నాదల్ కుదేల్
బెంబేలెత్తించిన బెర్డిచ్
ఆస్తి పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని అంటారు. నమ్మకానికి పట్టుదల, ఆత్మవిశ్వాసానికి సంకల్పం తోడైతే అద్భుతం జరుగుతుంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మంగళవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకటా... రెండా... మూడా... నాలుగా... వరుసగా 17 మ్యాచ్‌ల్లో తనను ఓడించిన ప్రత్యర్థి మళ్లీ ఎదురైతే ఎవరైనా మ్యాచ్‌కు ముందే డీలా పడతారు. కానీ చెక్ రిపబ్లిక్కు చెందిన బెర్డిచ్ నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిశాడు. ఊహించనిరీతిలో రాణించాడు. తనను వరుసగా 17 మ్యాచ్‌ల్లో ఓడించిన రాఫెల్ నాదల్‌ను బెంబేలెత్తించాడు. వరుస సెట్లలో చిత్తు చేశాడు. అన్ని పరాజయాలకు ఒకేసారి లెక్క సరిజేసి ఔరా అనిపించాడు.
మెల్బోర్న్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ... టైటిల్ ఫేవరెట్‌కు షాక్ ఇస్తూ... ఏడో సీడ్ టామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మూడో సీడ్, మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో బెర్డిచ్ 6-2, 6-0, 7-6 (7/5)తో అద్భుత విజయం సాధించి సంచలనం సృష్టించాడు. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన బెర్డిచ్ అనుకున్న ఫలితం సాధించాడు. అదే క్రమంలో ఈ టోర్నీలో ఇప్పటివరకు ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని రికార్డును కొనసాగించాడు.
పదునైన సర్వీస్‌లు, శక్తివంతమైన షాట్లు, క్లిష్టమైన కోణాల్లో రిటర్న్ షాట్లు, కోర్టుకిరువైపులా పాదరసంలాంటి కదలికలతో ఆరంభం నుంచే బెర్డిచ్ ఈ మ్యాచ్‌పై పట్టు బిగించాడు. తొందరగా ఓటమిని అంగీకరించే తత్వంలేని నాదల్లాంటి ప్లేయర్‌కు పుంజుకునే అవకాశం ఇస్తే ఏమి జరుగుతుందో బెర్డిచ్‌కు తెలుసు. అందుకే మ్యాచ్ పాయింట్ గెలిచే వరకు బెర్డిచ్ ఏదశలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయలేదు. మరోవైపు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లేని నాదల్కు బెర్డిచ్ రూపంలో పటిష్టమైన ప్రత్యర్థి ఎదురుకావడం, ఆద్యంతం అతనూ కట్టుదిట్టంగా ఆడటంతో ఈ స్పెయిన్ స్టార్‌కు తేరుకునే అవకాశమే దక్కలేదు.
తొలి రెండు సెట్లను అలవోకగా నెగ్గిన బెర్డిచ్‌కు మూడో సెట్లో ప్రతిఘటన ఎదురైనా... కీలకమైన టైబ్రేక్‌లో సంయమనంతో ఆడి నాదల్ కథను ముగించడంలో సఫలమయ్యాడు. 10 ఏస్‌లు సంధించిన బెర్డిచ్, ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం. అంతేకాకుండా నాదల్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన బెర్డిచ్ తన సర్వీస్‌లో ప్రత్యర్థి ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వలేదు. 26 అనవసర తప్పిదాలు చేసిన నాదల్, అర డజను డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.
నాదల్‌పై తాజా గెలుపుతో ఈ స్పెయిన్ స్టార్ చేతిలో వరుసగా 17 మ్యాచ్‌ల్లో ఎదురైన పరాజయాల పరంపరకు తెరదించాడు. ఇప్పటివరకు బెర్డిచ్, నాదల్ 22 సార్లు తలపడ్డారు. ఇందులో బెర్డిచ్ 18 మ్యాచ్‌ల్లో ఓడిపోగా... ఈ మ్యాచ్‌కు ముందు వాటిలో 17 వరుస ఓటములున్నాయి. చివరిసారి నాదల్‌ను బెర్డిచ్ 2006లో మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడించాడు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి నాదల్‌ను ఓడించడంలో బెర్డిచ్ సఫలమయ్యాడు.
ఒకవేళ నాదల్ చేతిలో ఈసారీ ఓడిపోయుంటే మాత్రం బెర్డిచ్, ఓపెన్ శకంలో (1968 తర్వాత) ఒకే ఆటగాడి చేతిలో వరుసగా 18 మ్యాచ్‌ల్లో ఓడిన తొలి క్రీడాకారుడిగా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకునేవాడు. గతంలో జిమ్మీ కానర్స్ (అమెరికా), టిమ్ మయోటి (అమెరికా)లపై ఇవాన్ లెండిల్ (చెక్ రిపబ్లిక్/అమెరికా)... విటాస్ గెరులైటిస్ (అమెరికా)పై జాన్ బోర్గ్ (స్వీడన్) వరుసగా 17 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించారు.
ఇప్పటివరకు ఆడిన 40 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్ తన ప్రత్యర్థి చేతిలో ఓ సెట్‌ను 0-6తో కోల్పోవడం ఇది మూడోసారి మాత్రమే. గతంలో రోజర్ ఫెడరర్ (2006-వింబుల్డన్‌లో), ఆండీ రాడిక్ (2004-యూఎస్ ఓపెన్) మాత్రమే ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నాదల్‌ను ఓ సెట్లో 0-6తో ఓడించారు. ఓవరాల్‌గా తన కెరీర్లో 711 మ్యాచ్‌లు ఆడిన నాదల్ 13 సార్లు తన ప్రత్యర్థి చేతిలో ఓ సెట్‌ను 0-6తో కోల్పోయాడు.
ముర్రే జోరు
మరో క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-3, 7-6 (7/5), 6-3తో ఆస్ట్రేలియా యువ ఆశాకిరణం నిక్ కిరియోస్‌ను ఓడించి సెమీఫైనల్లో బెర్డిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 13 ఏస్‌లు సంధించడంతోపాటు కిరియోస్ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. సెమీస్ చేరే క్రమంలో ముర్రే తన ప్రత్యర్థులకు రెండు సెట్లు మాత్రమే కోల్పోయాడు.
హలెప్‌కు మకరోవా షాక్
మహిళల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఏడో సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా)ల పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ షరపోవా (రష్యా) 6-3, 6-2తో బౌచర్డ్ను చిత్తు చేయగా... పదో సీడ్ మకరోవా 6-4, 6-0తో హలెప్‌ను బోల్తా కొట్టించి సెమీస్‌లో షరపోవాతో సమరానికి సిద్ధమైంది.
‘‘ఈ విజయానికి సిద్ధమై వచ్చాను. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలనే నిర్ణయంతోనే వచ్చాను. అనుకున్న వ్యూహాన్ని అమలు చేశాను. నాదల్‌తో ఆడేటపుడు చివరి పాయింట్ సాధించేవరకు గెలిచినట్టు భావించకూడదు. గొప్ప ప్లేయర్‌ను ఓడించినందుకు గొప్పగా అనిపిస్తోంది.’’ -బెర్డిచ్