
ముంబై: అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల తొలిసారి మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఓపెన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన ముంబై ఓపెన్ మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో ప్రాంజల 6–4, 6–3తో ఒక్సానా కలిష్నికోవా (జార్జియా)పై గెలిచి మెయిన్ ‘డ్రా’కు చేరింది. గంటా 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ప్రాంజల వరుస సెట్లలో ప్రత్యర్థి ఆటకట్టించింది. గతేడాది ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ రౌండ్ దాటలేకపోయిన ఆమె ఈసారి సత్తాచాటింది. క్వాలిఫయింగ్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌లో మెహక్ జైన్ (భారత్) 3–6, 4–6తో హిరోకో కువాటా (జపాన్) చేతిలో ఓడింది.
ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు సోమవారం విశ్రాంతి దినం. ఇదే వేదికపై భారత్–వెస్టిండీస్‌ల మధ్య నాలుగో వన్డే జరుగనుండటంతో మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లను మంగళవారం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment