క్విటోవాకు చుక్కెదురు | Serena Williams & Djokovic win but Kvitova loses | Sakshi
Sakshi News home page

క్విటోవాకు చుక్కెదురు

Published Thu, Jan 21 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

క్విటోవాకు చుక్కెదురు

క్విటోవాకు చుక్కెదురు

రెండో రౌండ్‌లో ఓడిన ఆరో సీడ్
గావ్రిలోవా సంచలనం
‘ఏస్’ల్లో క్రిస్టినా రికార్డు
ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ

మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో రష్యా సంతతికి చెందిన ఆస్ట్రేలియా యువతార దరియా గావ్రిలోవా అద్భుత ఆటతీరుతో ‘రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్’గా నిలిచిన క్విటోవాను బోల్తా కొట్టించింది.

89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గావ్రిలోవా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయినా... క్విటోవా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి అనుకున్న ఫలితం సాధించింది. మరోవైపు క్విటోవా  ఏడు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 35 అవనసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. క్విటోవా ఓటమితో ప్రస్తుతం టాప్-32 సీడింగ్ క్రీడాకారిణుల్లో 18 మంది మాత్రమే మిగిలారు.

 సెరెనా, షరపోవా ముందంజ
మరోవైపు టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), ఐదో సీడ్ షరపోవా, నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) అలవోక విజయాలతో మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సెరెనా 6-1, 6-2తో సు వీ సెయి (చైనీస్ తైపీ)పై, షరపోవా 6-2, 6-1తో సస్నోవిచ్ (బెలారస్)పై, రద్వాన్‌స్కా 6-4, 6-2తో యుజిని బుచార్డ్ (కెనడా)పై గెలిచారు

 ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 6-7 (5/7), 6-2, 6-2తో మరియా సకరి (గ్రీస్)పై, 12వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 6-3, 6-3తో తిమియా బాబోస్ (హంగేరి)పై, 13వ సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-2, 6-3తో ఫాల్కోని (అమెరికా)పై నెగ్గి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.

 ఫెడరర్, జొకోవిచ్ జోరు
పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), ఏడో సీడ్ నిషికోరి (జపాన్), తొమ్మిదో సీడ్ సోంగా (ఫ్రాన్స్) మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జొకోవిచ్ 6-1, 6-2, 7-6 (7/3)తో హేల్స్ (ఫ్రాన్స్)పై, ఫెడరర్ 6-3, 7-5, 6-1తో అలెగ్జాండర్ డల్గొపలోవ్ (ఉక్రెయిన్)పై, బెర్డిచ్ 6-4, 6-0, 6-3తో మీర్జా బేసిక్ (బోస్నియా అండ్ హెర్జెగోవినా)పై, నిషికోరి 6-3, 7-6 (7/5), 6-3తో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)పై గెలిచారు.

 పేస్ జంటకు షాక్
పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జంటకు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. పేస్-చార్డీ జోడీ 3-6, 4-6తో 12వ సీడ్ రాబర్ట్ ఫరా-కబాల్ (కొలంబియా) జంట చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో మహేశ్ భూపతి (భారత్)-గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) ద్వయం 7-6 (7/4), 3-6, 6-4తో అలెక్స్ బోల్ట్-విటింగ్టన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

 రికార్డు చేసినా తప్పని ఓటమి
మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో), క్రిస్టినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘ఏస్’ల్లో కొత్త రికార్డు నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక ‘ఏస్’లు సంధించిన రికార్డును క్రిస్టినా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో క్రిస్టినా 31 ఏస్‌లు కొట్టింది. గతంలో ఈ రికార్డు  లిసికి (జర్మనీ-27 ఏస్‌లు) పేరిట ఉండేది. అయితే క్రిస్టినా మాత్రం విజయాన్ని దక్కించుకోలేకపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement