మెల్‌బోర్న్: రెండేళ్ల క్రితం రెండు నెలల గర్భంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మళ్లీ టైటిలే లక్ష్యంగా వేగం పెంచింది. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ రికార్డును సమం చేసేందుకు సిద్ధమైన ఆమె సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. టాప్‌సీడ్ హలెప్‌కు రెండో రౌండ్లోనే చావుతప్పి కన్నులొట్టపోయినంత పనైంది. ఆమె అతికష్టమ్మీద గట్టెక్కింది. వీనస్ విలియమ్స్, సీడెడ్ క్రీడాకారిణిలు ఒసాకా, స్వితోలినా, ప్లిస్కోవా మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ సీడ్ జొకోవిచ్ సునాయాస విజయంతో ముందంజ వేయగా... రావ్‌నిక్, నిషికొరి, జ్వెరెవ్ మూడో రౌండ్‌కు చేరారు.
‘అమ్మ’ అలవోకగా...
మహిళల సింగిల్స్‌లో 16వ సీడ్‌గా బరిలోకి దిగిన అమెరికన్ దిగ్గజం సెరెనా రెండో రౌండ్లో దూకుడుగా ఆడింది. కోర్ట్ అంతా పాదరసంలా కదిలిన ఈ ‘అమ్మ’ 6–2, 6–2తో ఎజెని బౌచర్డ్ (కెనడా)పై విజయం సాధించింది. కేవలం గంటా 10 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. టాప్ సీడ్ హలెప్ (రుమేనియా)కు అన్‌సీడెడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ముచ్చెమటలు పట్టించింది. చివరకు హలెప్ 6–3, 6–7 (5/7), 6–4తో కెనిన్‌పై గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది.
మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ నవొమి ఒసాకా (జపాన్) 6–2, 6–4తో తమర జిదన్సెక్ (స్లోవేనియా)పై, ఆరో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో కుజ్‌మోవ (స్లోవేకియా)పై గెలుపొందారు. ఏడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 6–1, 6–0తో బ్రింగిల్ (అమెరికా)ను ఓడించగా, వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–3, 4–6, 6–0తో కార్నెట్ (ఫ్రాన్స్)పై, ముగురుజా (స్పెయిన్) 6–4, 6–7 (3/7), 7–5తో జొహానా కొంటా (ఇంగ్లండ్)పై నెగ్గింది. మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–4తో అనస్తాసియా పొటపొవా (రష్యా)పై విజయం సాధించింది.
జోరుమీదున్న జొకో
పురుషుల సింగిల్స్‌లో సెర్బియన్ స్టార్, టాప్ సీడ్ జొకోవిచ్ జోరు పెంచాడు. రెండో రౌండ్లో అతను 6–3, 7–5, 6–4తో జో విల్‌ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్)ను ఇంటిదారి పట్టించాడు. నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–6 (7/5), 6–4, 5–7, 6–7 (6/8), 6–1తో జెరిమి చార్డి (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ నిషికొరి (జపాన్) 6–3, 7–6 (8/6), 5–7, 5–7, 7–6 (10/7)తో కార్లోవిక్ (క్రొయేషియా)పై చెమటోడ్చి నెగ్గారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఆటగాడు అలెక్సి పొపిరిన్ (ఆస్ట్రేలియా) ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)కు షాకిచ్చాడు. 5–7, 4–6, 0–2తో వెనుకబడిన దశలో థీమ్ రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 11వ సీడ్ బొర్నా కొరిచ్ (క్రొయేషియా) 6–4, 6–3, 6–4తో ఫుక్సోవిక్స్ (హంగేరి)పై, 12వ సీడ్ ఫాగ్‌నిని (ఇటలీ) 7–6 (7/3), 6–3, 7–6 (7/5)తో మేయర్ (అర్జెంటీనా)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment