recognized
-
Viral Video: ఫ్యాన్స్ గుర్తుపట్టడంతో భయపడి పరిగెత్తిన స్టార్ హీరో..
తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఫ్యాన్స్ ఎలా ప్రవర్తిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెల్ఫీలు అంటూ మీద పడతారు. ఇబ్బందులకు గురిచేస్తారు. ఒక్కొక్కసారి వారి అభిమానం చూసి భయపడిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇలా తాజాగా తన ఫ్యాన్స్‌ను చూసిన బాలీవుడ్ బాద్షా భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చున్నాడు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా వచ్చి చాలాకాలమే అయింది. ఈ క్రమంలో లాంగ్ గ్యాప్ తీసుకున్న షారుక్ ఖాన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే 'పఠాన్' మూవీ కంప్లీట్ చేసిన బాద్షా 'డుంకీ' చిత్రీకరణలో పాల్గొన్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ స్పాట్లో ఆయన్ను గుర్తుపట్టిన ఫ్యాన్స్ సెల్ఫీల కోసం షారుక్ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అది గమనించిన షారుక్ ఖాన్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చున్నాడు. చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు View this post on Instagram A post shared by Javed_srkian (@bigfansrk_) ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఉంది షారుక్ ఖాన్ పొట్టిగా కనపించడంతో అతను కాదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో షారుక్‌కు సరసన తాప్సీ నటిస్తోంది. అలాగే షారుక్ 'పఠాన్' సినిమా 2023 జనవరిలో విడుదల కానుంది. చదవండి: కేటీఆర్ గారూ.. త్వరగా కోలుకోవాలంటే ఈ చిత్రం చూడండి.. శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ -
లేపాక్షి ఆలయానికి కేంద్ర గుర్తింపు
-
శభాష్ ఏపీ.. ప్రతికూలతలోనూ ‘సుస్థిర’పరుగు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ఆర్థిక, సామాజిక రంగాలపై తీవ్ర ప్రతికూలత చూపిన కరోనాకు ఎదురొడ్డి ఆంధ్రప్రదేశ్ సుస్థిర అభివృద్ధిని సాధించిందని ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ – 2021’వెల్లడించింది. ఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’విడుదల చేసిన ఆ నివేదిక కరోనాను ఎదుర్కోవడంలో పలు రాష్ట్రాల పనితీరును విశ్లేషించింది. దేశవ్యాప్తంగా అభివృద్ధి గమనం మందగించినా ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఐదు రాష్ట్రాలు ఉత్తమ పనితీరు కనబరిచాయని, 2020లో సుస్థిర అభివృద్ధి సాధించిన రాష్ట్రాల్లో ఏపీ మూడో ర్యాంకు సాధించిందని నివేదిక వెల్లడించింది. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై సామాజిక స్థితిగతులు, పిల్లల ఆరోగ్యం, పర్యావరణ కాలుష్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపించిందని పేర్కొంది. భారత్ ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉందని పేర్కొనడం గమనార్హం. సుస్థిర అభివృద్ధి రేటులో ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో భారత్‌కు 117 ర్యాంకు ఇవ్వడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. అయినప్పటికీ దేశంలో రాష్ట్రాలవారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌తోసహా ఐదు రాష్ట్రాలు ఉత్తమ పనితీరు కనబరిచాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. నివేదికలో ప్రధాన అంశాలు ఇవీ... ప్రతికూలతలోనూ ఉత్తమ పనితీరు.. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఆరి్థక, సామాజిక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. అభివృద్ధి మందగించింది. అయినప్పటికీ దేశంలో ఐదు రాష్ట్రాలు ఉత్తమ పనితీరు కనబరిచాయి. కరోనా ప్రభావాన్ని ఎదుర్కొని మరీ సుస్థిర అభివృద్ధిని సాధించాయి. వాటిలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. కేరళ మొదటిస్థానం సాధించగా హిమాచల్‌ప్రదేశ్ రెండో స్థానం, నాలుగో స్థానంలో తమిళనాడు, ఐదో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. కరోనా వేళ సుస్థిర అభివృద్ధి సాధనలో బిహార్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, యూపీ చివరి స్థానాల్లో ఉన్నాయి. నిర్మాణాత్మక చర్యలు చేపట్టిన ఏపీ కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టిందని ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎని్వరాన్మెంటల్ రిపోర్ట్–2021’ప్రశంసించింది. వైద్య, ఆరోగ్య రంగాల సేవలను విస్తృతం, బలోపేతం చేయడంతోపాటు పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని పేర్కొంది. ►రాష్ట్రంలో 1.47 కోట్లమంది పేదలకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. ►2020 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు నెలకు రెండుసార్లు చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేపట్టారు. కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున నెలకు రెండుసార్లు అంటే నెలకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. ఇలా మొత్తం మీద 35.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసి పేదలను ఆదుకుంది. ►వైద్య, ఆరోగ్య సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృతం చేసింది. వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి దాదాపు రూ.1,400 కోట్లు వెచ్చించింది. అందులో ల్యాబొరేటరీల ఏర్పాటుకే రూ.40 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ►దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కోవిడ్‌ను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చింది. ►2020 మార్చి నాటికి రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబరేటరీ కూడా లేకున్నా యుద్ధ ప్రాతిపదికన ఏకంగా 14 వైరాలజీ ల్యా»ొరేటరీలను ఏర్పాటు చేసింది. ►రాష్ట్రంలో కొత్తగా దాదాపు 10 వేలమంది వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బందిని నియమించింది. ►కొత్తగా 300 108 అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 108 అంబులెన్స్‌లు 730కి చేరుకున్నాయి. ►రాష్ట్రంలో 104 వైద్య సేవల కోసం కొత్తగా 675 వాహనాలను ప్రవేశపెట్టింది. ►రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక చర్యలు సత్ఫలితాలను అందించాయి. 2020 అక్టోబరు ప్రారంభం నాటికి కరోనా ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతోపాటు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడి ఉపాధి అవకాశాలు పెరిగాయి. చదవండి: కనిపించని తమ్ముళ్లు.. టీడీపీ డీలా! బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! -
11 గంటల 5 నిమిషాలు...
వింబుల్డన్ టోర్నీలో ఇద్దరు అనామకుల మధ్య తొలిరౌండ్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణమే మ్యాచ్‌కు ముందు కూడా ఉంది. కోర్టు నంబర్–18లో మ్యాచ్ అంటే సాధారణ అభిమానులెవరూ పట్టించుకునే పరిస్థితే లేదు. కానీ హోరాహోరీగా సాగిన ఆ సమరం సాధారణ మ్యాచ్‌గా ముగియలేదు. గంటలను దాటి మూడు రోజుల పాటు సాగి కొత్త చరిత్రను సృష్టించింది. ఈ పోరులో ఫలితం వచ్చే సమయానికి కోర్టు చుట్టుపక్కల నిలబడటానికి కూడా చోటు లేనంతగా జనం దీని కోసం ఎగబడిన పరిస్థితి కనిపించింది. ఏకంగా 11 గంటల 5 నిమిషాల పాటు (22–24 జూన్ మధ్య) జరిగిన ఈ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలో సుదీర్ఘ మ్యాచ్‌గా నిలిచిపోగా... జాన్ ఇస్నర్ (అమెరికా), నికోలస్ మహుత్ (ఫ్రాన్స్) తమ అసాధారణ ఆటతో ఈ చరిత్రలో భాగమయ్యారు. జూన్ 22... అలా మొదలైంది... 2010 వింబుల్డన్ రెండో రోజు షెడ్యూల్ ప్రకారమే ఇస్నర్, మహుత్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఇస్నర్ 23వ సీడ్ కాగా, మహుత్ క్వాలిఫయర్. ఈ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వారు కూడా ఊహించి ఉండరు. ఇద్దరూ పట్టుదలగా పోరాడటంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగలేదు. నాలుగు సెట్లలో ఇద్దరు చెరో రెండు గెలుచుకొని సమఉజ్జీలుగా నిలిచారు. 2 గంటల 54 నిమిషాల పాటు ఆట సాగింది. అంటే అసాధారణమేమీ కాదు. అయితే వెలుతురులేమి కారణంగా ఆటను నిలిపివేశారు. (సాయంత్రం గం. 6.13 నుంచి రాత్రి గం. 9.07 వరకు); స్కోరు: 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3). జూన్ 23... ఘనతకు శ్రీకారం... మరో సెట్ మాత్రమే మిగిలింది. ముగియడానికి ఎంతో సేపు పట్టదని నిర్వాహకులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చివరి సెట్‌కు ఆట చేరుకున్న తర్వాత మొదలైంది అసలు సమరం. నువ్వా నేనా అంటూ ఇస్నర్, మహుత్ తలపడ్డారు. ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. టోర్నీ నిబంధనల ప్రకారం చివరి సెట్లో టైబ్రేక్ లేకపోవడం... తుది ఫలితం కోసం స్కోరులో కనీసం రెండు గేమ్‌ల అంతరం ఉండాల్సిందే కాబట్టి ఆట సాగుతూ పోయింది. ఒకసారి ఇస్నర్ పైచేయి సాధిస్తే వెంటనే మహుత్ తగిన రీతిలో జవాబిచ్చాడు. అలా ఏకంగా 7 గంటల 4 నిమిషాల పాటు భీకరంగా ఆడినా ఆట ముగియలేదు. సూర్యుడు మాత్రం తన వల్ల కాదంటూ తప్పుకోవడంతో మ్యాచ్ ఆగిపోయింది. (మధ్యాహ్నం గం. 2.05 నుంచి రాత్రి గం. 9.07 వరకు), స్కోరు: చివరి సెట్ టైబ్రేక్‌లో 59–59 జూన్ 24... ఘనమైన ముగింపు... రెండో రోజు ఆటలోనే సుదీర్ఘ మ్యాచ్‌గా పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. టెన్నిస్ అభిమానులంతా అన్నీ వదిలి ఈ మ్యాచ్ వేదిక వద్దకు అమితాసక్తితో వచ్చేశారు. మళ్లీ అదే తంతు... ఒక్కో పాయింట్ కోసం ఆగని పోరాటం. ఎంతవరకు వీరు ఆడగలరని అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. చివరకు 1 గంట 7 నిమిషాల తర్వాత తుది ఫలితం వచ్చింది. ఇస్నర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో మహుత్‌పై గెలిచాడు. విజయానందంతో ఇస్నర్ కుప్పకూలిపోగా, మహుత్లో కూడా చెప్పలేనంత నైరాశ్యం కనిపించింది. 2004 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫ్యాబ్రిస్ సాంతోరో, ఆర్నార్డ్ క్లెమెంట్ మధ్య 6 గంటల 33 నిమిషాలపాటు జరిగిన సుదీర్ఘ మ్యాచ్ రికార్డు దీంతో బద్దలైంది. నిజానికి చివరి సెట్ (8 గంటల 11 నిమిషాలు) ఒక్కటే ఈ రికార్డును పడగొట్టేసింది. ఇద్దరికీ హ్యాట్సాఫ్... మహామహుల ఫిట్‌నెస్‌కే పరీక్ష పెట్టే టెన్నిస్‌లో ఐదు సెట్ల పోరాటాలు ఎప్పుడూ కూడా అంత సులువు కాదు. అలాంటిది 665 నిమిషాల పాటు వీరు కోర్టులో శ్రమించారు. ప్రాణం పోతుందన్నట్లుగా ప్రతీ పాయింట్ కోసం పోరాడారు. ఆ పట్టుదల, నిబద్ధత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదో ఒక దశలో ఇక చాలు నా వల్ల కాదు అన్నట్లుగా చేతులెత్తేయలేదు. ఈ పాయింట్ పోతే పోనీ మ్యాచ్ ముగిసిపోతుంది కదా అనుకోలేదు. కోలుకునేందుకు, కండరాలు పట్టేయకుండా ఉండేందుకు ఐస్బాత్లు, మసాజ్లతోపాటు రికవరీ షేక్‌లు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత తాము సాధించిన ఘనతలు చూసుకునేసరికి వారిద్దరూ ఒకటైపోయారు. ఒక్క మ్యాచ్ కోసం ఏకంగా 11 గంటల 5 నిమిషాలు ఆడిన ఇస్నర్ పూర్తిగా అలసిపోవడంతో ఈ టోర్నీ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. రెండో రౌండ్లో ఇస్నర్ 0–6, 3–6, 2–6తో థీమో బాకెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. కొన్ని విశేషాలు... సుదీర్ఘ మ్యాచ్... సుదీర్ఘ సెట్... ఒక సెట్లో అత్యధిక గేమ్‌లు (138), ఒక మ్యాచ్‌లో అత్యధిక గేమ్‌లు (183), ఒక మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు (216; ఇస్నర్ 113+మహుత్ 103), ఒక మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు (980)...ఇలా ఎన్నో ఘనతలు ఈ మ్యాచ్ ఖాతాలో చేరాయి. ఇతరత్రా చూస్తే పలు అవార్డులు ఈ మ్యాచ్‌కు దక్కగా... తర్వాతి రోజుల్లో పుస్తకాలు, వీడియో ఆల్బమ్‌లు, డాక్యుమెంటరీలు పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌పై రూపొందించారు. చివరగా... లాక్డౌన్ నేపథ్యంలో ఇటీవలే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఈ మొత్తం 11 గంటల 5 నిమిషాల మ్యాచ్‌ను విరామం లేకుండా యూట్యూబ్‌లో పెడితే పెద్ద సంఖ్యలో జనం చూశారు. లైవ్ టెన్నిస్ లేని ఈ సమయంలో మీరు ఎన్ని గంటలు ఈ చరిత్రాత్మక మ్యాచ్‌ను చూడగలరో ప్రయత్నించండి. -
ఆదోని మార్కెట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
సాక్షి, కర్నూలు: జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(ఈ–నామ్) అమలులో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి అవార్డు లభించే అవకాశం కూడా ఉంది. దేశంలోని 585 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలు చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ తత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు లావాదేవీలను వంద శాతం పారదర్శకంగా నిర్వహించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ఈ విధానం ముఖ్యోద్దేశం. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న మార్కెట్ కమిటీలకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఒకటి కేంద్ర పాలిత ప్రాంతాలకు, మరొకటి ఈశాన్య రాష్ట్రాలకు, మిగిలినది ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల కేటగిరీలో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పోటీ పడుతోంది. ఇప్పటి వరకు నాలుగు దశల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పైచేయి సాధించింది. ఆదోనితో పాటు మరో నాలుగైదు మార్కెట్లు మాత్రమే ఫైనల్ రేసులో నిలిచాయి. వీటి జాబితాను కేంద్ర వ్యవసాయ, రైతుల సహకార మంత్రిత్వ శాఖ ప్రధాని ముందు ఉంచింది. ఆయన నిర్ణయం రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. అన్నీ ఈ–నామ్ ద్వారానే.. ఆదోని మార్కెట్‌యార్డులో ప్రస్తుతం లావాదేవీలన్నీ ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి జాతీయ స్థాయి వ్యాపారులు పోటీలోకి రాకపోయినా.. ఉన్న వ్యాపారుల్లోనే పోటీ ఏర్పడుతుండటం వల్ల అన్ని రకాల ఉత్పత్తులకు మంచి ధరలే లభిస్తున్నాయి. కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్లతో పాటు వివిధ జిల్లాల్లోని మార్కెట్లతో పోల్చితే ఆదోనిలో రైతులకు ఎక్కువ ధరలే లభిస్తుండటం గమనార్హం. పైగా మార్కెట్‌యార్డు మొత్తానికి మార్కెటింగ్ శాఖ ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. వ్యాపారులు తమ స్మార్ట్ ఫోన్లో ఈ–నామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఎవరికి వారు లాట్ ఐటీ స్లిప్‌లను బట్టి ధరను కోట్ చేయవచ్చు. ఎవరు ఏ ధర కోట్ చేశారో మిగతా వారికి తెలిసే అవకాశం ఉండదు. అంతేకాకుండా మార్కెట్‌యార్డులో 32 కంప్యూటర్లతో ఈ–బిడ్డింగ్ హాలు ఏర్పాటు చేశారు. ఈ–నామ్ వల్ల వ్యాపారుల మధ్య పోటీ నెలకొంటోంది. ప్రతి లాట్‌కు తొమ్మిది మందికి తక్కువ కాకుండా.. గరిష్టంగా 35 మంది పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయి వ్యాపారులు కూడా పోటీలో పాల్గొంటే రైతులకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆదోని మార్కెట్లో వేరుశనగ, పత్తి ఇతర పంటలకు ఎక్కువ ధరలు లభిస్తున్నాయి. అవార్డు వస్తుందనే నమ్మకముంది ఆదోని మార్కెట్లో వంద శాతం లావాదేవీలు ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఎంతో కృషి చేశాం. దేశంలో 585 మార్కెట్లు ఉండగా.. జాతీయ అవార్డు కోసం 200 దాకా పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా నేను ఢిల్లీకి కూడా వెళ్లి.. ఈ–నామ్ అమలుపై పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా. ఇది మొదటి దశ. ఇందులో విజయవంతమయ్యాం. రెండో దశలో 19 మార్కెట్లు మాత్రమే మిగిలాయి. ఇందులో రాష్ట్రం నుంచి ఆదోని మాత్రమే ఉంది. ఇప్పటిదాకా నాలుగు దశలను విజయవంతంగా ఎదుర్కొన్నాం. 5వ దశలో ప్రధానమంత్రిదే నిర్ణయం. ఆదోని మార్కెట్‌కు అవార్డు వస్తుందనే నమ్మకముంది. – సత్యనారాయణచౌదరి, సహాయ సంచాలకుడు, మార్కెటింగ్ శాఖ -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
బాసర : రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు రైల్వేస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ తెలిపారు. మృతుడి శరీరంపై ఎరుపు, నలుపు గీతాల చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫారంపై మరణించి ఉండగా సిబ్బంది గుర్తించి సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని నిజామాబాద్ రైల్వే ఆస్పత్రికి తరలించినట్లు నట్లు వారు పేర్కొన్నారు.