వింబుల్డన్ టోర్నీలో ఇద్దరు అనామకుల మధ్య తొలిరౌండ్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణమే మ్యాచ్‌కు ముందు కూడా ఉంది. కోర్టు నంబర్–18లో మ్యాచ్ అంటే సాధారణ అభిమానులెవరూ పట్టించుకునే పరిస్థితే లేదు. కానీ హోరాహోరీగా సాగిన ఆ సమరం సాధారణ మ్యాచ్‌గా ముగియలేదు. గంటలను దాటి మూడు రోజుల పాటు సాగి కొత్త చరిత్రను సృష్టించింది. ఈ పోరులో ఫలితం వచ్చే సమయానికి కోర్టు చుట్టుపక్కల నిలబడటానికి కూడా చోటు లేనంతగా జనం దీని కోసం ఎగబడిన పరిస్థితి కనిపించింది. ఏకంగా 11 గంటల 5 నిమిషాల పాటు (22–24 జూన్ మధ్య) జరిగిన ఈ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలో సుదీర్ఘ మ్యాచ్‌గా నిలిచిపోగా... జాన్ ఇస్నర్ (అమెరికా), నికోలస్ మహుత్ (ఫ్రాన్స్) తమ అసాధారణ ఆటతో ఈ చరిత్రలో భాగమయ్యారు.
జూన్ 22... అలా మొదలైంది...
2010 వింబుల్డన్ రెండో రోజు షెడ్యూల్ ప్రకారమే ఇస్నర్, మహుత్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఇస్నర్ 23వ సీడ్ కాగా, మహుత్ క్వాలిఫయర్. ఈ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వారు కూడా ఊహించి ఉండరు. ఇద్దరూ పట్టుదలగా పోరాడటంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగలేదు. నాలుగు సెట్‌లలో ఇద్దరు చెరో రెండు గెలుచుకొని సమఉజ్జీలుగా నిలిచారు. 2 గంటల 54 నిమిషాల పాటు ఆట సాగింది. అంటే అసాధారణమేమీ కాదు. అయితే వెలుతురులేమి కారణంగా ఆటను నిలిపివేశారు. (సాయంత్రం గం. 6.13 నుంచి రాత్రి గం. 9.07 వరకు); స్కోరు: 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3).
జూన్ 23... ఘనతకు శ్రీకారం...
మరో సెట్ మాత్రమే మిగిలింది. ముగియడానికి ఎంతో సేపు పట్టదని నిర్వాహకులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చివరి సెట్‌కు ఆట చేరుకున్న తర్వాత మొదలైంది అసలు సమరం. నువ్వా నేనా అంటూ ఇస్నర్, మహుత్ తలపడ్డారు. ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. టోర్నీ నిబంధనల ప్రకారం చివరి సెట్‌లో టైబ్రేక్ లేకపోవడం... తుది ఫలితం కోసం స్కోరులో కనీసం రెండు గేమ్‌ల అంతరం ఉండాల్సిందే కాబట్టి ఆట సాగుతూ పోయింది. ఒకసారి ఇస్నర్ పైచేయి సాధిస్తే వెంటనే మహుత్ తగిన రీతిలో జవాబిచ్చాడు. అలా ఏకంగా 7 గంటల 4 నిమిషాల పాటు భీకరంగా ఆడినా ఆట ముగియలేదు. సూర్యుడు మాత్రం తన వల్ల కాదంటూ తప్పుకోవడంతో మ్యాచ్ ఆగిపోయింది. (మధ్యాహ్నం గం. 2.05 నుంచి రాత్రి గం. 9.07 వరకు), స్కోరు: చివరి సెట్ టైబ్రేక్‌లో 59–59
జూన్ 24... ఘనమైన ముగింపు...
రెండో రోజు ఆటలోనే సుదీర్ఘ మ్యాచ్‌గా పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. టెన్నిస్ అభిమానులంతా అన్నీ వదిలి ఈ మ్యాచ్ వేదిక వద్దకు అమితాసక్తితో వచ్చేశారు. మళ్లీ అదే తంతు... ఒక్కో పాయింట్ కోసం ఆగని పోరాటం. ఎంతవరకు వీరు ఆడగలరని అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. చివరకు 1 గంట 7 నిమిషాల తర్వాత తుది ఫలితం వచ్చింది. ఇస్నర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో మహుత్‌పై గెలిచాడు. విజయానందంతో ఇస్నర్ కుప్పకూలిపోగా, మహుత్‌లో కూడా చెప్పలేనంత నైరాశ్యం కనిపించింది. 2004 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫ్యాబ్రిస్ సాంతోరో, ఆర్నార్డ్ క్లెమెంట్ మధ్య 6 గంటల 33 నిమిషాలపాటు జరిగిన సుదీర్ఘ మ్యాచ్ రికార్డు దీంతో బద్దలైంది. నిజానికి చివరి సెట్ (8 గంటల 11 నిమిషాలు) ఒక్కటే ఈ రికార్డును పడగొట్టేసింది.
ఇద్దరికీ హ్యాట్సాఫ్...
మహామహుల ఫిట్‌నెస్‌కే పరీక్ష పెట్టే టెన్నిస్‌లో ఐదు సెట్ల పోరాటాలు ఎప్పుడూ కూడా అంత సులువు కాదు. అలాంటిది 665 నిమిషాల పాటు వీరు కోర్టులో శ్రమించారు. ప్రాణం పోతుందన్నట్లుగా ప్రతీ పాయింట్ కోసం పోరాడారు. ఆ పట్టుదల, నిబద్ధత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదో ఒక దశలో ఇక చాలు నా వల్ల కాదు అన్నట్లుగా చేతులెత్తేయలేదు. ఈ పాయింట్ పోతే పోనీ మ్యాచ్ ముగిసిపోతుంది కదా అనుకోలేదు. కోలుకునేందుకు, కండరాలు పట్టేయకుండా ఉండేందుకు ఐస్‌బాత్‌లు, మసాజ్‌లతోపాటు రికవరీ షేక్‌లు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత తాము సాధించిన ఘనతలు చూసుకునేసరికి వారిద్దరూ ఒకటైపోయారు. ఒక్క మ్యాచ్ కోసం ఏకంగా 11 గంటల 5 నిమిషాలు ఆడిన ఇస్నర్ పూర్తిగా అలసిపోవడంతో ఈ టోర్నీ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. రెండో రౌండ్‌లో ఇస్నర్ 0–6, 3–6, 2–6తో థీమో బాకెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు.
కొన్ని విశేషాలు...
సుదీర్ఘ మ్యాచ్... సుదీర్ఘ సెట్... ఒక సెట్‌లో అత్యధిక గేమ్‌లు (138), ఒక మ్యాచ్‌లో అత్యధిక గేమ్‌లు (183), ఒక మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు (216; ఇస్నర్ 113+మహుత్ 103), ఒక మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు (980)...ఇలా ఎన్నో ఘనతలు ఈ మ్యాచ్ ఖాతాలో చేరాయి. ఇతరత్రా చూస్తే పలు అవార్డులు ఈ మ్యాచ్‌కు దక్కగా... తర్వాతి రోజుల్లో పుస్తకాలు, వీడియో ఆల్బమ్‌లు, డాక్యుమెంటరీలు పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌పై రూపొందించారు.
చివరగా...
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇటీవలే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఈ మొత్తం 11 గంటల 5 నిమిషాల మ్యాచ్‌ను విరామం లేకుండా యూట్యూబ్‌లో పెడితే పెద్ద సంఖ్యలో జనం చూశారు. లైవ్ టెన్నిస్ లేని ఈ సమయంలో మీరు ఎన్ని గంటలు ఈ చరిత్రాత్మక మ్యాచ్‌ను చూడగలరో ప్రయత్నించండి.
Comments
Please login to add a commentAdd a comment