మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో బలమైన ప్రత్యర్థులను ఓడిస్తూ సాగిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రయాణం ఘనంగా ముగిసింది. క్వార్టర్స్‌లో నాదల్‌ను, సెమీస్‌లో థీమ్‌ను ఓడించిన జ్వెరెవ్... ఫైనల్లోనూ అదే ప్రదర్శనను కనబరచి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన టైటిల్ పోరులో జ్వెరెవ్ 6–7 (6/8), 6–4, 6–3తో మాటియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు.
మాడ్రిడ్ ఓపెన్‌ను జ్వెరెవ్ గెలవడం రెండో సారి. 2018లో అతను తొలిసారి ఈ టైటిల్‌ను నెగ్గగా...అతని కెరీర్‌లో ఇది నాలుగో మాస్టర్స్–1000 టైటిల్. మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించిన ప్రపంచ పదో ర్యాంకర్ బెరెటిని కీలక సమయాల్లో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్‌లో ఇద్దరు ప్లేయర్లు కూడా హోరాహోరీగా తలపడటంతో టై బ్రేక్‌కు దారి తీసింది. ఇందులో నెగ్గిన బెరెటిని తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు.
రెండో సెట్‌లో బెరెటిని సర్వ్ చేసిన తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్... ఆ తర్వాత తన గేమ్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6–4తో సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో సెట్‌లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన జ్వెరెవ్ ఆ సెట్‌ను గెలవడంతో లాంఛనం పూర్తి చేశాడు. మ్యాచ్‌లో బెరెటిని 50 అనవసర తప్పిదాలు చేయడంతో పాటు... మూడో సెట్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా వాటిని జారవిడిచి మ్యాచ్‌ను కోల్పోయాడు.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జ్వెరెవ్ 3,15,160 యూరోల ప్రైజ్‌మనీ (సుమారు రూ. 2 కోట్ల 81 లక్షలు)ని అందుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో మార్సెల్ గ్రనోలర్స్ (స్పెయిన్)– హరసియో జెబలోస్ (అర్జెంటీనా) జంట 1–6, 6–3, 10–8తో నికోలా మెక్టిక్–మాటె పవిచ్ (క్రొయేషియా) జోడిపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment