యూఎస్ ఓపెన్లో కొత్త చాంపియన్
గత ఏడాది మాదిరిగానే ఈసారీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ లో కొత్త చాంపియన్ అవతరించింది. రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) పై నెగ్గి తన ఖాతాలో తొలి యూఎస్ ఓపెన్ టైటిల్ను వేసుకుంది. చివరిసారిగా 1996లో స్టెఫీగ్రాఫ్ తర్వాత యూఎస్ ఓపెన్ నెగ్గిన జర్మనీ ప్లేయర్ గా కెర్బర్ నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన ఫైనల్లో నెంబర్ వన్ ర్యాంకర్ కెర్బర్ 6-3, 4-6, 6-4 తేడాతో చెక్ రిపబ్లిక్ భామ ప్లిస్కోవాపై విజయాన్ని సాధించింది.
ఏ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్లో నెగ్గిన కెర్బర్ ఫ్రెంచ్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడంతో ఆమెను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత కసితో వింబుల్డన్ లో మెరుగైన ఆటతీరుతో రన్నరప్ గా నిలిచి తన అభిమానుల్లో ఆశను రేకెత్తించింది. తాజాగా యూఎస్ ఓపెన్లో టాప్ ప్లేయర్స్ ను బోల్తాకొట్టిస్తూ ఫైనల్ చేరి.. సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనాను ఓడించిన ప్లిస్కోవాపై మూడు సెట్ల పోరులో తన సత్తా ఏంటో చూపించింది.
ప్లిస్కోవా 17 అనవసర తప్పిదాలు చేసి తొలి సెట్ కోల్పోయింది. అయినా రెండో సెట్లో 17 విన్నర్లు సంధించి6-4తో సెట్ గెలవడంతో మూడో సెట్ కు వెళ్లింది. మూడో సెట్లో తక్కువ తప్పిదాలు చేసిన కెర్బర్ 4-4తో ఉన్న దశలో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా రెండు పాయింట్లు గెలచి సెట్ తో పాటు మ్యాచ్ నెగ్గింది.