Angelique Kerber
-
కెర్బర్ అవుట్.. ఫైనల్లో హలెప్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి, రొమేనియా టెన్నిస్ ప్లేయర్ సిమోనా హలెప్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో హలెప్ 6-3, 4-6, 9-7 తేడాతో జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్‌ను ఓడించి తుది పోరుకు సిద్దమైంది. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో హలెప్ కడవరకూ పోరాడి విజయం సాధించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన హలెప్.. రెండో సెట్లో ఓటమి పాలైంది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది. తీవ్ర ఉత్కంఠ రేపిన మూడో సెట్లో హలెప్ తన అనుభవాన్ని ఉపయోగించి గెలుపును సొంతం చేసుకోవడమే కాకుండా ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగే తుది పోరులో వొజ్నియాకితో హలెప్ అమీతుమీ తేల్చుకోనుంది. -
షరపోవా అవుట్
మెల్బోర్న్: సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్లో అడుగుపెట్టిన రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవాకు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన మూడో రౌండ్ పోరులో షరపోవా 1-6, 3-6 తేడాతో జర్మనీ స్టార్ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ చేతిలో పరాజయం పాలైంది. ఏకపక్షంగా సాగిన పోరులో షరపోవా అంచనాలను అందుకోలేక ఓటమి పాలైంది. తొలి సెట్‌ను సునాయాసంగా కోల్పోయిన షరపోవా.. రెండో సెట్లో కాస్త పోరాడింది. కాగా, కెర్బర్ ధాటికి తలవంచిన షరపోవా టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. తొలి రెండు రౌండ్లలో ఆకట్టుకున్న షరపోవా.. మూడో రౌండ్ అడ్డంకిని మాత్రం అధిగమించలేకపోయింది. కెర్బర్ రూపంలో బలమైన ప్రత్యర్థి ముందు షరపోవా అనుభవం సరిపోలేదు. దాంతో వరుస సెట్లను కోల్పోయిన షరపోవా టోర్నీ నుంచి వైదొలిగింది. 2016లో నిషేధిత ఉత్ర్పేరకాలు వాడిన కారణంగా షరపోవాపై 15 నెలల నిషేధం పడిన సంగతి తెలిసిందే. -
సంచలనాల మోత
♦ టాప్ సీడ్ కెర్బర్‌కు ముగురుజా షాక్ ♦ నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోనున్న జర్మనీ తార ♦ నాలుగో సీడ్ స్వితోలినా, ఐదో సీడ్ వొజ్నియాకి కూడా ఇంటిముఖం వారం రోజులు సాఫీగా సాగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ సోమవారం సంచలనాలతో దద్దరిల్లింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఏకంగా టాప్–10లోని నలుగురు సీడెడ్ క్రీడాకారిణులు ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఇందులో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఐదో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), తొమ్మిదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) ఉండటం గమనార్హం. లండన్: మూడో రౌండ్లో అతికష్టమ్మీద గట్టెక్కిన టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) అదే ఫలితాన్ని ప్రిక్వార్టర్ ఫైనల్లో పునరావృతం చేయలేకపోయింది. 14వ సీడ్, 2015 రన్నరప్ ముగురుజా (స్పెయిన్) అద్భుత పోరాటానికి గతేడాది రన్నరప్ కెర్బర్ చేతులెత్తేసింది. 2 గంటల 18 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగురుజా 4–6, 6–4, 6–4తో కెర్బర్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ ఓటమి తో కెర్బర్ వచ్చే వారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోనుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 13వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) 6–3, 7–6 (8/6)తో నాలుగో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై, 24వ సీడ్ కోకో వాండెవాగె (అమెరికా) 7–6 (7/4), 6–4తో ఐదో సీడ్, మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్)లపై సంచలన విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం) తర్వాత కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అనంతరం ఆడిన రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ప్లేయర్‌గా ఒస్టాపెంకో గుర్తింపు పొందింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) 6–2, 6–4తో తొమ్మిదో సీడ్, 2012 రన్నరప్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్)ను ఇంటిదారి పట్టించింది. గతంలో ఐదుసార్లు చాంపియన్, పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–3, 6–2తో 27వ సీడ్ అనా కొంజూ (క్రొయేషియా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో 1994లో మార్టినా నవ్రతిలోవా (అమెరికా) తర్వాత ఈ టోర్నీ లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన పెద్ద వయస్కు రాలిగా 37 ఏళ్ల వీనస్ గుర్తింపు పొందింది. మరో విజయం సాధిస్తే... ప్రిక్వార్టర్ ఫైనల్లో కెర్బర్ ఓడిపోవడంతో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) నంబర్‌వన్ ర్యాంక్‌కు విజయం దూరంలో నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో హలెప్ 7–6 (7/3), 6–2తో మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించింది. ఈ టోర్నీలో హలెప్ సెమీస్‌కు చేరితే తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంటుంది. ఒకవేళ హలెప్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోతే మాత్రం కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)కు నంబర్‌వన్ ర్యాంక్ దక్కుతుంది. 33 ఏళ్ల తర్వాత... మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ జొహానా కొంటా 7–6 (7/3), 4–6, 6–4తో 21వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడిం చింది. ఈ క్రమంలో ఆమె 1984లో జో డ్యూరీ తర్వాత వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి బ్రిటన్ క్రీడాకారిణిగా ఘనత సాధించింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో రిబరికోవా (స్లొవేకియా) 6–4, 2–6, 6–3తో మార్టిక్ (క్రొయేషియా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్స్‌లో కుజ్నెత్సోవాతో ముగురుజా; వాండెవాగెతో రిబరికోవా; వీనస్‌తో ఒస్టాపెంకో; కొంటాతో హలెప్ తలపడతారు. సానియా జంటకు నిరాశ మహిళల డబుల్స్ మూడో రౌండ్లో సానియా మీర్జా (భారత్)–ఫ్లిప్కెన్స్ (బెల్జియం) జంట 2–6, 4–6తో హింగిస్ (స్విట్జర్లాండ్)–యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. బాలికల సింగిల్స్ తొలి రౌండ్లో మహెక్ జైన్ (భారత్) 7–6 (7/4), 4–6, 6–4తో బోస్కోవిచ్ (క్రొయేషియా)పై నెగ్గగా... బాలుర సింగిల్స్ తొలి రౌండ్లో సిద్ధాంత్ 6–3, 2–6, 5–7తో మార్టినెయు (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఫెడరర్ జోరు... పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడుసార్లు చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఫెడరర్ 6–4, 6–2, 6–4తో 13వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై, ముర్రే 7–6 (7/1), 6–4, 6–4తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై గెలిచారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫెడరర్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది 50వసారి కావడం విశేషం. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 11వ సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6–3, 6–7 (1/7), 6–3, 3–6, 6–3తో 8వ సీడ్ థీమ్ (ఆస్ట్రియా)పై, ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6–2, 6–2, 6–2తో 18వ సీడ్ అగుట్ (స్పెయిన్)పై, 24వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 5–7, 7–6 (7/5), 6–3, 6–7 (11/13), 6–3తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలిచారు. -
ఫ్రెంచ్ ఓపెన్: తొలి రోజే సంచలనం!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ లో తొలిరోజే సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, జర్మనీ భామ ఏంజెలికా కెర్బర్ కు ఊహించని షాక్ తగిలింది. వరుసగా రెండో ఏడాది తొలి రౌండ్లోనే కెర్బర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంది. ఆదివారం సాయంత్రం ఇక్కడి రోలాండ్ గారోస్ లో జరిగిన మ్యాచ్ లో రష్యా క్రీడాకారిణి మకరోవా చేతిలో 6-2, 6-2 తేడాతో కెర్బర్(జర్మనీ) ఓటమి పాలైంది. రెండు వరుస సెట్లలో రష్యా భామ తన ప్రతాపం చూపించి, నంబర్ వన్ ర్యాంకర్ ను ముప్పుతిప్పలు పెట్టింది. ఇప్పటికే ఈ గ్రాండ్ స్లామ్ లో మహిళల సింగిల్స్ విభాగంలో సెరెనా విలియమ్స్, షరపోవా గైర్హాజరీతో కచ్చితమైన ఫేవరెట్ కనిపించడంలేదు. నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ), డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్)లతో పాటు మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 13వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) టైటిల్ రేసులో ఉన్నారని అందరూ ఊహించారు. కానీ కెర్బర్ సాధారణ ప్రదర్శనతో రోలాండ్ గారోస్ నుంచి తొలి రౌండ్లోనే ఓడిపోయి ఇంటి దారి పట్టింది. -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరో సంచలనం
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరో సంచలన విజయం నమోదైంది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే, రెండో ర్యాంకు ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌లు ఇంటి దారి పట్టగా.. తాజాగా మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్, జర్మనీ స్టార్ ఎంజెలిక్ కెర్బర్ ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన నాల్గో రౌండ్ పోరులో కోకో వాందివెగీ 6-2, 6-3 తేడాతో కెర్బర్ కు షాకిచ్చింది. ఈ టోర్నీలో అతికష్టం మీద నాల్గో రౌండ్ వరకూ వచ్చిన కెర్బర్.. వాందివెగీ ధాటికి తలవంచింది. ఏకపక్షంగా సాగిన పోరులో వాందివెగీ సునాయాసంగా విజయం సాధించింది క్వార్టర్లోకి ప్రవేశించింది. గతేడాది చివరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్ తరువాత సెరెనా విలియమ్స్ నుంచి నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్న కెర్బర్.. ఈ ఏడాది ఆరంభపు ఆస్ట్రేలియా ఓపెన్ లో మాత్రం అంచనాలకు అనుగుణంగా రాణించలేక టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. -
కెర్బర్కే కిరీటం
యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన జర్మనీ స్టార్ ఫైనల్లో కరోలినా ప్లిస్కోవాపై విజయం రూ. 23 కోట్ల 41 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ఆద్యంతం నిలకడగా రాణిస్తే అనుకున్న ఫలితం సాధించడం కష్టమేమీ కాదని జర్మనీ స్టార్ ఎంజెలిక్ కెర్బర్ నిరూపించింది. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఆమె కైవసం చేసుకుంది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరిన ఈ రెండో సీడ్ క్రీడాకారిణికి ఫైనల్లో మాత్రం గట్టిపోటీనే ఎదురైంది. అయితే క్లిష్ట సమయంలో సంయమనం కోల్పోకుండా ఆడిన కెర్బర్ యూఎస్ ఓపెన్ కిరీటాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. న్యూయార్క్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఎంజెలిక్ కెర్బర్ తన కెరీర్లో మరో గొప్ప విజయాన్ని సాధించింది. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గి, వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచి, రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ఈ జర్మనీ స్టార్ యూఎస్ ఓపెన్‌లోనూ తనదైన ముద్ర వేసింది. మహిళల సింగిల్స్ విభాగం టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో రెండో సీడ్ కెర్బర్ 6-3, 4-6, 6-4తో పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. విజేతగా నిలిచిన 28 ఏళ్ల కెర్బర్‌కు 35 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 41 లక్షలు), రన్నరప్ ప్లిస్కోవాకు 17 లక్షల 50 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 70 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విడుదలయ్యే మహిళల టెన్నిస్ సంఘం తాజా ర్యాంకింగ్స్‌లో కెర్బర్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంటుంది. ప్లిస్కోవా 11 నుంచి ఆరో ర్యాంక్‌కు ఎగబాకుతుంది. బ్రేక్‌తో మొదలు... విలియమ్స్ సిస్టర్స్ వీనస్, సెరెనాలను ఓడించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న 24 ఏళ్ల ప్లిస్కోవా ఈ కీలక మ్యాచ్‌లో ఒత్తిడికి లోనైంది. కెర్బర్ తొలి గేమ్‌లోనే ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కెర్బర్ శక్తివంతమైన రిటర్న్ షాట్లు సంధించగా... ప్లిస్కోవా పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. తొలి సెట్లో ఏకంగా 17 అనవసర తప్పిదాలు చేసిన ప్లిస్కోవా రెండో సెట్లో మాత్రం తేరుకుంది. ఏడో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ప్లిస్కోవా తన జోరు కొనసాగించింది. రెండో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని 3-1తో ముందంజ వేసింది. అయితే గతంలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన అనుభవంలేని ప్లిస్కోవా కీలకదశలో తడబడింది. ఆరో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ స్కోరును 3-3తో సమం చేసింది. ఆ తర్వాత పదో గేమ్‌లో మరోసారి ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ విజయాన్ని ఖాయం చేసుకుంది. 4 యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాలుగో ఎడంచేతి వాటం క్రీడాకారిణి కెర్బర్. గతంలో ఎవ్లీన్ సియర్స్ (1907), మార్టినా నవ్రతిలోవా (1983, 84, 86, 87), మోనికా సెలెస్ (1991, 92) మాత్రమే ఈ ఘనత సాధించారు. 4 ఓపెన్ శకంలో (1968 నుంచి) తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా, అదే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడిన నాలుగో క్రీడాకారిణి కెర్బర్. గతంలో గూలగాంగ్ కావ్లీ (1971), స్టెఫీ గ్రాఫ్ (1987), మార్టినా హింగిస్ (1997) ఈ ఘనత వహించారు. 4 పదేళ్లలో సెరెనా, అమెలీ మౌరెస్మో, జస్టిన్ హెనిన్ తర్వాత ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాలుగో క్రీడాకారిణి కెర్బర్. -
యూఎస్ ఓపెన్‌లో కొత్త చాంపియన్
గత ఏడాది మాదిరిగానే ఈసారీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ లో కొత్త చాంపియన్ అవతరించింది. రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) పై నెగ్గి తన ఖాతాలో తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను వేసుకుంది. చివరిసారిగా 1996లో స్టెఫీగ్రాఫ్ తర్వాత యూఎస్ ఓపెన్ నెగ్గిన జర్మనీ ప్లేయర్ గా కెర్బర్ నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన ఫైనల్లో నెంబర్ వన్ ర్యాంకర్ కెర్బర్ 6-3, 4-6, 6-4 తేడాతో చెక్ రిపబ్లిక్ భామ ప్లిస్కోవాపై విజయాన్ని సాధించింది. ఏ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నెగ్గిన కెర్బర్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడంతో ఆమెను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత కసితో వింబుల్డన్ లో మెరుగైన ఆటతీరుతో రన్నరప్ గా నిలిచి తన అభిమానుల్లో ఆశను రేకెత్తించింది. తాజాగా యూఎస్ ఓపెన్‌లో టాప్ ప్లేయర్స్ ను బోల్తాకొట్టిస్తూ ఫైనల్ చేరి.. సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనాను ఓడించిన ప్లిస్కోవాపై మూడు సెట్ల పోరులో తన సత్తా ఏంటో చూపించింది. ప్లిస్కోవా 17 అనవసర తప్పిదాలు చేసి తొలి సెట్ కోల్పోయింది. అయినా రెండో సెట్లో 17 విన్నర్లు సంధించి6-4తో సెట్ గెలవడంతో మూడో సెట్ కు వెళ్లింది. మూడో సెట్లో తక్కువ తప్పిదాలు చేసిన కెర్బర్ 4-4తో ఉన్న దశలో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా రెండు పాయింట్లు గెలచి సెట్ తో పాటు మ్యాచ్ నెగ్గింది. -
కెర్బర్ ‘నంబర్ వన్’ విన్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల ఫైనల్లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా, జర్మనీ స్టార్ ఏంజెలిక్ కెర్బర్ తలపడనున్నారు. శనివారం టైటిల్ పోరు జరగనుంది. సెమీస్ లో ప్లిస్కోవా, కెర్బర్ తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టారు. తొలి సెమీస్ లో సెరెనా విలియమ్స్ ను ప్లిస్కోవా ఓడించింది. రెండో సెమీస్ లో వోజ్నియాకిపై కెర్బర్ గెలిచింది. 6-4, 6-3తో ఓడించి టైటిల్ పోరుకు సిద్ధమైంది.1996లో స్టెఫీగ్రాఫ్ తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన జర్మనీ క్రీడాకారిణిగా కెర్బర్ ఘనత సాధించింది. 28 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండర్ జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ దక్కించుకుంది. యూఎస్ ఓపెన్ లో ఫైనల్లో అడుగుపెట్టడంతో పాటు కెర్బర్ నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. తన క్రీడా జీవితంలో ఇదో అద్భుతమైన రోజు అని కెర్బర్ పేర్కొంది. -
ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీ!
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో ఫైనల్ బెర్త్ కోసం సెమిఫైనల్లో మాజీ నంబర్ వన్, డెన్మార్క్ ప్లేయర్ కరోలిన్ వోజ్నియాకి జర్మనీ స్టార్ ఏంజెలిక్ కెర్బర్ తో తలపడనుంది. క్వార్టర్స్ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో 6-0, 6-2 తేడాతో హోబ్లింగ్ అనస్తాసిజా సెవత్సోవాపై నెగ్గి సెమిస్ చేరింది. సెవత్సోవకు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ క్వార్టర్స్. వోజ్నియాకి 2009, 2014లో యూఎస్ ఓపెన్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. 2010, 2011లో సెమిఫెనల్లోనే ఆమె పోరాటం ముగిసింది. తాజాగా మరోసారి సెమిస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు రెండో సీడ్ కెర్బర్ కూడా యూఎస్ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తోంది. ఇటలీకి చెందిన రోబెర్టా విన్సీపై 7-5, 6-0తో నెగ్గి సెమిఫైనల్లోకి ప్రవేశించింది. రెండు వరుస సెట్లలో ప్రత్యర్థని మట్టికరిపించింది. ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్ కెర్బర్ కు ఇది రెండో యూఎస్ సెమిఫైనల్. తొలిసారి 2011లో సెమిఫైనల్ చేరిన కెర్బర్ ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అయితే వోజ్నియాకిపై గెలుపోటముల రికార్డు 7-5తో ఇప్పటివరకూ కెర్బర్ దే పైచేయిగా కనిపిస్తోంది. -
కెర్బర్ కష్టపడింది
* యూఎస్ ఓపెన్ మూడో రౌండ్లో రెండో సీడ్ * ముగురుజా అవుట్ * నాదల్, జొకోవిచ్ ముందంజ న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో జర్మనీ స్టార్, రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. అయితే మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో కెర్బర్ 6-2, 7-6 (9/7)తో లుసిక్ బెరోని (క్రొయేషియా)పై విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ కెర్బర్‌కు రెండో రౌండ్లో ఆమె ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైంది. తొలి సెట్‌ను అలవోకగా చేజిక్కించుకున్నా... రెండో సెట్లో బెరోని పుంజుకోవడంతో టైబ్రేక్ దాకా పోరాడాల్సి వచ్చింది. గంటా 32 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కెర్బర్ 2 ఏస్‌లు సంధిస్తే... బెరోని 4 ఏస్‌లు సాధించింది. అరుుతే బెరోని 55 అనవసర తప్పిదాలు, 7 డబుల్ ఫాల్ట్‌లు చేస్తే... జర్మనీ క్రీడాకారిణి 15 తప్పిదాలు, రెండు డబుల్ ఫాల్ట్‌లే చేసింది. ముగురుజాకు షాక్ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజాకు రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. అన్‌సీడెడ్ అనస్తసిజా సెవస్తొవా (లాత్వియా) వరుస సెట్లలో 7-5, 6-4తో ముగురుజాకు షాకిచ్చింది. గంటా 39 నిమిషాల్లో స్పెరుున్స్టార్ ఆట కట్టించింది. రొమేనియాకు చెందిన ఐదో సీడ్ సిమోనా హలెప్ 6-3, 6-4తో లూసి సఫరొవా (చెక్‌రిపబ్లిక్)పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవా (రష్యా) 4-6, 4-6తో వోజ్నియాకి (డెన్మార్క్) చేతిలో కంగుతినగా, ఏడో సీడ్ రాబెర్ట విన్సీ (ఇటలీ) 6-1, 6-3తో క్రిస్టినా మెక్ హేల్ (అమెరికా)పై గెలిచింది. 8వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6-1, 6-1తో కేలా డే (అమెరికా)పై, 12వ సీడ్ డొమినికా సిబుల్కొవా (స్లోవేకియా) 6-7 (5/7), 6-2, 6-2తో ఎవ్జీనియా రొదినా (రష్యా)పై విజయం సాధించారు. జొకోవిచ్ ఆడకుండానే మూడో రౌండ్లోకి... పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, నంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్ కోర్టులో దిగకుండానే మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అతని ప్రత్యర్థి జిరి వెసెలి (చెక్ రిపబ్లిక్) నుంచి టాప్‌సీడ్ సెర్బియన్ స్టార్‌కు వాకోవర్ లభించింది. భారత నంబర్‌వన్ సాకేత్ మైనేనిపై తొలిరౌండ్లో నెగ్గిన వెసెలి గాయంతో వైదొలిగాడు. దీంతో రెండో రౌండ్లో టాప్‌సీడ్ ఆటగాడికి రాకెట్ పట్టాల్సిన అవసరం రాలేదు. మిగతా మ్యాచ్‌ల్లో స్పెయిన్ స్టార్, నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ 6-0, 7-5, 6-1తో అండ్రియస్ సెప్పి (ఇటలీ)పై సునాయాస విజయం సాధించాడు. ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-1, 6-2, 6-3తో సెర్గి స్టాఖోవ్స్కీ (ఉక్రెరుున్)పై, తొమ్మిదో సీడ్ జో విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స) 6-4, 3-6, 6-3, 6-4తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై, పదో సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స) 7-5, 6-4, 6-3తో జాన్ సట్రాల్ (చెక్ రిపబ్లిక్)పై, 20వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా) 6-3, 6-4, 6-7 (7/10), 6-3తో స్టీవ్ డార్కిస్ (బెల్జియం)పై గెలుపొందారు. భారత జోడీల శుభారంభం సీజన్ చివరి గ్రౌండ్స్లామ్ టోర్నీలో భారత క్రీడాకారులు వారి భాగస్వాములతో కలిసి శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ మిక్స్డ్ డబుల్స్ చాంపియన్ లియాండర్ పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి 6-3, 6-2తో సచియా వికెరి-ఫ్రాన్సెస్ టైఫో (అమెరికా) జంటపై అలవోక విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో హైదరాబాదీ స్టార్, ఏడో సీడ్ సానియా మీర్జా-బార్బరా స్టిక్రోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6-3, 6-2తో జెడ మైరుు హర్ట్-ఎనా షిబహర (అమెరికా) జోడీపై గెలుపొందింది. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న-ఫ్రెడరిక్ నీల్సన్ (డెన్మార్క్)జంట 6-3, 6-7 (3/7), 6-3తో 16వ సీడ్ రాడెక్ స్టెపానెక్(చెక్ రిపబ్లిక్)- నెనద్ జిమొంజిక్ (సెర్బియా) ద్వయంపై గెలుపొందింది. -
కెర్బర్ ఇంటిముఖం
* తొలి రౌండ్లోనే ఓడిన మూడో సీడ్ * కికి బెర్టెన్స్ సంచలనం * శ్రమించి నెగ్గిన ముర్రే పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మంగళవారం పెను సంచలనం నమోదైంది. ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, మూడో సీడ్ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. అన్‌సీడెడ్ ప్లేయర్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) అద్భుత ఆటతీరుతో ఈ జర్మన్ స్టార్‌ను ఓడించి తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించింది. మూడు సెట్లపాటు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో బెర్టెన్స్ 6-2, 3-6, 6-3తో కెర్బర్‌పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. మరోవైపు ఐదో సీడ్ విక్టోరియా అజరెంకా తొలి రౌండ్ ఓటమి నుంచి తప్పించుకొని ఊపిరి పీల్చుకుంది. కరీన్ నాప్ (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో అజరెంకా తొలి సెట్‌ను 3-6తో కోల్పోయి, రెండో సెట్‌ను 7-6 (8/6)తో గెలిచింది. నిర్ణాయక మూడో సెట్లో అజరెంకా 0-4తో వెనుకబడిన దశలో ఆమె ప్రత్యర్థి కరీన్ నాప్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 14వ సీడ్ ఇవనోవిచ్ (సెర్బియా) 6-0, 5-7, 6-2తో డోడిన్ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ వీనస్ (అమెరికా) 7-6 (7/5), 7-6 (7/4)తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, ఎనిమిదో సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-3, 6-1తో ఎస్పినోసా (స్పెయిన్)పై గెలి చారు. అయితే 20వ సీడ్ జొహనా కొంటా (బ్రిటన్), 23వ సీడ్ జంకోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఐదు సెట్ల పోరాటంలో నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తొలి రౌండ్లో ముర్రే 3-6, 3-6, 6-0, 6-3, 7-5తో నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-4, 6-1, 6-1తో యెన్ సున్ లు (చైనీస్ తైపీ)పై, ఐదో సీడ్ నాదల్ (స్పెయిన్) 6-1, 6-1, 6-1తో సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)పై, ఆరో సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-4తో స్ట్రఫ్ (జర్మనీ)పై, ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-3, 6-2, 6-1తో పోస్పిసిల్ (కెనడా)పై, 11వ సీడ్ ఫెరర్ (స్పెయిన్) 6-1, 6-2, 6-0తో డాన్స్కాయ్ (రష్యా)పై గెలిచారు. -
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సెరెనాకు షాక్
మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కు ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సెరెనా 4-6, 6-3, 4-6 తేడాతో ఏడో సీడ్ క్రీడాకారిణి కెర్బర్(జర్మనీ) చేతిలో ఓటమి పాలైంది. దీంతో తన కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్ సాధించి స్టెఫీగ్రాఫ్ రికార్డును సమానం చేద్దామనుకున్న సెరెనా ఆశలు తీరకపోగా, ఏడోసారి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ ను గెలుద్దామనుకున్న నల్ల కలువ లక్ష్యానికి బ్రేక్ పడింది. అంచనాలు మించి రాణించిన కెర్బర్ ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల చాంపియన్ గా అవతరించి సరికొత్త రికార్డును సృష్టించింది. తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ గెలిచిన కెర్బర్.. కొత్త చరిత్రతో ప్రపంచ టెన్నిస్ నివ్వెరపోయేలే చేసింది. తొలి సెట్ లో సెరెనా సర్వీసులను పలుమార్లు బ్రేక్ చేసిన కెర్బర్ ఆ గేమ్ ను సొంతం చేసుకుని పైచేయి సాధిచింది. అయితే రెండో సెట్ లో తిరిగి పుంజుకున్న సెరెనా తనదైన సర్వీసులతో రెచ్చిపోయి రెండో సెట్ ను చేజిక్కించుకుంది. దీంతో నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది. తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న కెర్బర్.. సెరెనాను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ సెట్ లో సెరెనా అనవసర తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. ఓవరాల్ గా 26వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన సెరెనాకు ఇది ఐదో ఓటమి.