పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 2020 చాంపియన్ స్వియాటెక్ 6–3, 7–5తో డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో)పై గెలిచి ఈ ఏడాది వరుసగా 31వ విజయాన్ని నమోదు చేసింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.
మరోవైపు ఏడో సీడ్ సబలెంకా (బెలారస్), మూడో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) మూడో రౌండ్‌లోనే నిష్క్రమించారు. 28వ సీడ్ కమిలా జార్జి (ఇటలీ) 4–6, 6–1, 6–0తో సబలెంకాను ఓడించగా... వెరోనికా కుదెర్‌మెతోవా (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో బదోసా తొలి సెట్‌ను 3–6తో కోల్పోయి, రెండో సెట్‌లో 1–2తో వెనుబడిన దశలో గాయం కారణంగా వైదొలిగింది. బదోసా, సబలెంకా ఓటమితో ఈ టోర్నీలో టాప్–10 క్రీడాకారిణుల్లో కేవలం స్వియాటెక్ మాత్రమే బరిలో మిగిలింది.
బోపన్న జోడీ సంచలనం
పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట 6–7 (5/7), 7–6 (7/3), 7–6 (12/10)తో రెండో సీడ్ మాట్ పావిచ్–నికోల్ మెక్‌టిక్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment