ఫ్రెంచ్ ఓపెన్: తొలి రోజే సంచలనం!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ లో తొలిరోజే సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, జర్మనీ భామ ఏంజెలికా కెర్బర్ కు ఊహించని షాక్ తగిలింది. వరుసగా రెండో ఏడాది తొలి రౌండ్లోనే కెర్బర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంది. ఆదివారం సాయంత్రం ఇక్కడి రోలాండ్ గారోస్ లో జరిగిన మ్యాచ్ లో రష్యా క్రీడాకారిణి మకరోవా చేతిలో 6-2, 6-2 తేడాతో కెర్బర్(జర్మనీ) ఓటమి పాలైంది. రెండు వరుస సెట్లలో రష్యా భామ తన ప్రతాపం చూపించి, నంబర్ వన్ ర్యాంకర్ ను ముప్పుతిప్పలు పెట్టింది.
ఇప్పటికే ఈ గ్రాండ్ స్లామ్ లో మహిళల సింగిల్స్ విభాగంలో సెరెనా విలియమ్స్, షరపోవా గైర్హాజరీతో కచ్చితమైన ఫేవరెట్ కనిపించడంలేదు. నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ), డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్)లతో పాటు మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 13వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) టైటిల్ రేసులో ఉన్నారని అందరూ ఊహించారు. కానీ కెర్బర్ సాధారణ ప్రదర్శనతో రోలాండ్ గారోస్ నుంచి తొలి రౌండ్లోనే ఓడిపోయి ఇంటి దారి పట్టింది.