ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీ!
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో ఫైనల్ బెర్త్ కోసం సెమిఫైనల్లో మాజీ నంబర్ వన్, డెన్మార్క్ ప్లేయర్ కరోలిన్ వోజ్నియాకి జర్మనీ స్టార్ ఏంజెలిక్ కెర్బర్ తో తలపడనుంది. క్వార్టర్స్ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో 6-0, 6-2 తేడాతో హోబ్లింగ్ అనస్తాసిజా సెవత్సోవాపై నెగ్గి సెమిస్ చేరింది. సెవత్సోవకు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ క్వార్టర్స్. వోజ్నియాకి 2009, 2014లో యూఎస్ ఓపెన్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. 2010, 2011లో సెమిఫెనల్లోనే ఆమె పోరాటం ముగిసింది. తాజాగా మరోసారి సెమిస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.
మరోవైపు రెండో సీడ్ కెర్బర్ కూడా యూఎస్ ఓపెన్లో జోరు కొనసాగిస్తోంది. ఇటలీకి చెందిన రోబెర్టా విన్సీపై 7-5, 6-0తో నెగ్గి సెమిఫైనల్లోకి ప్రవేశించింది. రెండు వరుస సెట్లలో ప్రత్యర్థని మట్టికరిపించింది. ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్ కెర్బర్ కు ఇది రెండో యూఎస్ సెమిఫైనల్. తొలిసారి 2011లో సెమిఫైనల్ చేరిన కెర్బర్ ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అయితే వోజ్నియాకిపై గెలుపోటముల రికార్డు 7-5తో ఇప్పటివరకూ కెర్బర్ దే పైచేయిగా కనిపిస్తోంది.