అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డు సమం చేసేందుకు స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ మరి కొంత కాలం వేచి చూడక తప్పదు. రెండేళ్ల క్రితం చివరిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదికపై మరో ట్రోఫీని ఆశించిన అమెరికా దిగ్గజం ఆట క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఇటీవలే యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో తన చేతిలోనే ఓడిన ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా అద్భుత ఆటతో సెరెనాపై ప్రతీకారం తీర్చుకుంది.
మెల్‌బోర్న్: హోరాహోరీగా సాగిన సెరెనా విలియమ్స్ (అమెరికా), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మధ్య క్వార్టర్ ఫైనల్ పోరుకు అనూహ్య ముగింపు లభించింది. రెండు సెట్‌ల తర్వాత ఇద్దరూ చెరో సెట్ గెలిచి సమంగా నిలవగా... మూడో సెట్‌లో సెరెనా 5–1తో ఆధిక్యంలో నిలిచింది. మరో గేమ్ గెలిస్తే సెమీస్‌లో చోటు ఖాయమవుతుంది. కానీ ప్లిస్కోవా మొండిగా పోరాడింది. వరుసగా నాలుగు పాయింట్లు కాపాడుకొని ఆధిక్యాన్ని 2–5కు తగ్గించింది. ఆ తర్వాత అదే జోరుతో దూసుకుపోయి సెరెనా ఆట కట్టించింది. 2 గంటల 10 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో చివరకు ఏడో సీడ్ ప్లిస్కోవా 6–4, 4–6, 7–5 తేడాతో 16వ సీడ్ సెరెనాను చిత్తు చేసింది. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.
ఓటమి అంచుల నుంచి...
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు సన్నాహకంగా సాగిన బ్రిస్బేన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి ఫామ్‌లో ఉన్న ప్లిస్కోవా తొలి సెట్‌లో ఆధిక్యం కనబర్చింది. పదో గేమ్‌ను నెగ్గి సెట్ గెలుచుకుంది. అయితే సెరెనా తన అనుభవాన్ని ఉపయోగిస్తూ రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. చివరి సెట్‌లో సెరెనా 5–1తో ముందంజలో నిలిచినప్పుడు మరో ఫలితం గురించి ఎవరూ ఊహించలేదు. కానీ ఈ దశలో సెరెనా ఆట గతి తప్పింది. కాలి మడమకు స్వల్ప గాయంతో సెరెనా కొంత ఇబ్బంది పడటాన్ని గుర్తించిన ఆమె ప్రత్యర్థి మరో అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా స్కోరు 5–5తో సమమైంది. 11వ గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన ప్లిస్కోవా... తర్వాతి గేమ్‌లో చెలరేగిపోయింది. సెరెనా కొట్టిన ఫోర్‌హ్యాండ్ నెట్‌ను తాకడంతో ప్లిస్కోవా గెలుపు ఖాయమైం ది. 4 డబుల్ ఫాల్ట్‌లు చేసిన అమెరికా స్టార్, ఏకంగా 37 అనవసర తప్పిదాలతో ఓటమిని ఆహ్వా నించింది. మరో క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–4, 6–1తో స్వితోలినా (ఉక్రె యిన్)పై నెగ్గి సెమీస్ చేరింది. 1994లో కిమికో డాటె తర్వాత తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ చేరిన తొలి జపాన్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది.
జొకోవిచ్ జోరు...
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. జపాన్‌కు చెందిన ఎనిమిదో సీడ్ కీ నిషికోరితో జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–1, 4–1తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి గాయం కారణంగా తప్పుకున్నాడు. హోరాహోరీగా సాగిన మరో క్వార్టర్స్‌లో లుకాస్ పుయి (ఫ్రాన్స్) 7–6 (7/4), 6–3, 6–7 (2/7), 6–4తో 16వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు.
నేటి షెడ్యూల్
మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్
క్విటోవాvsకొలిన్స్
ప్లిస్కోవాvsనయోమి ఒసాకా
ఉదయం గం. 8.30 నుంచి
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్
రాఫెల్ నాదల్ vs సిట్సిపాస్
మధ్యాహ్నం గం. 2 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment