ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం
సాక్షి, కర్నూలు: జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(ఈ–నామ్) అమలులో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి అవార్డు లభించే అవకాశం కూడా ఉంది. దేశంలోని 585 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలు చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ తత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు లావాదేవీలను వంద శాతం పారదర్శకంగా నిర్వహించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ఈ విధానం ముఖ్యోద్దేశం. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న మార్కెట్ కమిటీలకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇందులో ఒకటి కేంద్ర పాలిత ప్రాంతాలకు, మరొకటి ఈశాన్య రాష్ట్రాలకు, మిగిలినది ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల కేటగిరీలో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పోటీ పడుతోంది. ఇప్పటి వరకు నాలుగు దశల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పైచేయి సాధించింది. ఆదోనితో పాటు మరో నాలుగైదు మార్కెట్‌లు మాత్రమే ఫైనల్ రేసులో నిలిచాయి. వీటి జాబితాను కేంద్ర వ్యవసాయ, రైతుల సహకార మంత్రిత్వ శాఖ ప్రధాని ముందు ఉంచింది. ఆయన నిర్ణయం రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది.
అన్నీ ఈ–నామ్ ద్వారానే..
ఆదోని మార్కెట్‌యార్డులో ప్రస్తుతం లావాదేవీలన్నీ ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి జాతీయ స్థాయి వ్యాపారులు పోటీలోకి రాకపోయినా.. ఉన్న వ్యాపారుల్లోనే పోటీ ఏర్పడుతుండటం వల్ల అన్ని రకాల ఉత్పత్తులకు మంచి ధరలే లభిస్తున్నాయి. కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్లతో పాటు వివిధ జిల్లాల్లోని మార్కెట్లతో పోల్చితే ఆదోనిలో రైతులకు ఎక్కువ ధరలే లభిస్తుండటం గమనార్హం. పైగా మార్కెట్‌యార్డు మొత్తానికి మార్కెటింగ్ శాఖ ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. వ్యాపారులు తమ స్మార్ట్ ఫోన్‌లో ఈ–నామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఎవరికి వారు లాట్ ఐటీ స్లిప్‌లను బట్టి ధరను కోట్ చేయవచ్చు.
ఎవరు ఏ ధర కోట్ చేశారో మిగతా వారికి తెలిసే అవకాశం ఉండదు. అంతేకాకుండా మార్కెట్‌యార్డులో 32 కంప్యూటర్లతో ఈ–బిడ్డింగ్ హాలు ఏర్పాటు చేశారు. ఈ–నామ్ వల్ల వ్యాపారుల మధ్య పోటీ నెలకొంటోంది. ప్రతి లాట్‌కు తొమ్మిది మందికి తక్కువ కాకుండా.. గరిష్టంగా 35 మంది పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయి వ్యాపారులు కూడా పోటీలో పాల్గొంటే రైతులకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌లో వేరుశనగ, పత్తి ఇతర పంటలకు ఎక్కువ ధరలు లభిస్తున్నాయి.
అవార్డు వస్తుందనే నమ్మకముంది
ఆదోని మార్కెట్‌లో వంద శాతం లావాదేవీలు ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఎంతో కృషి చేశాం. దేశంలో 585 మార్కెట్‌లు ఉండగా.. జాతీయ అవార్డు కోసం 200 దాకా పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా నేను ఢిల్లీకి కూడా వెళ్లి.. ఈ–నామ్ అమలుపై పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా. ఇది మొదటి దశ. ఇందులో విజయవంతమయ్యాం. రెండో దశలో 19 మార్కెట్లు మాత్రమే మిగిలాయి. ఇందులో రాష్ట్రం నుంచి ఆదోని మాత్రమే ఉంది. ఇప్పటిదాకా నాలుగు దశలను విజయవంతంగా ఎదుర్కొన్నాం. 5వ దశలో ప్రధానమంత్రిదే నిర్ణయం. ఆదోని మార్కెట్‌కు అవార్డు వస్తుందనే నమ్మకముంది. – సత్యనారాయణచౌదరి, సహాయ సంచాలకుడు, మార్కెటింగ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment