సెరెనా చేజారనున్న నంబర్‌వన్ ర్యాంక్
లాస్ ఏంజిల్స్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో 11 రోజుల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోనుంది. మోకాలి గాయం కారణంగా సెరెనా బుధవారం మొదలైన ఇండియన్ వెల్స్ ఓపెన్ నుంచి... ఈనెల 21 నుంచి జరగాల్సిన మియామి ఓపెన్ నుంచి వైదొలిగింది. ఫలితంగా ఇండియన్ వెల్స్ టోర్నీ ముగిశాక ఈనెల 20న విడుదలయ్యే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా ర్యాంకింగ్స్‌లో సెరెనా తన టాప్ ర్యాంక్‌ను రెండో స్థానంలో ఉన్న జర్మనీ ప్లేయర్ ఎంజెలిక్ కెర్బర్‌కు అప్పగించనుంది.
జనవరి 29న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ సాధించిన అనంతరం సెరెనా మరో టోర్నీలో పాల్గొనలేదు. ‘మోకాలి గాయం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇండియన్ వెల్స్, మియామి టోర్నీలకు దూరం కావాల్సి వస్తోంది. గాయం నుంచి తేరుకొని సాధ్యమైనంత త్వరలో పునరాగమనం చేస్తాను’ అని 35 ఏళ్ల సెరెనా వ్యాఖ్యానించింది.