సంచలనాల మోత | Garbiñe Muguruza knocks No1 seed Angelique Kerber out of Wimbledon | Sakshi
Sakshi News home page

సంచలనాల మోత

Published Tue, Jul 11 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

సంచలనాల మోత

సంచలనాల మోత

టాప్‌ సీడ్‌ కెర్బర్‌కు ముగురుజా షాక్‌
నంబర్‌వన్‌ ర్యాంక్‌ కోల్పోనున్న జర్మనీ తార
నాలుగో సీడ్‌ స్వితోలినా, ఐదో సీడ్‌ వొజ్నియాకి కూడా ఇంటిముఖం


వారం రోజులు సాఫీగా సాగిన వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సోమవారం సంచలనాలతో దద్దరిల్లింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో ఏకంగా టాప్‌–10లోని నలుగురు సీడెడ్‌ క్రీడాకారిణులు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించారు. ఇందులో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ), నాలుగో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), ఐదో సీడ్‌ కరోలిన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌), తొమ్మిదో సీడ్‌ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్‌) ఉండటం గమనార్హం.

లండన్‌: మూడో రౌండ్‌లో అతికష్టమ్మీద గట్టెక్కిన టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) అదే ఫలితాన్ని ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పునరావృతం చేయలేకపోయింది. 14వ సీడ్, 2015 రన్నరప్‌ ముగురుజా (స్పెయిన్‌) అద్భుత పోరాటానికి గతేడాది రన్నరప్‌ కెర్బర్‌ చేతులెత్తేసింది. 2 గంటల 18 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ముగురుజా 4–6, 6–4, 6–4తో కెర్బర్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

 ఈ ఓటమి తో కెర్బర్‌ వచ్చే వారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన నంబర్‌వన్‌ ర్యాంక్‌ను కోల్పోనుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్, 13వ సీడ్‌ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) 6–3, 7–6 (8/6)తో నాలుగో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌)పై, 24వ సీడ్‌ కోకో వాండెవాగె (అమెరికా) 7–6 (7/4), 6–4తో ఐదో సీడ్, మాజీ నంబర్‌వన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌)లపై సంచలన విజయాలు సాధించి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ (బెల్జియం) తర్వాత కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన అనంతరం ఆడిన రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనూ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన ప్లేయర్‌గా ఒస్టాపెంకో గుర్తింపు పొందింది. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) 6–2, 6–4తో తొమ్మిదో సీడ్, 2012 రన్నరప్‌ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్‌)ను ఇంటిదారి పట్టించింది.

గతంలో ఐదుసార్లు చాంపియన్, పదో సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) 6–3, 6–2తో 27వ సీడ్‌ అనా కొంజూ (క్రొయేషియా)ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో 1994లో మార్టినా నవ్రతిలోవా (అమెరికా) తర్వాత ఈ టోర్నీ లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన పెద్ద వయస్కు రాలిగా 37 ఏళ్ల వీనస్‌ గుర్తింపు పొందింది.

మరో విజయం సాధిస్తే...
ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కెర్బర్‌ ఓడిపోవడంతో రెండో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) నంబర్‌వన్‌ ర్యాంక్‌కు విజయం దూరంలో నిలిచింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హలెప్‌ 7–6 (7/3), 6–2తో మాజీ నంబర్‌వన్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌)ను ఓడించింది. ఈ టోర్నీలో హలెప్‌ సెమీస్‌కు చేరితే తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంటుంది. ఒకవేళ హలెప్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోతే మాత్రం కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)కు నంబర్‌వన్‌ ర్యాంక్‌ దక్కుతుంది.

33 ఏళ్ల తర్వాత...
మరో మ్యాచ్‌లో ఆరో సీడ్‌ జొహానా కొంటా 7–6 (7/3), 4–6, 6–4తో 21వ సీడ్‌ కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌)ను ఓడిం చింది. ఈ క్రమంలో ఆమె 1984లో జో డ్యూరీ తర్వాత వింబుల్డన్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన తొలి బ్రిటన్‌ క్రీడాకారిణిగా ఘనత సాధించింది. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రిబరికోవా (స్లొవేకియా) 6–4, 2–6, 6–3తో మార్టిక్‌ (క్రొయేషియా)ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో కుజ్‌నెత్సోవాతో ముగురుజా; వాండెవాగెతో రిబరికోవా; వీనస్‌తో ఒస్టాపెంకో; కొంటాతో హలెప్‌ తలపడతారు.

సానియా జంటకు నిరాశ
మహిళల డబుల్స్‌ మూడో రౌండ్‌లో సానియా మీర్జా (భారత్‌)–ఫ్లిప్‌కెన్స్‌ (బెల్జియం) జంట 2–6, 4–6తో హింగిస్‌ (స్విట్జర్లాండ్‌)–యుంగ్‌ జాన్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. బాలికల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మహెక్‌ జైన్‌ (భారత్‌) 7–6 (7/4), 4–6, 6–4తో బోస్కోవిచ్‌ (క్రొయేషియా)పై నెగ్గగా... బాలుర సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సిద్ధాంత్‌ 6–3, 2–6, 5–7తో మార్టినెయు (ఫ్రాన్స్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు.  

ఫెడరర్‌ జోరు...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఏడుసార్లు చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), టాప్‌ సీడ్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఫెడరర్‌ 6–4, 6–2, 6–4తో 13వ సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై, ముర్రే 7–6 (7/1), 6–4, 6–4తో బెనోయిట్‌ పెయిర్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచారు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఫెడరర్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకోవడం ఇది 50వసారి కావడం విశేషం. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో 11వ సీడ్‌ బెర్డిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌) 6–3, 6–7 (1/7), 6–3, 3–6, 6–3తో 8వ సీడ్‌ థీమ్‌ (ఆస్ట్రియా)పై, ఏడో సీడ్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 6–2, 6–2, 6–2తో 18వ సీడ్‌ అగుట్‌ (స్పెయిన్‌)పై, 24వ సీడ్‌ సామ్‌ క్వెరీ (అమెరికా) 5–7, 7–6 (7/5), 6–3, 6–7 (11/13), 6–3తో అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)పై గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement