ఎన్నో త్యాగాల ఫలితమిది | Sania Mirza: World No. 1 Ranking a Dream Come True | Sakshi
Sakshi News home page

ఎన్నో త్యాగాల ఫలితమిది

Published Tue, Apr 14 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

ఎన్నో త్యాగాల ఫలితమిది

ఎన్నో త్యాగాల ఫలితమిది

 ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌పై సానియా వ్యాఖ్య
 ఏటికి ఎదురీది ఈ స్థాయికి వచ్చాను
 గత ఐదు వారాలు ఎంతో ప్రత్యేకం
 ‘ఫ్రెంచ్’ టైటిల్‌పై గురి
 
 చార్ల్స్‌టన్ (అమెరికా): చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రతికూలతలు ఎదురైనా... ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తూ... తనతోపాటు కుటుంబసభ్యులు చేసిన కృషి, త్యాగాల ఫలితమే ‘ప్రపంచ నంబర్‌వన్’ ర్యాంక్ అని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జా అధికారికంగా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. గతవారం మూడో ర్యాంక్‌లో ఉన్న సానియా తాజాగా 7,660 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకగా... నంబర్‌వన్‌గా ఉన్న సారా ఎరాని (ఇటలీ) 7,640 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో టైటిల్ నెగ్గిన తర్వాత సానియా మీర్జా పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే....
 
 హింగిస్ తోడ్పాటు అద్భుతం: నా కెరీర్‌లో గత ఐదు వారాలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇండియన్ వెల్స్ టోర్నీలో ఆడే సమయానికి నేను నంబర్‌వన్ ర్యాంక్‌కు 2,500 పాయింట్ల దూరంలో ఉన్నాను. అయితే మూడు టోర్నమెంట్లు ఆడాక నంబర్‌వన్ ర్యాంక్ దక్కడంతో నా ఆనందం రెట్టింపైంది. నా కల నిజం కావడంలో మార్టినా హింగిస్ సహకారం మరువలేను. ఈ మూడు టోర్నమెంట్ల సందర్భంగా కొన్ని కీలకదశల్లో ఆమె తోడ్పాటుతో గట్టెక్కాను. ఆమె గొప్ప చాంపియన్. ఈ ఘనత చిరకాలం: ప్రతికూలతలను అధిగమించి... నేను, నా కుటుంబసభ్యులు చేసిన కృషి, త్యాగాలకు నేడు తగిన గుర్తింపు లభించింది. ఈ ఘనతను నా నుంచి ఎవరూ తీసుకోలేరు. 50 ఏళ్ల తర్వాత కూడా నన్ను మాజీ నంబర్‌వన్ ప్లేయర్‌గానే గుర్తిస్తారు. ఈ అనుభూతి ఎంతో ప్రత్యేకం. ఎన్నో సవాళ్లు ఎదురైనా ఎదురొడ్డి నిలిచి నంబర్‌వన్ ర్యాంక్ సాధించాను. నా వంతుగా దేశానికి పేరు తెచ్చాను.
 
 ఏటికి ఎదురీదాను: ప్రస్తుతం నేను నా స్వీయచరిత్రను రాస్తున్నాను. దాని టైటిల్ పేరు ‘అగేనెస్ట్ ఆల్ ఆడ్స్’. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. ఆరేళ్ల వయస్సులో నేను రాకెట్ పట్టే సమయానికి ప్రత్యేకంగా క్లే కోర్టులు, హార్డ్ కోర్టులు లాంటివి లేవు. చెప్పుకుంటే వింతగా అనిపిస్తుంది కానీ ఆవు పేడతో తయారుచేసిన కోర్టుపై సాధన చేశాను.
 
  అలాంటి పరిస్థితుల నడుమ రాకెట్ చేతపట్టి ప్రపంచంలో అత్యున్నతస్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగడమంటే ఏటికి ఎదురీదాననే అనుకుంటున్నాను. ఏదైనా సాధ్యమే: పట్టుదల, గట్టి సంకల్పం ఉంటే సకల సౌకర్యాలు లేకపోయినా టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకొని అత్యున్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమే. ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళల విభాగానికి నేను గుడ్‌విల్ అంబాసిడర్‌ను. ప్రతి మహిళ, అమ్మాయి తమని తాము ఓ శక్తిగా భావించాలే తప్ప బలహీనత అని అనుకోకూడదు. గట్టి సంకల్పంతో ముందుకు సాగుతూ త్యాగాలు చేస్తూ శ్రమిస్తే ఎలాంటి నేపథ్యం ఉన్న వాళ్లయినా అద్భుతాలు చేయగలరు.
 
 మరిన్ని విజయాలపై దృష్టి: మార్టినా హింగిస్‌తో భాగస్వామ్యం అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఆమెతో కలిసి వరుసగా మూడు టోర్నమెంట్లలో టైటిల్స్ గెలవడంతో చాలా ఆనందంగా ఉన్నాను. మిక్స్‌డ్ డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించినప్పటికీ మహిళల డబుల్స్ విభాగంలో నా ఖాతాలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ లేదు. వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ కొరత తీర్చుకునేందుకు తీవ్రంగా సాధన చేస్తాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement