డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ
రియాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫైనల్స్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ అరైనా సబలెంక (బెలారస్) శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్ పోరులో సబలెంక 6–3, 6–4తో చైనా స్టార్, ఏడో సీడ్ జెంగ్ కిన్‌వెన్‌ను వరుససెట్లలో ఓడించింది. రెండు సెట్లలోనూ టాప్‌సీడ్ జోరుకు ఎదురే లేకుండాపోయింది. చైనా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సబలెంక గంటా 24 నిమిషాల్లో మ్యాచ్ గెలిచింది.
నంబర్‌వన్ ప్లేయర్ 3 ఏస్‌లు సంధించి ఒకే ఒక్క డబుల్ ఫాల్ట్ చేయగా, జెంగ్ కిన్‌వెన్ 4 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 8 ఏస్‌లు సంధించినప్పటికీ టాప్‌సీడ్ జోరుకు చతికిలబడింది. ఓవరాల్‌గా వీళ్లిద్దరు ముఖాముఖిగా తలపడిన ఐదుసార్లు కూడా బెలారస్ స్టారే విజయం సాధించింది. ఈ ఏడాదే నాలుగుసార్లు చైనా ప్రత్యర్థిని ఓడించింది.
ఈ సీజన్‌లో ఆ్రస్టేలియా ఓపెన్ ఫైనల్లో కిన్‌వెన్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్ గెలిచిన సబలెంక... యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్‌కు ఇంటిదారి చూపింది. ఇటీవల సొంతగడ్డ వూహాన్‌లోనూ కిన్‌వెన్‌కు సబలెంక చేతిలో నిరాశే ఎదురైంది. ఈ గ్రూప్‌లోని తర్వాతి రెండు మ్యాచ్‌లలో జాస్మిన్ పావొలిని, ఎలెనా రైబాకినాలపై గెలిస్తే సబలెంక వరల్డ్ నంబర్‌వన్ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment