ఫైనల్లో సెరెనా, వొజ్నియాకి
ఫైనల్ నేటి రాత్రి గం. 9.30 నుంచి
టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
టాప్-10లో ఎనిమిది మంది సీడెడ్ క్రీడాకారిణులు ప్రిక్వార్టర్ ఫైనల్లోపే నిష్ర్కమించడంతో అందరి దృష్టి టాప్ సీడ్ సెరెనా విలియమ్స్, పదో సీడ్ కరోలైన్ వొజ్నియాకిలపైనేపడింది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ ఈ ఇద్దరు ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా అంతిమ సమరానికి అర్హత సాధించారు.
యూఎస్ ఓపెన్‌లో ‘హ్యాట్రిక్’ సాధించడంతోపాటు కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గేందుకు సెరెనా... గతంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించినా ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న తొలి ‘గ్రాండ్‌స్లామ్’ విజయాన్ని రుచి చూసేందుకు వొజ్నియాకి నేడు అమీతుమీ తేల్చుకోనున్నారు.
న్యూయార్క్: ఈ ఏడాది తొలి మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరలేకపోయిన ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ సొంతగడ్డపై మాత్రం తన జోరు కొనసాగిస్తోంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈ నల్లకలువ వరుసగా నాలుగో ఏడాది టైటిల్ పోరుకు చేరుకుంది. ఇదే టోర్నీలో 2011లో రన్నరప్‌గా నిలిచిన సెరెనా 2012, 2013లలో విజేతగా నిలిచింది.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సెరెనా 6-1, 6-3తో 17వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా)పై అలవోకగా గెలిచింది. కేవలం 60 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు వచ్చిన ఆరుసార్లూ ఆమే పాయింట్లు సాధించింది. యూఎస్ ఓపెన్‌లో ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరిన సెరెనా ఈసారి తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. అంతేకాకుండా గత ఆరు మ్యాచ్‌ల్లో ఆమె ఒక సెట్‌లో గరిష్టంగా మూడు గేమ్‌లు మాత్రమే సమర్పించుకుంది.
నాలుగేళ్ల తర్వాత...: డెన్మార్క్ భామ వొజ్నియాకి 2009 తర్వాత రెండోసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి చేరుకుంది. అన్‌సీడెడ్ క్రీడాకారిణి షుయె పెంగ్ (చైనా)తో జరిగిన సెమీఫైనల్లో వొజ్నియాకి 7-6 (7/1), 4-3తో ఆధిక్యంలో ఉన్నదశలో గాయం కారణంగా పెంగ్ మ్యాచ్ నుంచి వైదొలిగింది. దాంతో వొజ్నియాకిని విజేతగా ప్రకటించారు. ఎండ తీవ్రతను తట్టుకోలేకపోయిన పెంగ్ రెండో సెట్ ఎనిమిదో గేమ్ జరుగుతున్న సమయంలో కాలి కండరాలు పట్టేయడంతో కోర్టులోనే కుప్పకూలిపోయింది. నిర్వాహకులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 2009 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన వొజ్నియాకి... కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.
ఎనిమిది వేర్వేరు మంది...
సెరెనా, వొజ్నియాకి ఫైనల్‌కు చేరడంతో... 37 ఏళ్ల తర్వాత ఒకే సీజన్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఎనిమిది మంది వేర్వేరు క్రీడాకారిణులు ఫైనల్‌కు చేరారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నా లీ (చైనా), సిబుల్కోవా (స్లొవేకియా); ఫ్రెంచ్ ఓపెన్‌లో షరపోవా (రష్యా), సిమోనా హలెప్ (రుమేనియా); వింబుల్డన్‌లో క్విటోవా (చెక్ రిపబ్లిక్), బౌచర్డ్ ఫైనల్లోకి చేరారు. ఈసారి యుఎస్ ఓపెన్‌లో నా లీ బరిలోకి దిగకపోవడం... మిగతా ఏడుగురు ప్రిక్వార్టర్ ఫైనల్లోపే ఓడిపోయారు.