
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సబలెంకా 6–2, 6–3తో ఎమా నవారో (అమెరికా)పై, రిబాకినా 6–4, 6–3తో స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జాస్మిన్ పావోలిని (ఇటలీ) 4–6, 6–0, 6–1తో ఎలీనా అవానెస్యాన్ (రష్యా)పై, మిరా ఆంద్రీవా 7–5, 6–2తో వర్వారా గ్రచెవా (ఫ్రాన్స్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.
మెద్వెదెవ్‌కు చుక్కెదురు
పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) 4–6, 6–2, 6–1, 6–3తో మెద్వెదెవ్‌ను ఓడించి ఎనిమిదో ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–7 (2/7), 6–3, 7–6 (10/8)తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment