Tennis history
-
జొకోవిచ్ ‘నంబర్‌వన్’ రికార్డు
దుబాయ్: టెన్నిస్ చరిత్రలో ఏ ప్లేయర్‌కూ సాధ్యంకాని ఘనతను సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. 1973 నుంచి టెన్నిస్‌లో కంప్యూటర్ ర్యాంకింగ్స్ మొదలయ్యాక అత్యధిక వారాలు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ 6,980 పాయింట్లతో తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. దాంతో ఈ సెర్బియా స్టార్ నంబర్‌వన్ ర్యాంక్ హోదాలో 378 వారాలు పూర్తి చేసుకోవడం ఖాయమైంది. ఇప్పటి వరకు ఈ రికార్డు జర్మనీ దిగ్గజం, మహిళా స్టార్ స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉంది. గ్రాఫ్ 377 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక వారాలు టాప్ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా 2021 మార్చిలోనే జొకోవిచ్ గుర్తింపు పొందాడు. స్విట్జర్లాండ్ మేటి రోజర్ ఫెడరర్ (310 వారాలు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు. తాజాగా అటు పురుషుల విభాగంలోగానీ, ఇటు మహిళల విభాగంలోగానీ అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా ఈ సెర్బియా యోధుడు చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ‘మీరందరి ప్రేమాభిమానం కారణంగా నా కెరీర్లో ఎన్నో కొత్త ఘనతలు సాధించాను. తాజాగా అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని దుబాయ్ ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన 35 ఏళ్ల జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ 2011 జూలై 4న 24 ఏళ్ల 43 రోజుల ప్రాయంలో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ అయ్యాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన 28 ప్లేయర్లలో ఒకడైన జొకోవిచ్ రికార్డుస్థాయిలో ఏడుసార్లు సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. అత్యధిక వారాలు అగ్రస్థానంలో నిలిచిన టాప్–5 ప్లేయర్లు 1. జొకోవిచ్: 378 వారాలు 2. స్టెఫీ గ్రాఫ్ : 377 వారాలు 3. మార్టినా నవ్రతిలోవా : 332 వారాలు 4. సెరెనా విలియమ్స్: 319 వారాలు 5. రోజర్ ఫెడరర్ : 310 వారాలు -
11 గంటల 5 నిమిషాలు...
వింబుల్డన్ టోర్నీలో ఇద్దరు అనామకుల మధ్య తొలిరౌండ్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణమే మ్యాచ్‌కు ముందు కూడా ఉంది. కోర్టు నంబర్–18లో మ్యాచ్ అంటే సాధారణ అభిమానులెవరూ పట్టించుకునే పరిస్థితే లేదు. కానీ హోరాహోరీగా సాగిన ఆ సమరం సాధారణ మ్యాచ్‌గా ముగియలేదు. గంటలను దాటి మూడు రోజుల పాటు సాగి కొత్త చరిత్రను సృష్టించింది. ఈ పోరులో ఫలితం వచ్చే సమయానికి కోర్టు చుట్టుపక్కల నిలబడటానికి కూడా చోటు లేనంతగా జనం దీని కోసం ఎగబడిన పరిస్థితి కనిపించింది. ఏకంగా 11 గంటల 5 నిమిషాల పాటు (22–24 జూన్ మధ్య) జరిగిన ఈ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలో సుదీర్ఘ మ్యాచ్‌గా నిలిచిపోగా... జాన్ ఇస్నర్ (అమెరికా), నికోలస్ మహుత్ (ఫ్రాన్స్) తమ అసాధారణ ఆటతో ఈ చరిత్రలో భాగమయ్యారు. జూన్ 22... అలా మొదలైంది... 2010 వింబుల్డన్ రెండో రోజు షెడ్యూల్ ప్రకారమే ఇస్నర్, మహుత్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఇస్నర్ 23వ సీడ్ కాగా, మహుత్ క్వాలిఫయర్. ఈ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వారు కూడా ఊహించి ఉండరు. ఇద్దరూ పట్టుదలగా పోరాడటంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగలేదు. నాలుగు సెట్లలో ఇద్దరు చెరో రెండు గెలుచుకొని సమఉజ్జీలుగా నిలిచారు. 2 గంటల 54 నిమిషాల పాటు ఆట సాగింది. అంటే అసాధారణమేమీ కాదు. అయితే వెలుతురులేమి కారణంగా ఆటను నిలిపివేశారు. (సాయంత్రం గం. 6.13 నుంచి రాత్రి గం. 9.07 వరకు); స్కోరు: 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3). జూన్ 23... ఘనతకు శ్రీకారం... మరో సెట్ మాత్రమే మిగిలింది. ముగియడానికి ఎంతో సేపు పట్టదని నిర్వాహకులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చివరి సెట్‌కు ఆట చేరుకున్న తర్వాత మొదలైంది అసలు సమరం. నువ్వా నేనా అంటూ ఇస్నర్, మహుత్ తలపడ్డారు. ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. టోర్నీ నిబంధనల ప్రకారం చివరి సెట్లో టైబ్రేక్ లేకపోవడం... తుది ఫలితం కోసం స్కోరులో కనీసం రెండు గేమ్‌ల అంతరం ఉండాల్సిందే కాబట్టి ఆట సాగుతూ పోయింది. ఒకసారి ఇస్నర్ పైచేయి సాధిస్తే వెంటనే మహుత్ తగిన రీతిలో జవాబిచ్చాడు. అలా ఏకంగా 7 గంటల 4 నిమిషాల పాటు భీకరంగా ఆడినా ఆట ముగియలేదు. సూర్యుడు మాత్రం తన వల్ల కాదంటూ తప్పుకోవడంతో మ్యాచ్ ఆగిపోయింది. (మధ్యాహ్నం గం. 2.05 నుంచి రాత్రి గం. 9.07 వరకు), స్కోరు: చివరి సెట్ టైబ్రేక్‌లో 59–59 జూన్ 24... ఘనమైన ముగింపు... రెండో రోజు ఆటలోనే సుదీర్ఘ మ్యాచ్‌గా పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. టెన్నిస్ అభిమానులంతా అన్నీ వదిలి ఈ మ్యాచ్ వేదిక వద్దకు అమితాసక్తితో వచ్చేశారు. మళ్లీ అదే తంతు... ఒక్కో పాయింట్ కోసం ఆగని పోరాటం. ఎంతవరకు వీరు ఆడగలరని అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. చివరకు 1 గంట 7 నిమిషాల తర్వాత తుది ఫలితం వచ్చింది. ఇస్నర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో మహుత్‌పై గెలిచాడు. విజయానందంతో ఇస్నర్ కుప్పకూలిపోగా, మహుత్లో కూడా చెప్పలేనంత నైరాశ్యం కనిపించింది. 2004 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫ్యాబ్రిస్ సాంతోరో, ఆర్నార్డ్ క్లెమెంట్ మధ్య 6 గంటల 33 నిమిషాలపాటు జరిగిన సుదీర్ఘ మ్యాచ్ రికార్డు దీంతో బద్దలైంది. నిజానికి చివరి సెట్ (8 గంటల 11 నిమిషాలు) ఒక్కటే ఈ రికార్డును పడగొట్టేసింది. ఇద్దరికీ హ్యాట్సాఫ్... మహామహుల ఫిట్‌నెస్‌కే పరీక్ష పెట్టే టెన్నిస్‌లో ఐదు సెట్ల పోరాటాలు ఎప్పుడూ కూడా అంత సులువు కాదు. అలాంటిది 665 నిమిషాల పాటు వీరు కోర్టులో శ్రమించారు. ప్రాణం పోతుందన్నట్లుగా ప్రతీ పాయింట్ కోసం పోరాడారు. ఆ పట్టుదల, నిబద్ధత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదో ఒక దశలో ఇక చాలు నా వల్ల కాదు అన్నట్లుగా చేతులెత్తేయలేదు. ఈ పాయింట్ పోతే పోనీ మ్యాచ్ ముగిసిపోతుంది కదా అనుకోలేదు. కోలుకునేందుకు, కండరాలు పట్టేయకుండా ఉండేందుకు ఐస్బాత్లు, మసాజ్లతోపాటు రికవరీ షేక్‌లు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత తాము సాధించిన ఘనతలు చూసుకునేసరికి వారిద్దరూ ఒకటైపోయారు. ఒక్క మ్యాచ్ కోసం ఏకంగా 11 గంటల 5 నిమిషాలు ఆడిన ఇస్నర్ పూర్తిగా అలసిపోవడంతో ఈ టోర్నీ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. రెండో రౌండ్లో ఇస్నర్ 0–6, 3–6, 2–6తో థీమో బాకెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. కొన్ని విశేషాలు... సుదీర్ఘ మ్యాచ్... సుదీర్ఘ సెట్... ఒక సెట్లో అత్యధిక గేమ్‌లు (138), ఒక మ్యాచ్‌లో అత్యధిక గేమ్‌లు (183), ఒక మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు (216; ఇస్నర్ 113+మహుత్ 103), ఒక మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు (980)...ఇలా ఎన్నో ఘనతలు ఈ మ్యాచ్ ఖాతాలో చేరాయి. ఇతరత్రా చూస్తే పలు అవార్డులు ఈ మ్యాచ్‌కు దక్కగా... తర్వాతి రోజుల్లో పుస్తకాలు, వీడియో ఆల్బమ్‌లు, డాక్యుమెంటరీలు పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌పై రూపొందించారు. చివరగా... లాక్డౌన్ నేపథ్యంలో ఇటీవలే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఈ మొత్తం 11 గంటల 5 నిమిషాల మ్యాచ్‌ను విరామం లేకుండా యూట్యూబ్‌లో పెడితే పెద్ద సంఖ్యలో జనం చూశారు. లైవ్ టెన్నిస్ లేని ఈ సమయంలో మీరు ఎన్ని గంటలు ఈ చరిత్రాత్మక మ్యాచ్‌ను చూడగలరో ప్రయత్నించండి. -
అది గ్రేట్ కాదు.. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ గ్రేట్ రికార్డు..!
టెన్నిస్‌లో ఎవరైనా ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తేనే కల సాకారమైందంటారు. మరి ఒక్కడే 20 గెలిస్తే జీవితమే సాఫల్యమైందనాలేమో! ఎందుకంటే 200 గ్రాండ్‌స్లామ్‌లు జరిగిన టెన్నిస్ చరిత్రలో ఒక్కడే పది శాతం ట్రోఫీలు ఎగరేసుకుపోతే అది గ్రేట్ కాదు... ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ గ్రేట్ రికార్డు అవుతుంది. మెల్బోర్న్లో స్విట్జర్లాండ్ సూపర్‌స్టార్ రోజర్ ఫెడరర్ అదే చేశాడు. బరిలో మేటి... పోటీలో ఘనాపాఠి. పోరాడితే ఎవ్వరికీ మింగుడు పడని ప్రత్యర్థి. నిలిస్తే గెలుస్తాడు. గెలిస్తే చరిత్ర సృష్టిస్తాడు. ఔను... ఈ చరిత్ర పుటలకెక్కుతుంది. కాబట్టి మిన్నకుండిపోయింది... లేదంటే ఆ చరిత్రకే కళ్లుంటే మురిపెంగా ఈ విశ్వవిజేతను తన్మయత్వంతో చూసేది. మెల్బోర్న్: చూస్తుంటే... గ్రాండ్‌స్లామ్ చరిత్రలో రోజర్ ఫెడరర్ తరతరాలకు చెరగని రికార్డును లిఖిస్తాడేమో! ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకున్న ఈ డిఫెండింగ్ చాంపియన్ 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో టెన్నిస్ లోకాన్నే మురిపించాడు. వయసు మూడు పదులు దాటినా తనలో వాడి తగ్గలేదని తాజా విజయంతో మళ్లీ నిరూపించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విట్జర్లాండ్ లెజెండ్ ఫెడరర్ 6–2, 6–7 (5/7), 6–3, 3–6, 6–1తో ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై చెమటోడ్చి నెగ్గాడు. 36 ఏళ్ల రోజర్ తన కెరీర్లో 20వ టైటిల్ కోసం 3 గంటల 3 నిమిషాలు పోరాడాడు. పోరు ముగియగానే అదుపులేని ఆనందాన్ని, భావోద్వేగాన్ని దాచుకోలేకపోయిన ఫెడరర్ బిగ్గరగా ఏడ్చేశాడు. తనకు జేజేలు పలుకుతున్న స్టేడియంలోని ప్రేక్షకులకు ఆనంద బాష్పాలతో మాట కలిపాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 40 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 63 లక్షలు)... రన్నరప్ మారిన్ సిలిచ్‌కు 20 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 200వ గ్రాండ్‌స్లామ్... 30వ ఫైనల్... టెన్నిస్ చరిత్రలో ఇది 200వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఇందులో 30వ ఫైనల్ ఆడిన ఫెడరర్ 20వ టైటిల్ గెలవడం నిజంగా అద్భుతమే కదా! ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతనికిది ఆరో టైటిల్... దీంతో ఇది వరకే ఈ ఘనత సాధించిన జొకోవిచ్ (సెర్బియా), అలనాటి ఆసీస్ దిగ్గజం రాయ్ ఎమర్సన్‌ల సరసన నిలిచాడు. అలుపెరగని ఈ పోరాట యోధుడు ఫైనల్ పోరును దూకుడుగానే ఆరంభించాడు. తొలి సెట్‌ను తనదైన శైలిలో గెలుచుకున్న ఫెడరర్‌కు రెండో సెట్లో క్రొయేషియన్ ప్రత్యర్థి నుంచి అనూహ్య పోటీ ఎదురైంది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ సెట్ చివరకు టైబ్రేక్‌కు దారి తీసింది. అక్కడా అదే తీరు కొనసాగడంతో స్టేడియంలోని ప్రేక్షకులు ఒళ్లంతా కళ్లు చేసుకున్నారు. చివరకు సెట్ కోల్పోయిన ఫెడరర్ మూడో సెట్లో పుంజుకొని ఆడాడు. పోటీ లేకుండానే 6–3తో ఈ సెట్‌ను ముగించాడు. నాలుగో సెట్ ఓడటంతో నిర్ణాయక ఐదో సెట్లో ఫెడరర్ తన అనుభవాన్నంతా రంగరించి తేలిగ్గా ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఆరోసారి ఆస్ట్రేలియన్ ట్రోఫీని ముద్దాడాడు. ఫైనల్లో ప్రత్యర్థి సిలిచ్ సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసిన ఫెడరర్ 24 ఏస్‌లు సంధించాడు. సిలిచ్ 16 ఏస్‌లు సంధించాడు. ఎండవేడిమి... ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు పెరగడంతో టెన్నిస్ కోర్టు పైకప్పును మూసి ఆడించారు. మీకు తెలుసా... 332-52 గ్రాండ్‌స్లామ్ కెరీర్లో ఫెడరర్ జయాపజయాల రికార్డు ఇది. మెల్‌బోర్న్‌లోనూ అతనికి ఘనమైన రికార్డే (94–13) ఉంది. 10% చరిత్రలో పది శాతం గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు రోజర్ ఇంట్లోనే ఉన్నాయి. 91 సిలిచ్‌పై ఫెడరర్ పైచేయి ఇది. పదిసార్లు ముఖాముఖిగా తలపడితే ఒక్కసారి మాత్రమే (2014, యూఎస్ ఓపెన్ సెమీస్) ఓడాడు రోజర్. ఇవీ ఫెడరర్ ‘గ్రాండ్’ టైటిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ (6): 2004, 2006, 2007, 2010, 2017, 2018 ఫ్రెంచ్ ఓపెన్ (1): 2009 వింబుల్డన్ (8): 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017 యూఎస్ ఓపెన్ (5): 2004, 2005, 2006, 2007, 2008 94: ఫెడరర్ కెరీర్లో గెలిచిన టైటిల్స్. అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఇవాన్ లెండిల్ సరసన ఫెడరర్ చేరాడు. 109 టైటిల్స్‌తో జిమ్మీ కానర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. 3: ఓపెన్ శకంలో (1968 తర్వాత) 30 ఏళ్లు దాటిన తర్వాత నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన మూడో ప్లేయర్ ఫెడరర్. గతంలో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా), కెన్ రోజ్‌వెల్ (అమెరికా) మాత్రమే ఇలాంటి ఘనత సాధించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నాను. గతేడాది నాకు గొప్పగా గడిచింది. అది ఇచ్చిన ఉత్సాహమే ఈ టైటిల్ కూడా. ఎక్కడలేని ఆనందాన్ని, అనుభూతినిచ్చింది. ఈ ఫైనల్ నాకు 2006 తుది పోరును గుర్తుకు తెచ్చింది. బగ్ధాటిస్తో జరిగిన ఆ పోరును, విజయాన్ని మర్చిపోలేను. ఈ ఫైనల్లోనూ అదే విధంగా పోరాడాను. అనుకున్నది సాధించాను. ఫైనల్‌దాకా అద్భుతంగా సాగింది. నా టీమ్ (సహాయక సిబ్బంది)కు కృతజ్ఞతలు. నేను గెలిచేందుకు వాళ్లు కష్టపడ్డారు. –ఫెడరర్ -
పాపం బర్తోలీ
సిన్సినాటి: టెన్నిస్ చరిత్రలో వింబుల్డన్ టైటిల్‌కున్న ప్రతిష్ట అంతా ఇంతా కాదు. జీవితంలో ఒక్కసారైనా ఆ టోర్నీని సాధించాలని ఆటగాళ్లు కలలు కంటారు. ఫ్రాన్స్‌కు చెందిన టెన్నిస్ స్టార్ మరియన్ బర్తోలి కూడా దీనికి అతీతురాలేం కాదు. కేవలం కలల దగ్గరే ఆగిపోకుండా ఈ ఏడాది జరిగిన వింబుల్డన్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బర్తోలీ ఏకంగా టైటిల్ నెగ్గింది. ఇంకేముంది కెరీర్ తారాజువ్వలాగా దూసుకెళుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో 28 ఏళ్ల బర్తోలి ఆటకు గుడ్‌బై చెప్పింది. వింబుల్డన్ గెలిచిన కేవలం ఆరు వారాల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులతో పాటు క్రీడాలోకం కూడా షాక్‌కు గురైంది. ప్రపంచ ఏడో ర్యాంకర్ బర్తోలి సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ రెండో రౌండ్లో సిమోన హెలెప్ చేతిలో 6-3, 4-6, 1-6 తేడాతో ఓడింది. దీంతో టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఈనిర్ణయానికి నిరంతరం వేధిస్తున్న గాయాలే కారణమని తెలిపింది. మరో రెండు వారాల్లో తను యూఎస్ ఓపెన్ ఆడాల్సి ఉంది. ‘రిటైర్ కావడానికి ఇదే సరైన సమయం. చాలాకాలంగా టెన్నిస్ ఆడుతున్నాను. గ్రాండ్‌స్లామ్ గెలవాలనే కల వింబుల్డన్ ద్వారా తీరింది. నా కెరీర్లో అత్యంత గొప్ప విజయం అది. ఈ ఏడాది ఆరంభం నుంచి గాయాలు వేధిస్తున్నాయి. నా శరీరంలో మిగిలి ఉన్న శక్తినంతా ధారపోశాను. వింబుల్డన్ ఎప్పటికీ నాతోనే ఉండిపోతుంది. ఇక నేను పోటీపడలేను’ అని బర్తోలీ వెల్లడించింది. 2000లో ప్రొఫెషనల్‌గా మారిన బర్తోలీ కెరీర్లో ఏడు డబ్ల్యూటీఏ టైటిళ్లను సాధించింది.