‌కు అప్పగించనుంది. జనవరి 29న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ సాధించిన అనంతరం సెరెనా మరో టోర్నీలో పాల్గొనలేదు. ‘మోకాలి గాయం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇండియన్ వెల్స్, మియామి టోర్నీలకు దూరం కావాల్సి వస్తోంది. గాయం నుంచి తేరుకొని సాధ్యమైనంత త్వరలో పునరాగమనం చేస్తాను’ అని 35 ఏళ్ల సెరెనా వ్యాఖ్యానించింది. -
సానియా-హింగిస్ జంట ప్రత్యర్థి చాన్ సిస్టర్స్
న్యూఢిల్లీ: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జోడీ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)కి రెండో సీడింగ్ లభించింది. గురువారం మొదలయ్యే డబుల్స్ టోర్నమెంట్లో ఎనిమిది జంటలు నాకౌట్ పద్ధతిలో టైటిల్ కోసం పోటీపడనున్నారుు. శుక్రవారం జరిగే తొలి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన అక్కాచెల్లెళ్లు హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్‌లతో సానియా-హింగిస్ తలపడతారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్లో ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) లేదా ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా)లతో ఈ ఇండో-స్విస్ జంట ఆడాల్సి ఉంటుంది. 2014లో కారా బ్లాక్ (జింబాబ్వే)తో, 2015లో హింగిస్‌తో సానియా ఈ టైటిల్‌ను సాధించింది. ఈసారీ టైటిల్ గెలిస్తేనే సానియా ఈ ఏడాదిని టాప్ ర్యాంకర్‌గా ముగించే అవకాశం ఉంది. ఇటీవలే హింగిస్‌తో తన భాగస్వామ్యానికి ముగింపు పలికిన సానియా ఈ మెగా ఈవెంట్ కోసం మళ్లీ జతకట్టింది. -
సానియా 81వ వారం..
లండన్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్‌సలో భారత స్టార్ సానియా మీర్జా వరుసగా 81వ వారం కూడా తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌సలో సానియా 7815 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది. మహిళల డబుల్స్‌లో వరుసగా అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా ఉన్న క్రీడాకారిణుల జాబితాలో సానియా నాలుగో స్థానంలో ఉంది. మార్టినా నవ్రతిలోవా (181 వారాలు), కారా బ్లాక్ (145 వారాలు), లీజెల్ హుబెర్ (134 వారాలు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
ఎన్నో త్యాగాల ఫలితమిది
ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌పై సానియా వ్యాఖ్య ఏటికి ఎదురీది ఈ స్థాయికి వచ్చాను గత ఐదు వారాలు ఎంతో ప్రత్యేకం ‘ఫ్రెంచ్’ టైటిల్‌పై గురి చార్ల్స్టన్ (అమెరికా): చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రతికూలతలు ఎదురైనా... ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తూ... తనతోపాటు కుటుంబసభ్యులు చేసిన కృషి, త్యాగాల ఫలితమే ‘ప్రపంచ నంబర్‌వన్’ ర్యాంక్ అని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జా అధికారికంగా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. గతవారం మూడో ర్యాంక్‌లో ఉన్న సానియా తాజాగా 7,660 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకగా... నంబర్‌వన్‌గా ఉన్న సారా ఎరాని (ఇటలీ) 7,640 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో టైటిల్ నెగ్గిన తర్వాత సానియా మీర్జా పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే.... హింగిస్ తోడ్పాటు అద్భుతం: నా కెరీర్లో గత ఐదు వారాలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇండియన్ వెల్స్ టోర్నీలో ఆడే సమయానికి నేను నంబర్‌వన్ ర్యాంక్‌కు 2,500 పాయింట్ల దూరంలో ఉన్నాను. అయితే మూడు టోర్నమెంట్లు ఆడాక నంబర్‌వన్ ర్యాంక్ దక్కడంతో నా ఆనందం రెట్టింపైంది. నా కల నిజం కావడంలో మార్టినా హింగిస్ సహకారం మరువలేను. ఈ మూడు టోర్నమెంట్ల సందర్భంగా కొన్ని కీలకదశల్లో ఆమె తోడ్పాటుతో గట్టెక్కాను. ఆమె గొప్ప చాంపియన్. ఈ ఘనత చిరకాలం: ప్రతికూలతలను అధిగమించి... నేను, నా కుటుంబసభ్యులు చేసిన కృషి, త్యాగాలకు నేడు తగిన గుర్తింపు లభించింది. ఈ ఘనతను నా నుంచి ఎవరూ తీసుకోలేరు. 50 ఏళ్ల తర్వాత కూడా నన్ను మాజీ నంబర్‌వన్ ప్లేయర్‌గానే గుర్తిస్తారు. ఈ అనుభూతి ఎంతో ప్రత్యేకం. ఎన్నో సవాళ్లు ఎదురైనా ఎదురొడ్డి నిలిచి నంబర్‌వన్ ర్యాంక్ సాధించాను. నా వంతుగా దేశానికి పేరు తెచ్చాను. ఏటికి ఎదురీదాను: ప్రస్తుతం నేను నా స్వీయచరిత్రను రాస్తున్నాను. దాని టైటిల్ పేరు ‘అగేనెస్ట్ ఆల్ ఆడ్స్’. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. ఆరేళ్ల వయస్సులో నేను రాకెట్ పట్టే సమయానికి ప్రత్యేకంగా క్లే కోర్టులు, హార్డ్ కోర్టులు లాంటివి లేవు. చెప్పుకుంటే వింతగా అనిపిస్తుంది కానీ ఆవు పేడతో తయారుచేసిన కోర్టుపై సాధన చేశాను. అలాంటి పరిస్థితుల నడుమ రాకెట్ చేతపట్టి ప్రపంచంలో అత్యున్నతస్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగడమంటే ఏటికి ఎదురీదాననే అనుకుంటున్నాను. ఏదైనా సాధ్యమే: పట్టుదల, గట్టి సంకల్పం ఉంటే సకల సౌకర్యాలు లేకపోయినా టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకొని అత్యున్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమే. ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళల విభాగానికి నేను గుడ్‌విల్ అంబాసిడర్‌ను. ప్రతి మహిళ, అమ్మాయి తమని తాము ఓ శక్తిగా భావించాలే తప్ప బలహీనత అని అనుకోకూడదు. గట్టి సంకల్పంతో ముందుకు సాగుతూ త్యాగాలు చేస్తూ శ్రమిస్తే ఎలాంటి నేపథ్యం ఉన్న వాళ్లయినా అద్భుతాలు చేయగలరు. మరిన్ని విజయాలపై దృష్టి: మార్టినా హింగిస్‌తో భాగస్వామ్యం అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఆమెతో కలిసి వరుసగా మూడు టోర్నమెంట్లలో టైటిల్స్ గెలవడంతో చాలా ఆనందంగా ఉన్నాను. మిక్స్డ్ డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించినప్పటికీ మహిళల డబుల్స్ విభాగంలో నా ఖాతాలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ లేదు. వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ కొరత తీర్చుకునేందుకు తీవ్రంగా సాధన చేస్తాను.