సిన్సినాటి: టెన్నిస్ చరిత్రలో వింబుల్డన్ టైటిల్‌కున్న ప్రతిష్ట అంతా ఇంతా కాదు. జీవితంలో ఒక్కసారైనా ఆ టోర్నీని సాధించాలని ఆటగాళ్లు కలలు కంటారు. ఫ్రాన్స్‌కు చెందిన టెన్నిస్ స్టార్ మరియన్ బర్తోలి కూడా దీనికి అతీతురాలేం కాదు. కేవలం కలల దగ్గరే ఆగిపోకుండా ఈ ఏడాది జరిగిన వింబుల్డన్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బర్తోలీ ఏకంగా టైటిల్ నెగ్గింది.
ఇంకేముంది కెరీర్ తారాజువ్వలాగా దూసుకెళుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో 28 ఏళ్ల బర్తోలి ఆటకు గుడ్‌బై చెప్పింది. వింబుల్డన్ గెలిచిన కేవలం ఆరు వారాల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులతో పాటు క్రీడాలోకం కూడా షాక్‌కు గురైంది. ప్రపంచ ఏడో ర్యాంకర్ బర్తోలి సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ రెండో రౌండ్‌లో సిమోన హెలెప్ చేతిలో 6-3, 4-6, 1-6 తేడాతో ఓడింది. దీంతో టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
ఈనిర్ణయానికి నిరంతరం వేధిస్తున్న గాయాలే కారణమని తెలిపింది. మరో రెండు వారాల్లో తను యూఎస్ ఓపెన్ ఆడాల్సి ఉంది. ‘రిటైర్ కావడానికి ఇదే సరైన సమయం. చాలాకాలంగా టెన్నిస్ ఆడుతున్నాను. గ్రాండ్‌స్లామ్ గెలవాలనే కల వింబుల్డన్ ద్వారా తీరింది. నా కెరీర్‌లో అత్యంత గొప్ప విజయం అది. ఈ ఏడాది ఆరంభం నుంచి గాయాలు వేధిస్తున్నాయి. నా శరీరంలో మిగిలి ఉన్న శక్తినంతా ధారపోశాను. వింబుల్డన్ ఎప్పటికీ నాతోనే ఉండిపోతుంది. ఇక నేను పోటీపడలేను’ అని బర్తోలీ వెల్లడించింది. 2000లో ప్రొఫెషనల్‌గా మారిన బర్తోలీ కెరీర్‌లో ఏడు డబ్ల్యూటీఏ టైటిళ్లను సాధించింది.
పాపం బర్తోలీ
Published Fri, Aug 16 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement