Pranjala Yadlapalli
-
విజేత ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న యూటీఆర్ ప్రొ టెన్నిస్ సిరీస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల ప్రాంజల 6–3, 6–3తో డబుల్స్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ డెసిరే క్రాజిక్ (అమెరికా)పై నెగ్గింది. 78 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల ఏడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. అంతకుముందు తన గ్రూప్‌లోని లీగ్ మ్యాచ్‌ల్లో ప్రాంజల 6–4, 6–3తో స్టెఫీ వెబ్ (ఆస్ట్రేలియా)పై, 6–2, 6–3తో అమీ స్టీవెన్స్ (ఆస్ట్రేలియా)పై గెలిచి ఫైనల్ చేరింది. వెన్ను నొప్పితో ప్రాంజల కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంది. ఫిబ్రవరి నుంచి ఆస్ట్రేలియాలో ఉన్న ప్రాంజల అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ పాల్ నెస్ మార్గనిర్దేశంలో చికిత్స తీసుకొని, కోలుకొని మళ్లీ బరిలోకి దిగింది. ‘ఒక టోర్నమెంట్ ఆడి మూడు రోజుల్లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడం చాలా సంతోషాన్నిస్తోంది. ఈ సందర్భంగా వ్యక్తిగత కోచ్ స్టీఫెన్ కూన్, గో స్పోర్ట్స్ ఫౌండేషన్, పాల్ నెస్‌కు ధన్యవాదాలు చెబుతున్నా’ అని ప్రాంజల వ్యాఖ్యానించింది. -
పంజాబ్ బుల్స్ జట్టులో ప్రాంజల
ముంబై: టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 12 నుంచి 15 వరకు జరుగనున్న ఈ టోర్నీ కోసం బుధవారం ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించారు. ఈ లీగ్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పంజాబ్ బుల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. వేలంలో బుల్స్ యాజ మాన్యం రూ. 1.5 లక్షలు చెల్లించి ప్రాంజలను సొంతం చేసుకుంది. ప్రాంజలతో పాటు అంకిత రైనా (ఢిల్లీ బన్నీస్ బ్రిగేడ్), మహక్ జైన్ (గుజరాత్ పాంథర్స్), రుతుజా (పుణే వారియర్స్) కూడా వేలంలో రూ 1.5 లక్షలు పలికారు. పురుషుల విభాగంలో ఫెనెస్టా ఓపెన్ చాంపియన్ నిక్కీ పునాచని, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ సహ యజమానిగా ఉన్న ముంబై లియోన్ జట్టు రూ. 2.25 లక్షలకు సొంతం చేసుకుంది. నిక్కీతో పాటు సాకేత్ మైనేని (ఢిల్లీ బిన్నీస్ బ్రిగేడ్), సోమ్‌దేవ్ (గుజరాత్ పాంథర్స్), విష్ణువర్ధన్ (బెంగళూరు హ్యాక్స్), జీవన్ నెడున్‌జెళియాన్ (పంజాబ్ బుల్స్), పురవ్ రాజా (పుణే వారియర్స్)రూ. 2.25 లక్షలు సొంతం చేసుకున్నారు. ఫెనెస్టా ఓపెన్ రన్నరప్ ఆర్యన్ (ముంబై లియోన్) రూ. 1.25 లక్షలు అందుకున్నాడు. మొత్తం 8 జట్లు టీపీఎల్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ప్రతీ జట్టులో 8 మంది చొప్పున ఆటగాళ్లుంటారు. -
ప్రాంజల ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం తొపలోవా (బల్గేరియా)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల తొలి సెట్‌ను 3–6తో చేజార్చుకుంది. అనంతరం రెండో సెట్‌ను 6–0తో గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో స్కోరు 3–4 వద్ద ఉన్న దశలో ప్రాంజల గాయం కారణంగా వైదొలిగింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సౌజన్య భవిశెట్టి (భారత్)–ఇలోనా (రొమేనియా) జంటకు తమ ప్రత్యర్థి జంట నుంచి వాకోవర్ లభించింది. ఇదే వేదికపై జరుగుతున్న పురుషుల టోర్నీలో తొలి రౌండ్లో హైదరాబాద్ ఆటగాడు రిషభ్ అగర్వాల్ 2–6, 1–6తో టిమ్ వాన్ రిజ్తోవిన్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. -
మెయిన్ ‘డ్రా’కు ప్రాంజల అర్హత
ముంబై: అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల తొలిసారి మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఓపెన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన ముంబై ఓపెన్ మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో ప్రాంజల 6–4, 6–3తో ఒక్సానా కలిష్నికోవా (జార్జియా)పై గెలిచి మెయిన్ ‘డ్రా’కు చేరింది. గంటా 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ప్రాంజల వరుస సెట్లలో ప్రత్యర్థి ఆటకట్టించింది. గతేడాది ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ రౌండ్ దాటలేకపోయిన ఆమె ఈసారి సత్తాచాటింది. క్వాలిఫయింగ్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌లో మెహక్ జైన్ (భారత్) 3–6, 4–6తో హిరోకో కువాటా (జపాన్) చేతిలో ఓడింది. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు సోమవారం విశ్రాంతి దినం. ఇదే వేదికపై భారత్–వెస్టిండీస్‌ల మధ్య నాలుగో వన్డే జరుగనుండటంతో మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లను మంగళవారం నిర్వహించనున్నారు. -
సింగిల్స్ ఫైనల్లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. నైజీరియాలోని లాగోస్ లాన్‌టెన్నిస్ క్లబ్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ లో ప్రాంజల ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరోసీడ్ ప్రాంజల(భారత్) 6–2, 5–0తో నాలుగోసీడ్ విక్టోరియా (అర్జెంటీనా)పై గెలుపొందింది. తొలి సెట్‌ను గెలిచిన ప్రాంజల రెండో సెట్లోనూ 5–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె ప్రత్యర్థి విక్టోరియా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. -
ప్రాంజల జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత్‌కే చెందిన రుతుజా భోసాలేతో జతకట్టిన ప్రాంజల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుదిపోరులో ప్రాంజల–రుతుజ (భారత్) ద్వయం 7–5, 6–2తో రెండోసీడ్ పెయ్ సున్ చెన్–ఫాంగ్ సిన్ వు (చైనీస్ తైపీ) జోడీపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఈ భారత జోడీ 6–2, 6–3తో టాప్‌సీడ్ జియా–కి కంగ్ (చైనా)–పీంగ్టర్న్ లిపెచ్ (థాయ్‌లాండ్) జంటకు షాకిచ్చింది. -
తుదిపోరుకు ప్రాంజల జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఫైనల్‌కు చేరుకుంది. హాంకాంగ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి విక్టోరియా ముంటేన్ (ఫ్రాన్స్)తో కలిసి తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ప్రాంజల (భారత్)– విక్టోరియా (ఫ్రాన్స్) జంట 7–5, 7–5తో రిసా ఓజాకి– రము యుడా (జపాన్) జోడీపై నెగ్గింది. -
పోరాడి ఓడిన ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. థాయ్‌లాండ్‌లోని హువా హిన్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రాంజల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో... డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. ఆరో సీడ్ జాక్వలైన్ కాకో (అమెరికా)తో జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో ప్రాంజల 6–4, 3–6, 4–6తో పోరాడి ఓడింది. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల–తమాచాన్ (థాయ్‌లాండ్) ద్వయం 6–4, 6–7 (5/7), 10–12తో ‘సూపర్ టైబ్రేక్’లో నిచా–నుద్నిదా (థాయ్‌లాండ్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
ప్రాంజలకు చోటు
న్యూఢిల్లీ: తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు అరుదైన అవకాశం దక్కింది. ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన ఆరుగురు సభ్యుల భారత మహి ళల టెన్నిస్ జట్టులోకి ప్రాంజల ఎంపికైంది. సానియా మీర్జా తర్వాత ఒక హైదరాబాదీ అమ్మాయికి టెన్నిస్‌లో ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం లభించడం ఇదే మొదటిసారి. 19 ఏళ్ల ప్రాంజల ఐటీఎఫ్ సర్క్యూట్లో వరుస విజయాలతో సత్తా చాటింది. భారత జట్టులో ప్రాంజలతో పాటు అంకితా రైనా, కర్మన్‌కౌర్ థండి, రుతుజా భోస్లే, రియా, ప్రార్థన కూడా ఉన్నారు. మహిళల టీమ్‌కు అంకితా బాంబ్రీ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. -
రెండో రౌండ్లో సౌజన్య, ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు ముందంజ వేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన సౌజన్య భవిశెట్టి, ప్రాంజల యడ్లపల్లి సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు... డబుల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సౌజన్య (భారత్) 6–1, 6–0తో దీక్ష మంజు ప్రసాద్ (భారత్)పై గెలుపొందగా... మూడో సీడ్ ప్రాంజల 6–3, 6–3తో యుబ్రాని బెనర్జీ (భారత్)ను ఓడించింది. డబుల్స్ తొలిరౌండ్లో సౌజన్య–రిషిక సుంకర (భారత్) ద్వయం 7–5, 6–2తో అద్రిజ బిశ్వాస్–ఆర్తి మునియన్ (భారత్) జోడీపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో ప్రాంజల (భారత్)–ఎమిలీ వెబ్లీ స్మిత్ (గ్రేట్ బ్రిటన్) జంట 6–2, 6–0తో నిత్య రాజ్–సౌమ్య (భారత్) జోడీపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. మరోవైపు సింగిల్స్ తొలి రౌండ్లో నిధి చిలుముల (తెలంగాణ) 2–6, 4–6తో ఐదోసీడ్ ఫ్రేయ క్రిస్టీ (గ్రేట్ బ్రిటన్) చేతిలో, రిషిక సుంకర 6–7 (10/12), 0–6తో నుడిడా లాంగ్నమ్ (థాయ్‌లాండ్) చేతిలో, భువన కాల్వ (తెలంగాణ) 5–7, 4–6తో తెరీజా మిహలికోవా (స్లొవేకియా) చేతిలో పరాజయం పాలయ్యారు. ఇతర డబుల్స్ మ్యాచ్‌ల్లో నిధి చిలుముల–స్నేహాదేవి రెడ్డి (భారత్) జంట 7–6 (7/5), 7–5తో మోనికా రాబిన్సన్ (అమెరికా)–జో వెన్ స్కాండలిస్ (భారత్) జోడీపై గెలుపొందింది. -
రన్నరప్ ప్రాంజల జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల సర్క్యూట్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఆకట్టుకుంది. నవీ ముంబైలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. టైటిల్ పోరులో ప్రాంజల (భారత్)–తమారా జిదాన్సెక్ (స్లొవేనియా) ద్వయం 0–6, 1–6తో రెండో సీడ్ జార్జినా గార్సియా పెరెజ్ (స్పెయిన్)–డయానా మార్సింకెవికా (లాత్వియా) జంట చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు సెమీస్‌లో ప్రాంజల జోడీ 6–4, 2–6, 13–11తో టాప్ సీడ్ ఓల్గా డోరోషినా (రష్యా)–పొలినా మోనోవా (రష్యా) జంటపై విజయం సాధించింది. -
ప్రాంజలకు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సంఘం (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. షోలాపూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో సెమీస్‌కు చేరిన ప్రాంజల... సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ ప్రాంజల 6–7 (3/7), 7–5, 2–6తో బున్వయి థాంచవత్ (థాయ్‌లాండ్ ) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రాంజల (భారత్)–చింగ్ వెన్ సు (చైనీస్ తైపీ) ద్వయం 6–1, 7–6 (7/4)తో జియాక్సిన్ కోంగ్–జియాకంగ్ (చైనా) జంటపై గెలుపొందింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన సామ సాత్విక–షేక్ హుమేరా బేగం జంట 1–6, 5–7తో అలెగ్జాండ్రా గ్రించిషినా (కజకిస్తాన్)–అల్బినా ఖబిబులినా (ఉజ్బెకిస్తాన్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
ప్రాంజల పరాజయం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె సెమీఫైనల్లో ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో నాలుగో సీడ్ ప్రాంజల 3–6, 5–7తో రెండో సీడ్ ఓల్గా డోరోషినా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఏడుసార్లు కోల్పోయిన ప్రాంజల... ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. -
సెమీస్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల నిలకడగా రాణిస్తోంది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో ప్రాంజల సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ ప్రాంజల 6–4, 6–4తో ఎనిమిదో సీడ్ అల్బీనాపై గెలుపొందింది. డబుల్స్ విభాగంలో సాయి సంహిత జంట సెమీస్‌లో వెనుదిరిగింది. గాయం కారణంగా సంహిత (భారత్)– హో చింగ్ వు (హాంకాంగ్) ద్వయం 2–6, 1–2తో అల్బీనా– సేనియా పల్కీనా జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
క్వార్టర్స్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల దూసుకెళ్తోంది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ చాంపియన్‌షిప్‌లో ఆమె సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ ప్రాంజల 6–4, 4–6, 6–3తో ధ్రుతి వేణుగోపాల్‌పై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో భువన కాల్వ 6–1, 1–6, 1–6తో అల్బీనా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, శ్రీవల్లి రష్మిక భమిడిపాటి 2–6, 3–6తో అనా వెసెలినోవిక్ (మాంటెనిగ్రో) చేతిలో పరాజయం పాలయ్యారు. డబుల్స్ విభాగంలో సాయి సంహిత చామర్తి జంట సెమీస్‌కు చేరగా... రిషిక సుంకర, సామ సాత్విక జోడీలు క్వార్టర్స్‌లో నిష్క్రమించాయి. క్వార్టర్ ఫైనల్లో సంహిత (భారత్)–హో చింగ్ వు (హాంకాంగ్) జంట 6–2, 7–6 (7/4)తో ధ్రుతి–బున్వయి జోడీపై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో రిషిక–శ్వేత చంద్ర ద్వయం 4–6, 3–6తో రియా భాటియా–స్నేహాదేవి రెడ్డి జోడీ చేతిలో, సాత్విక–జెన్నిఫర్ ద్వయం 0–6, 3–6తో రెండో సీడ్ డియా డెర్డ్జెలస్ (బోస్నియా)–చింగ్ వెన్ సు (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
చాంపియన్ ప్రాంజల జోడి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో టైటిల్‌ను కైవసం చేసుకున్న ప్రాంజల సింగిల్స్ విభాగంలో మాత్రం రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల–రుతుజా భోస్లే (భారత్) ద్వయం 6–4, 6–1తో నటాషా–రిషిక సుంకర (భారత్) జోడీపై గెలుపొందింది. మరోవైపు సింగిల్స్ టైటిల్ పోరులో రెండో సీడ్ ప్రాంజల 5–7, 4–6తో టాప్ సీడ్ అనిట్డినోవా గోజల్ (కజకిస్తాన్) చేతిలో పరాజయం పాలైంది. -
తెలుగు అమ్మాయికి అరుదైన అవకాశం
న్యూఢిల్లీ: టెన్నిస్ లో నిలకడగా రాణిస్తున్న తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మరో మెట్టు ఎక్కింది. ఐటీఎఫ్ టూరింగ్ టీమ్ లో ఆమె చోటు దక్కించుకుంది. వచ్చే మూడు నెలల కాలంలో ఈ టీమ్ యూరప్ లో పలు జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్లలో ఆడుతుంది. ఈ టీమ్ కు ఐటీఎఫ్, గ్రాండ్ స్లామ్ డెవలప్ మెంట్ ఫండ్ ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఐటీఎఫ్ టూరింగ్ టీమ్ లో చోటు దక్కడం పట్ల ప్రాంజల సంతోషం వ్యక్తం చేసింది. యూరప్ పర్యటన తన కెరీర్ కు ఎంతో కీలమని తెలిపింది. హైదరాబాద్ లోని చిన్మయ విద్యాలయలో 12వ తరగతి చదువుతున్న జీవీకే టెన్నిస్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. 12 మంది సభ్యుల ఐటీఎఫ్ టూరింగ్ టీమ్ కు ఈ నెల 8 నుంచి 10 వరకు ఇటలీలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు.