కాన్‌కున్ (మెక్సికో): మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరిగిన టోర్నీల్లో సాధించిన పాయింట్ల ఆధారంగా టాప్–8లో నిలిచిన క్రీడాకారిణులు ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి అర్హత సాధించారు. నవంబర్ ఐదో తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి మెక్సికోలోని కాన్‌కున్ నగరం ఆతిథ్యమిస్తోంది.
ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), మూడో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా), నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్), ఐదో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా), ఆరో ర్యాంకర్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), ఏడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), తొమ్మిదో ర్యాంకర్ మరియా సాకరి (గ్రీస్) ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
ఎనిమిదో ర్యాంకర్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా వైదొలగడంతో సాకరికి ఈ టోర్నీలో ఆడే అవకాశం లభించింది. ‘బాకలార్ గ్రూప్’లో సబలెంకా, రిబాకినా, పెగూలా, సాకరి... ‘చెటుమల్ గ్రూప్’లో స్వియాటెక్, కోకో గాఫ్, జబర్, వొండ్రుసోవా ఉన్నారు. గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
గత ఏడాది రన్నరప్ సబలెంకా ఈసారి ఫైనల్ చేరితే ఆమె ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగిస్తుంది. ఈ సంవత్సరం సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి, యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరుకుంది. స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో, వొండ్రుసోవా వింబుల్డన్ టోర్నీలో, కోకో గాఫ్ యూఎస్ ఓపెన్‌లో టైటిల్స్ సాధించారు.
మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ 90 లక్షల డాలర్లు (రూ. 75 కోట్లు). పార్టిసిపేషన్ ఫీజు రూపంలో ఎనిమిది మందికి 1,98,000 డాలర్ల (రూ. కోటీ 65 లక్షలు) చొప్పున లభిస్తాయి. లీగ్ దశలో ఒక్కో విజయానికి అదనంగా 1,98,000 డాలర్లు (రూ. కోటీ 65 లక్షలు) అందజేస్తారు. ఈ టోర్నీలో అజేయంగా విజేతగా నిలిచిన క్రీడాకారిణి 30,24,000 డాలర్లు (రూ. 25 కోట్ల 21 లక్షలు) ప్రైజ్‌మనీగా అందుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment