కరోలినా ప్లిస్కోవా
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 4–6, 1–6, 2–6తో ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో ఓడిన ప్రజ్నేశ్‌కు 58,000 డాలర్ల (రూ. 41 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో రెండో సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఈ ఇద్దరు మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులకు తమ ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన బార్టీ గంటా 41 నిమిషాల్లో 1–6, 6–3, 6–2తో జరీనా దియాస్ (కజకిస్తాన్)పై గెలుపొందగా... 2016 యూఎస్ ఓపెన్ రన్నరప్ ప్లిస్కోవా గంటా 46 నిమిషాల్లో 7–6 (8/6), 7–6 (7/3)తో తన దేశానికే చెందిన తెరెజా మార్టిన్‌కోవాను ఓడించింది.
దియాస్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్టీ ఎనిమిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో 16వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) 6–1, 4–6, 6–2తో కసత్‌కినా (రష్యా)పై, 12వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) 6–3, 6–3తో యూజిన్ బుషార్డ్ (కెనడా)పై గెలిచారు. 2016 రియో ఒలింపిక్స్ విజేత మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో) 3–6, 3–6తో రెబెకా (స్వీడన్) చేతిలో... 2011 యూఎస్ ఓపెన్ విజేత సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 1–6, 3–6తో ఎకతెరీనా (రష్యా) చేతిలో... 27వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–7 (8/10), 2–6తో ఓన్స్ జబీర్ (ట్యునీషియా) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment