Rome Open Tennis Tournament
-
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న సుమీత్ నగాల్
ఏటీపీ చాలెంజర్ యూరోపియన్ క్లే సీజన్లో భారత ఆటగాడు సుమీత్ నగాల్ జోరు కొనసాగుతోంది. రోమ్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో నగాల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీస్‌లో ప్రపంచ 347వ ర్యాంకర్ నగాల్ 2–6, 7–5, 6–4 స్కోరుతో 198వ ర్యాంకర్ జోరిస్ డి లూర్ (బెల్జియం)పై విజయం సాధించాడు. 2 గంటల 31 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. ఫైనల్లో జెస్పర్ డి జోంగ్ (నెదర్లాండ్స్)తో నగాల్ తలపడతాడు. ఇక్కడ విజయం సాధిస్తే యూరోపియన్ క్లే పై ఏటీపీ చాలెంజర్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. నగాల్ ఇప్పటి వరకు కెరీర్లో 3 ఏటీపీ చాలెంజర్ టోర్నీలు సాధించాడు. -
సూపర్ స్వియాటెక్
రోమ్ (ఇటలీ): పోలాండ్ టెన్నిస్ టీనేజ్ సంచలనం ఇగా స్వియాటెక్ రోమ్ ఓపెన్–1000 మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నీలో అద్భుతం చేసింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 29 ఏళ్ల కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన ఫైనల్లో 19 ఏళ్ల స్వియాటెక్ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా 6–0, 6–0తో వరుసగా రెండు సెట్లు గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. టెన్నిస్ పరిభాషలో ఒక్క గేమ్ కోల్పోకుండా సెట్ గెలిస్తే దానిని ‘బేగల్’ అని అంటారు. స్వియాటెక్ రెండు సెట్లను కూడా 6–0తోనే నెగ్గి ‘డబుల్ బేగల్’ సాధించింది. 1930 నుంచి జరుగుతున్న రోమ్ ఓపెన్‌లో ఓ ప్లేయర్ 6–0, 6–0తో గెలిచి టైటిల్ నెగ్గడం ఇదే ప్రథమం. ప్లిస్కోవాపై కేవలం 46 నిమిషాల్లో నెగ్గిన స్వియాటెక్ మ్యాచ్ మొత్తంలో 12 గేముల్లో కలిపి కేవలం 13 పాయింట్లు ప్రత్యర్థికి కోల్పోయింది. తొలి సెట్లో నాలుగు పాయింట్లు, రెండో సెట్లో తొమ్మిది పాయింట్లు మాత్రమే స్వియాటెక్ చేజార్చుకుంది. వరుసగా మూడోసారి ఫైనల్ ఆడిన ప్లిస్కోవా 2019లో టైటిల్ గెలిచి 2020లో, ఈ ఏడాది రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం. విజేత హోదాలో స్వియాటెక్‌కు 1,78,630 యూరోలు (రూ. కోటీ 58 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి. కెరీర్లో మూడో టైటిల్ నెగ్గిన స్వియాటెక్ సోమవారం విడుదల చేసే డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–10లోకి వస్తుంది. తన ప్రొఫెషనల్ కెరీర్లో స్వియాటెక్కిదే తొలి ‘డబుల్ బేగల్’ విజయం కావడం విశేషం. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నెగ్గిన స్వియాటెక్ ఈ ఏడాది అడిలైడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. నాలుగోసారి... గత 21 ఏళ్లలో ఓ డబ్ల్యూటీఏ టోర్నీ ఫైనల్లో ‘డబుల్ బేగల్’ నమోదు కావడం ఇది నాలుగోసారి కావడం విశేషం. చివరిసారి 2016లో బుకారెస్ట్ ఓపెన్ ఫైనల్లో సిమోనా హలెప్ (రొమేనియా) 6–0, 6–0తో అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా)ను ఓడించింది. అంతకుముందు 2013 సిడ్నీ ఓపెన్ ఫైనల్లో అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) 6–0, 6–0తో డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా)పై... 2006 క్యూబెక్ సిటీ ఓపెన్ ఫైనల్లో మారియన్ బర్తోలీ (ఫ్రాన్స్) 6–0, 6–0తో ఓల్గా పుచ్కోవా (రష్యా)పై గెలిచారు. -
‘దశ ధీర’ నాదల్
రోమ్: మట్టికోర్టులపై తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంటూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన కెరీర్లో 88వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్ 7–5, 1–6, 6–3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. 34 ఏళ్ల నాదల్ రోమ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం ఇది పదోసారి కావడం విశేషం. ఈ స్పెయిన్ స్టార్ 2005, 2006, 2007, 2009, 2010, 2012, 2013, 2018, 2019లలో కూడా ఇక్కడ టైటిల్ సాధించాడు. తద్వారా ఒకే టోర్నమెంట్‌ను నాలుగుసార్లు కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ప్లేయర్‌గా తన రికార్డును మెరుగుపర్చుకున్నాడు. నాదల్ 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌ను... బార్సిలోనా ఓపెన్‌ను 12 సార్లు... మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీని 11 సార్లు గెలిచాడు. ఈ విజయంతో అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా జొకోవిచ్ (36 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును నాదల్ (36 టైటిల్స్) సమం చేశాడు. అంతేకాకుండా జొకోవిచ్‌తో ముఖాముఖి రికార్డులో ఆధిక్యాన్ని 28–29కి తగ్గించాడు. రోమ్ ఓపెన్ విజేత హోదాలో నాదల్కు 2,45,085 యూరోల (రూ. 2 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ జొకోవిచ్ ఖాతాలో 1,45,000 యూరోల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 29 లక్షలు)తోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. రోమ్ ఓపెన్‌లో జొకోవిచ్ ఐదుసార్లు విజేతగా నిలిచి, ఆరుసార్లు రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు. జొకోవిచ్‌తో జరిగిన ఫైనల్లో తొలి సెట్ హోరాహోరీగా జరిగింది. 75 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లోని 12వ గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి నాదల్ సెట్ సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో జొకోవిచ్ దూకుడుకు నాదల్ తడబడ్డాడు. అనవసర తప్పిదాలు చేసి కేవలం ఒక గేమ్ మాత్రమే గెలిచి సెట్‌ను కోల్పోయాడు. అయితే నిర్ణాయక మూడో సెట్లో నాదల్ మళ్లీ లయలోకి వచ్చాడు. ఆరో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఏడో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జొకోవిచ్ ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్నాడు. తొమ్మిదో గేమ్‌లో నాదల్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ‘ఈ టోర్నీలో నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. ముఖ్యంగా షపవలోవ్తో జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గట్టెక్కాను. ఓవరాల్‌గా ఈ టోర్నీలో బాగా ఆడాను.’ –రాఫెల్ నాదల్ -
ఓటమి అంచుల్లో నుంచి నెగ్గిన నాదల్
రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో తొమ్మిదిసార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) అతికష్టమ్మీద క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. డెనిస్ షపవలోవ్ (కెనడా)తో 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ నాదల్ 3–6, 6–4, 7–6 (7/3)తో గెలుపొంది ఊపిరి పీల్చుకున్నాడు. రెండో సెట్లో 0–3తో... మూడో సెట్లో 1–3తో వెనుకబడిన నాదల్ చివరకు 5–6 స్కోరు వద్ద తన సర్వీస్‌లో ఏకంగా రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాపాడుకొని గట్టెక్కాడు. -
రాఫెల్ నాదల్ ఖాతాలో 34వ మాస్టర్స్ సిరీస్ టైటిల్
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్లో నాదల్ తొమ్మిదోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–0, 4–6, 6–1తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. ఈ విజయంతో నాదల్ అత్యధికంగా 34 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. విజేత నాదల్కు 9,58,055 యూరోల (రూ. 7 కోట్ల 52 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్‌లో సానియా జంట
న్యూఢిల్లీ: రోమ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం రోమ్‌లో జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-2తో రాకెల్ అటావో-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జోడీపై విజయం సాధించింది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) -ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట 6-3, 6-4తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)-విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) జోడీపై గెలిచి సెమీస్‌కు చేరింది.