Madrid Open Masters Series
-
Madrid Open Masters 2023: క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ
ఈ సీజన్లో తమ నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 1–6, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో మార్సెలో మెలో (బ్రెజిల్)–అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) జంటను ఓడించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. -
దిగ్గజాలకు షాకిచ్చి చరిత్ర సృష్టించిన టెన్నిస్ యువ కెరటం
మాడ్రిడ్: స్పెయిన్ యువ టెన్నిస్ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్ (19) మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్1000 టైటిల్‌ను నెగ్గి చరిత్ర సృష్టించాడు. క్వార్టర్స్‌లో తన ఆరాధ్య ఆటగాడు రఫెల్ నదాల్‌ను, సెమీస్‌లో టాప్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్‌లను ఓడించిన ఈ యువ సంచలనం.. ఫైనల్లో 6-3, 6-1తో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ 3 ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను చిత్తు చేసి సీజన్లో నాలుగో టైటిల్‌ను ఎగురేసుకుపోయాడు. ఈ క్రమంలో అల్కరాజ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే సీజన్లో నదాల్ (2005) తర్వాత రెండు మాస్టర్స్ 1000 టైటిళ్లు నెగ్గిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. అల్కరాజ్ ఇప్పటికే టాప్ 10లోకి ప్రవేశించిన అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డుల్లో నిలిచాడు. మాడ్రిడ్ ఓపెన్‌లో విజయం సాధించిన అనంతరం జ్వెరెవ్.. అల్కరాజ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. అల్కరాజ్ను భవిష్యత్తు సూపర్ స్టార్‌గా అభివర్ణించాడు. చిన్న వయసులోనే దిగ్గజాలందరికీ ముచ్చెమటలు పట్టిస్తున్న అల్కరాజ్.. మున్ముందు అనేక గ్రాండ్ స్లామ్‌లు సాధించాలని ఆకాంక్షించాడు. చదవండి: గుకేశ్ ఖాతాలో ‘హ్యాట్రిక్’ టైటిల్ -
Alexander Zverev: జ్వెరెవ్ అదరహో...
మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో బలమైన ప్రత్యర్థులను ఓడిస్తూ సాగిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రయాణం ఘనంగా ముగిసింది. క్వార్టర్స్‌లో నాదల్‌ను, సెమీస్‌లో థీమ్‌ను ఓడించిన జ్వెరెవ్... ఫైనల్లోనూ అదే ప్రదర్శనను కనబరచి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన టైటిల్ పోరులో జ్వెరెవ్ 6–7 (6/8), 6–4, 6–3తో మాటియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. మాడ్రిడ్ ఓపెన్‌ను జ్వెరెవ్ గెలవడం రెండో సారి. 2018లో అతను తొలిసారి ఈ టైటిల్‌ను నెగ్గగా...అతని కెరీర్లో ఇది నాలుగో మాస్టర్స్–1000 టైటిల్. మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించిన ప్రపంచ పదో ర్యాంకర్ బెరెటిని కీలక సమయాల్లో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్లో ఇద్దరు ప్లేయర్లు కూడా హోరాహోరీగా తలపడటంతో టై బ్రేక్‌కు దారి తీసింది. ఇందులో నెగ్గిన బెరెటిని తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో బెరెటిని సర్వ్ చేసిన తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్... ఆ తర్వాత తన గేమ్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6–4తో సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో సెట్లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన జ్వెరెవ్ ఆ సెట్‌ను గెలవడంతో లాంఛనం పూర్తి చేశాడు. మ్యాచ్‌లో బెరెటిని 50 అనవసర తప్పిదాలు చేయడంతో పాటు... మూడో సెట్లో జ్వెరెవ్ సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా వాటిని జారవిడిచి మ్యాచ్‌ను కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ్వెరెవ్ 3,15,160 యూరోల ప్రైజ్‌మనీ (సుమారు రూ. 2 కోట్ల 81 లక్షలు)ని అందుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో మార్సెల్ గ్రనోలర్స్ (స్పెయిన్)– హరసియో జెబలోస్ (అర్జెంటీనా) జంట 1–6, 6–3, 10–8తో నికోలా మెక్టిక్–మాటె పవిచ్ (క్రొయేషియా) జోడిపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
జ్వెరెవ్ చేతిలో రాఫెల్ నాదల్కు షాక్
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4తో టాప్ సీడ్, ఐదుసార్లు మాజీ చాంపియన్ నాదల్‌పై నెగ్గి సెమీఫైనల్ చేరాడు. క్లే కోర్టులపై నాదల్‌పై జ్వెరెకిదే తొలి విజయం కావడం విశేషం. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ సర్వీస్‌ను జ్వెరెవ్ మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఇప్పట్లో బాచ్ ‘టోక్యో’ పర్యటన కష్టమే... టోక్యో ఒలింపిక్స్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ ఈ నెలలో జపాన్‌కు రావడం కష్టమేనని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం మే 11 వరకు టోక్యోతోపాటు మరో మూడు నగరాల్లో విధించిన అత్యవసర పరిస్థితిని ఈనెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. దాంతో థామస్ బాచ్ పర్యటన వాయిదా పడే అవకాశముంది. -
బోపన్న-మెర్జియా జంటకు ‘మాడ్రిడ్’ టైటిల్
మాడ్రిడ్ (స్పెయిన్) : ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అద్భుత విజయం సాధించిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఒక మ్యాచ్ పాయింట్ కాచుకున్న బోపన్న జంట 6-2, 6-7 (5/7), 11-9తో ఐదో సీడ్ మట్కోవ్‌స్కీ (పోలండ్)-నెనాద్ జిమోనిచ్ (సెర్బియా) జోడీని ఓడించింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ దక్కించుకున్న బోపన్న ద్వయం రెండో సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో 8-9తో ఓటమి అంచుల్లో నిలిచినప్పటికీ... పట్టుదలతో పోరాడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. బోపన్న కెరీర్లో ఇది మూడో ‘మాస్టర్స్ సిరీస్’ టైటిల్ కావడం విశేషం. 35 ఏళ్ల ఈ బెంగళూరు ప్లేయర్ 2011లో ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్)తో, 2012లో మహేశ్ భూపతి (భారత్)తో కలిసి పారిస్ మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించాడు. ఓవరాల్‌గా కెరీర్లో 13వ డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్నకు ఈ ఏడాది ఇది మూడో టైటిల్. విజేతగా నిలిచిన బోపన్న-మెర్జియాలకు ప్రైజ్‌మనీగా 2,47,560 యూరోలు (రూ. కోటీ 76 లక్షలు) లభించాయి. -
‘మాడ్రిడ్’ ఫైనల్లో బోపన్న జంట
న్యూఢిల్లీ : మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-7 (4/7), 6-3, 11-9తో ఆరో సీడ్ గ్రానోలెర్స్-లోపెజ్ (స్పెయిన్) జోడీపై సంచలన విజయం సాధించింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన బోపన్న జంట రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లోని కీలకదశలో పాయింట్లు సాధించిన బోపన్న విజయాన్ని ఖాయం చేసుకుంది. డానియల్ నెస్టర్‌తో కలిసి ఈ ఏడాది రెండు టైటిల్స్ నెగ్గిన బోపన్న.. మెర్జియాతో కలిసి మరో టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు.