కరోలినా ప్లిస్కోవా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మరో సీడెడ్ ప్లేయర్‌కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోనే నిష్క్రమించింది. తొమ్మిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ఇంటి దారి పట్టింది. పురుషుల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఏడో సీడ్ నిషికొరి అతికష్టమ్మీద మూడో రౌండ్ గట్టెక్కాడు.
మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ ప్లిస్కోవా 3–6, 3–6తో 31వ సీడ్ పెట్రా మార్టిక్ (క్రొయేషియా) చేతిలో కంగుతింది. మొత్తానికి ప్లిస్కోవా పరాజయం ఒసాకాకు వరమైంది. ఆమె నంబర్‌వన్ ర్యాంకుకు ఢోకా లేకుండాపోయింది. ఫ్రెంచ్ ఓపెన్ ముగిశాక కూడా ఈ జపాన్ స్టార్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఇతర మ్యాచ్‌ల్లో స్వితోలినా 3–6, 3–6తో 19వ సీడ్ ముగురుజా (స్పెయిన్) చేతిలో... 15వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 4–6, 1–6తో డోనా వెకిచ్ (క్రొయేషియా) చేతిలో ఓటమి పాలయ్యారు.
పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 6–1, 7–6 (10/8) కాస్పర్ రూడ్ (నార్వే)పై, నాదల్ 6–1, 6–3, 4–6, 6–3తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో జపాన్ స్టార్, ఏడో సీడ్ సీడ్ నిషికోరి మూడో రౌండ్ దాటేందుకు నాలుగున్నర గంటలు పోరాడాల్సి వచ్చింది. చివరకు నిషికోరి 6–4, 6–7 (6/8), 6–3, 4–6, 8–6తో లాస్లో డెర్ (సెర్బియా)పై నెగ్గాడు.
పేస్ జోడీ శుభారంభం
పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్) జోడీ 6–4, 6–4తో ఇంగ్లంట్ (బ్రిటన్)–కిజాన్ (స్లోవేకియా) జంటను ఓడించింది. రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–కోపిల్ (రొమేనియా) ద్వయం 6–4, 6–4తో బెంజమిన్ బోంజీ–హోయంగ్ (ఫ్రాన్స్) జంటపై గెలుపొందింది. దివిజ్ శరణ్ (భారత్)–డెమోలైనర్ (బ్రెజిల్) ద్వయం 3–6, 4–6తో తొమ్మిదో సీడ్ కొంటినెన్ (ఫిన్లాండ్)–పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment