
ముంబై: తొలిసారి మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఓపెన్ టోర్నీలో మెయిన్ డ్రాకు అర్హత సాధించిన హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు నిరాశ ఎదురైంది. ముంబై ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఆమె పోరాటం తొలిరౌండ్‌లోనే ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్‌లో ప్రపంచ 228వ ర్యాంకర్ ప్రాంజల 6–3, 5–7, 1–6తో ఐదో సీడ్ లక్‌సికా కుమ్‌ఖుమ్ (థాయ్‌లాండ్) చేతిలో 2 గంటల 13 నిమిషాల పాటు పోరాడి ఓడిపోయింది.
ఇటీవలే వరుసగా రెండు ఐటీఎఫ్ (లాగోస్, నైజీరియా) టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచిన ప్రాంజల తొలిసెట్‌ను 6–3తో నెగ్గి... రెండో సెట్‌లోనూ ఒక దశలో 5–3తో నిలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకునేలా కనిపించింది. అయితే ఈ దశలో పుంజుకున్న థాయ్ క్రీడాకారిణి ప్రాంజల సర్వీస్‌ను బ్రేక్ చేసి 7–5తో సెట్‌ను గెలుచుకుని రేసులో నిలిచింది. మూడో సెట్‌లోనూ అదే ఆధిపత్యం ప్రదర్శించి గేమ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో కర్మన్ కౌర్(భారత్) 2–6, 4–6తో టాప్‌సీడ్ సెయ్‌సెయ్ జెంగ్ (చైనా) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment