e nam portal
-
AP: ఈ-నామ్లో మనమే ముందు..
సాక్షి, అమరావతి: ఈ–నామ్ (ఎల్రక్టానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్).. రైతులకు గిట్టుబాటు ధర, వ్యాపారులకు నాణ్యమైన సరుకు అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులను ఏకతాటిపైకి తీసుకొచ్చిన వేదిక. జాతీయస్థాయిలో వ్యాపారపరంగా గుంటూరు మార్కెట్ కమిటీ మొదటి స్థానంలో నిలవగా, ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఐదోస్థానంలో ఉంది. వేలంలో ఎక్కువమంది వ్యాపారులు పాల్గొన్నవాటిలో ఆదోని మార్కెట్ మొదటిస్థానంలో నిలిచింది. చదవండి: వ్యవసాయ మౌలిక వసతుల కల్పనలో ఏపీ టాప్ ప్రభుత్వ ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పన ఫలితంగా ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రైతులు, జాతీయస్థాయిలో వ్యాపారులు ఏపీ మార్కెట్ల ద్వారా క్రయవిక్రయాలకు పోటీ పడుతున్నారు. ఈ–నామ్ పరిధిలో జాతీయస్థాయిలో వెయ్యి మార్కెట్లు ఉండగా, రాష్ట్రంలో 33 మార్కెట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో 14.43 లక్షల మంది రైతులు, 3,469 మంది వ్యాపారులు, 2,285 మంది కమీషన్ ఏజెంట్లు ఈ–నామ్లో నమోదు చేసుకున్నారు. 194 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ.29,701 కోట్ల విలువైన 51.73 లక్షల టన్నుల ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగాయి. ప్రధానంగా మిరప, పత్తి, పసుపు, నిమ్మ, టమాట, బెల్లం, ఆముదం, ఉల్లి, వివిధ రకాల పండ్లు, కూరగాయల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఎలా విక్రయిస్తారంటే.. ఈ–నామ్లో నమోదు చేసుకున్న రైతులు, వ్యాపారులు నేరుగా లేదా ఆన్లైన్లో దేశంలో ఎక్కడి నుంచైనా క్రయవిక్రయాలు చేయవచ్చు. అమ్మిన రోజునే రైతు ఖాతాకు సొమ్ము జమ అవుతుంది. ఎల్రక్టానిక్ వేయింగ్ మిషన్ల వల్ల తూకాల్లో మోసాలకు తావుండదు. తొలుత మార్కెట్‌కు రైతు తెచి్చన సరుకు వివరాలను నమోదు చేసుకుని, ఆ రైతు ఎంచుకున్న కమీషన్ ఏజెంట్ వద్దకు పంపిస్తారు. నాణ్యత పరీక్షా యంత్రాల (ఎస్సైయింగ్ ల్యాబ్స్) ద్వారా ర్యాండమ్‌గా లాట్స్ నాణ్యతను పరీక్షించి ఆన్లైన్లోనే పరిమాణంతో సహా ప్రదర్శిస్తారు. రహస్య బిడ్డింగ్ ద్వారా వ్యాపారులు కోట్‌చేసిన ధరల్లో అత్యధిక ధర, వ్యాపారి వివరాలను రైతుకు పంపిస్తారు. రైతు ఆ ధర నచ్చితే అమ్ముకోవచ్చు. లేదంటే తిరస్కరించవచ్చు. గుంటూరులోనే అత్యధిక వ్యాపారం ఈ–నామ్ ద్వారా ఇప్పటివరకు జరిగిన వ్యాపారంలో రూ.20,985 కోట్ల విలువైన 26.45 లక్షల టన్నుల ఉత్పత్తుల క్రయవిక్రయాలు గుంటూరు మార్కెట్ యార్డు పరిధిలోనే జరిగాయి. ఈ మార్కెట్‌కు వచ్చే మిర్చి కొనుగోలుకు పొరుగు రాష్ట్రాల వ్యాపారులు పోటీపడుతుంటారు. అత్యధిక మంది వ్యాపారులు పోటీపడుతున్న మార్కెట్‌గా ఆదోని మార్కెట్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ సగటున ఒక్కో లాట్‌కు 10–15 మంది పోటీ పడుతుండగా, సీజన్లో అత్యధికంగా 30–40 మంది కూడా పోటీపడిన సందర్భాలున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 9.36 లక్షల లాట్స్ కోసం 87.90 లక్షల బిడ్స్ దాఖలయ్యాయి. రూ.3,149 కోట్ల విలువైన 6.16 లక్షల టన్నుల క్రయవిక్రయాలతో ఆదోని వ్యాపారపరంగా ఐదోస్థానంలో నిలిచింది. ఈ–నామ్‌కు పెరుగుతున్న ఆదరణ రైతులతోపాటు వ్యాపారులు కూడా ఈ–నామ్ ద్వారా క్రయవిక్రయాలకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారపరంగా మన రాష్ట్రం నంబర్ 1 స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. – పి.ఎస్.ప్రద్యుమ్న, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
రైతుల్లో ‘ఈ–నామ్’ సంతోషం
ఒకప్పుడు..ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు మోసం చేసేవారు. సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకు దిగుబడులను కొనుగోలు చేసేవారు. ఈ–నామ్ అమలుతో నేడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. రహస్య టెండర్ల ద్వారా పంట కొనుగోళ్లు జరుగుతుండడంతో మంచి ధర లభిస్తోంది. రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లిని ఈ–నామ్ పోర్టల్‌లో టెండరు ద్వారా కోనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉల్లి మార్కెట్లు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ మలక్‌పేటలో ఉల్లి మార్కెట్ నడుస్తోంది. ఎక్కడా కూడా ఈ–నామ్ అమలు కావడం లేదు. దేశంలో మొట్టమొదటి సారిగా ఉల్లిని ఈ–నామ్లో కొనుగోలు చేస్తున్న ఏకైక మార్కెట్ కర్నూలు కావడం విశేషం. అడ్డంకులను అధిగమించి.. ఈ–నామ్ అమలును మొదట్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు వ్యతిరేకించారు. మార్కెట్ బంద్ చేసేంత వరకు పరిస్థితి వచ్చింది. అయితే దీని వల్ల ఎవ్వరికీ ఎటువంటి నష్టం ఉండబోదని మార్కెట్ కమిటీ అధికారులు అందరినీ ఒప్పించి ఆగస్టు 26వ తేదీన ఈ–నామ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రూ.22.16 కోట్ల విలువ చేసే 1.36 లక్షల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. నాడు ఈ పద్ధతిని వ్యతిరేకించిన వారు నేడు జై కొడుతున్నారు. రహస్య టెండర్ విధానంలో.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో గతంలో ఉల్లిని వేలంపాట ద్వారా కొనుగోలు చేసే వారు. ఈ సమయంలో వ్యాపారులు మంచి లాట్ల దగ్గర సిండికేట్ అయ్యేవారనే విమర్శలు ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్ అయి ధరలను అణచివేస్తున్నారని పలుసార్లు రైతులు రోడెక్కి ఆందోళనలు నిర్వహించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ–నామ్ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో ఆన్లైన్లో రహస్య టెండరు విధానంలో ధర కోట్ చేస్తారు. దీంతో వ్యాపారులు సిండికేట్ అయ్యే అవకాశం లేదు. ఫలితంగా ఉల్లికి మంచి ధర లభిస్తోంది. వంద శాతం అమలు.. దేశ వ్యాప్తంగా ఒకే మార్కెట్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్ అమలు చేస్తోంది. జిల్లాలో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్ కమిటీల్లోనే వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవలి వరకు ఉల్లి మినహా అన్ని పంటలను ఈ–నామ్ పోర్టల్‌లోనే కొనుగోలు చేస్తూ వచ్చారు. ఉల్లిని కూడా ఈ విధానంలోకి తేవడంతో 100 శాతం ఈ–నామ్‌ను అమలు చేసినట్లు అయ్యింది. మెరుగ్గా ధరలు.. కర్నూలు మార్కెట్లో ఈ–నామ్ అమలు చేయడం మొదలు పెట్టిన తర్వాత తాడేపల్లిగూడెం కంటే ఇక్కడే ధరలు మెరుగ్గా ఉంటున్నాయి. క్వింటానికి రూ.200 నుంచి రూ.400 వరకు ఎక్కువ ధర లభిస్తోంది. ఇక్కడే మంచి ధర లభిస్తుండటంతో రైతులు తీవ్ర వ్యయ ప్రయాసలకు ఓర్చి తాడేపల్లిగూడేనికి వెళ్లడం లేదు. కర్నూలు మార్కెట్లోనే ఉల్లి అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువే.. జిల్లాలో 90 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. సగటున ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ ప్రకారం ఏటా 36 లక్షల క్వింటాళ్ల ఉల్లి జిల్లాలో పండుతోంది. ఇందులో 20 శాతం వరకు తాడేపల్లిగూడేనికి వెళ్తోంది. మరో 30 శాతం రైతులు పొలం దగ్గరే అమ్ముకుంటున్నారు. 50 శాతం కర్నూలు మార్కెట్‌కు వస్తోంది. ఈ–నామ్ అమలు చేసిన తర్వాత తాడేపల్లిగూడేనికి తగ్గుముఖం పడుతోంది. కర్నూలు మార్కెట్‌కు ప్రతి రోజూ 1,550 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. తెచ్చిన రోజునే దిగుబడిని అమ్ముకొని రైతులు సంతోషంతో ఇంటికి వెళ్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది గతంలో వేలంపాట నిర్వహించే సమయంలో వ్యాపారులు మంచి లాట్ల దగ్గర సిండికేట్ అయ్యేవారు. ఈ–నామ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో రహస్య పద్ధతిలో కొనుగోలు చేపట్టిన తర్వాత వ్యాపారుల మధ్య పోటీ కనిపిస్తోంది. మార్కెట్‌కు నేను 22 క్వింటాళ్ల ఉల్లి తీసుకొచ్చాను. క్వింటా ధర రూ.2,511 పలికింది. – సుంకన్న, గోరంట్ల గ్రామం, కోడుమూరు మండలం వచ్చిన రోజే అమ్ముకున్నాం గతంలో కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి అమ్ముకోవాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది. కనీసం నాలుగు రోజుల సంయం పట్దేది. ఈ–నామ్ అమలు చేసిన తర్వాత పంట తెచ్చిన రోజునే అమ్ముకునే అవకాశం ఏర్పడింది. మార్కెట్‌కు 16 క్వింటాళ్ల ఉల్లి తెచ్చాను. నాణ్యత ఒక మోస్తరుగా ఉన్నా క్వింటాలుకు రూ.1,175 ప్రకారం ధర లభించింది. – మద్దిలేటి, ఏనుగుబాల, ఎమ్మిగనూరు మండలం పారదర్శకంగా కొనుగోళ్లు ఈ–నామ్లో వంద శాతం పారదర్శకంగా ఉల్లి కొనుగోళ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి ధరలు ప్రకటిస్తున్నారు. వెంటనే కాటా వేయడం మొదలవుతుంది. సాయంత్రానికి రైతులు నగదు తీసుకొని వెళ్లిపోతున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో వచ్చిన తక్‌పట్టీలను ప్రింట్ తీసి ఇస్తున్నాం. తాడేపల్లిగూడెంతో పోలిస్తే కర్నూలు మార్కెట్లోనే మంచి ధరలు లభిస్తున్నాయి. – జయలక్ష్మి, సెక్రటరీ,కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ -
ఆదోని మార్కెట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
సాక్షి, కర్నూలు: జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(ఈ–నామ్) అమలులో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి అవార్డు లభించే అవకాశం కూడా ఉంది. దేశంలోని 585 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలు చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ తత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు లావాదేవీలను వంద శాతం పారదర్శకంగా నిర్వహించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ఈ విధానం ముఖ్యోద్దేశం. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న మార్కెట్ కమిటీలకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఒకటి కేంద్ర పాలిత ప్రాంతాలకు, మరొకటి ఈశాన్య రాష్ట్రాలకు, మిగిలినది ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల కేటగిరీలో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పోటీ పడుతోంది. ఇప్పటి వరకు నాలుగు దశల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పైచేయి సాధించింది. ఆదోనితో పాటు మరో నాలుగైదు మార్కెట్లు మాత్రమే ఫైనల్ రేసులో నిలిచాయి. వీటి జాబితాను కేంద్ర వ్యవసాయ, రైతుల సహకార మంత్రిత్వ శాఖ ప్రధాని ముందు ఉంచింది. ఆయన నిర్ణయం రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. అన్నీ ఈ–నామ్ ద్వారానే.. ఆదోని మార్కెట్‌యార్డులో ప్రస్తుతం లావాదేవీలన్నీ ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి జాతీయ స్థాయి వ్యాపారులు పోటీలోకి రాకపోయినా.. ఉన్న వ్యాపారుల్లోనే పోటీ ఏర్పడుతుండటం వల్ల అన్ని రకాల ఉత్పత్తులకు మంచి ధరలే లభిస్తున్నాయి. కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్లతో పాటు వివిధ జిల్లాల్లోని మార్కెట్లతో పోల్చితే ఆదోనిలో రైతులకు ఎక్కువ ధరలే లభిస్తుండటం గమనార్హం. పైగా మార్కెట్‌యార్డు మొత్తానికి మార్కెటింగ్ శాఖ ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. వ్యాపారులు తమ స్మార్ట్ ఫోన్లో ఈ–నామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఎవరికి వారు లాట్ ఐటీ స్లిప్‌లను బట్టి ధరను కోట్ చేయవచ్చు. ఎవరు ఏ ధర కోట్ చేశారో మిగతా వారికి తెలిసే అవకాశం ఉండదు. అంతేకాకుండా మార్కెట్‌యార్డులో 32 కంప్యూటర్లతో ఈ–బిడ్డింగ్ హాలు ఏర్పాటు చేశారు. ఈ–నామ్ వల్ల వ్యాపారుల మధ్య పోటీ నెలకొంటోంది. ప్రతి లాట్‌కు తొమ్మిది మందికి తక్కువ కాకుండా.. గరిష్టంగా 35 మంది పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయి వ్యాపారులు కూడా పోటీలో పాల్గొంటే రైతులకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆదోని మార్కెట్లో వేరుశనగ, పత్తి ఇతర పంటలకు ఎక్కువ ధరలు లభిస్తున్నాయి. అవార్డు వస్తుందనే నమ్మకముంది ఆదోని మార్కెట్లో వంద శాతం లావాదేవీలు ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఎంతో కృషి చేశాం. దేశంలో 585 మార్కెట్లు ఉండగా.. జాతీయ అవార్డు కోసం 200 దాకా పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా నేను ఢిల్లీకి కూడా వెళ్లి.. ఈ–నామ్ అమలుపై పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా. ఇది మొదటి దశ. ఇందులో విజయవంతమయ్యాం. రెండో దశలో 19 మార్కెట్లు మాత్రమే మిగిలాయి. ఇందులో రాష్ట్రం నుంచి ఆదోని మాత్రమే ఉంది. ఇప్పటిదాకా నాలుగు దశలను విజయవంతంగా ఎదుర్కొన్నాం. 5వ దశలో ప్రధానమంత్రిదే నిర్ణయం. ఆదోని మార్కెట్‌కు అవార్డు వస్తుందనే నమ్మకముంది. – సత్యనారాయణచౌదరి, సహాయ సంచాలకుడు, మార్కెటింగ్ శాఖ -
‘నామ్’మాత్రమే!
ఖమ్మంవ్యవసాయం: మిర్చి పంట విక్రయాల్లో రైతులు దోపిడీకి గురికాకుండా.. ధర, తూకం, కమీషన్లలో దళారులు దగా చేయకుండా.. దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ.. ఆన్లైన్ విధానంలో పోటీ ధర కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్) విధానం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా మిర్చి పంట కొనుగోళ్లలో ఈ–నామ్ అమలుపై ప్రభుత్వం, వ్యాపారుల మధ్య పొసగడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మూడేళ్ల క్రితమే ఈ–నామ్‌ను ప్రవేశపెట్టారు. తొలుత పత్తి, ఆ తర్వాత అపరాల కొనుగోళ్లకు దీనిని అమలు చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఈ విధానం అమలు జరగడం లేదు. ఇందులో తొలి రెండు దశలైన పంటను గేట్ ఎంట్రీ చేసుకోవడం, పంట కొనుగోలు చేసిన వ్యాపారులు ఆన్లైన్లో బిడ్డింగ్ చేయడం మాత్రమే అమలవుతున్నాయి. ఇక మిగిలిన అంశాలు అమలు కావట్లేదు. ముఖ్యంగా ఖమ్మం మార్కెట్‌కు ప్రధానంగా విక్రయానికి వచ్చే పంట మిర్చి. ఈ పంట కొనుగోళ్లలో పూర్వపు పద్ధతులను మాత్రమే పాటిస్తున్నారు. మూడేళ్లుగా ఎంత ప్రయత్నించినా.. మిర్చి కొనుగోళ్లలో ఈ–నామ్ అడుగు ముందుకు పడట్లేదు. రైతులు ధర దోపిడీకి గురవుతుండడంతో ఈ–నామ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా వ్యాపారులు పలు కారణాలు చూపడం.. జిల్లాస్థాయి అధికారులు వ్యాపారులతో సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో పంట కొనుగోళ్లలో అక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిర్చి కొనుగోళ్లలో అమలుకాని ‘నామ్’ మిర్చి పంటకు జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ మేరకు వ్యాపారులు ధర నిర్ణయించి.. కొనుగోలు చేస్తుంటారు. కొనుగోళ్లు కేవలం వ్యాపారుల చేతుల్లో మాత్రమే ఉండడంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలు చేసేందుకు అవాంతరాలు చోటు చేసుకుంటున్నాయి. మూడేళ్లుగా మార్కెటింగ్ శాఖ అధికారులు మిర్చి కొనుగోళ్లలో ఈ–నామ్ అమలుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. కార్యరూపం దాల్చడం లేదు. అయితే జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు ఎక్కువగా ఉండడం.. ధర విషయంలో గత సంఘటనలు మార్కెట్లో పునరావృతం కాకుండా ఉండేందుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా, అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని, ఈ–నామ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ–నామ్‌కు ముందుకు రాని వ్యాపారులు జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలులో వ్యాపారులు ముందుకు రావట్లేదు. మిర్చి పంట కొనుగోళ్లలో అనేక ఇబ్బందులు ఉంటాయని, ఈ పంటకు ఈ–నామ్ అమలు సరైంది కాదని వ్యాపారులు తమ వాదన వినిపిస్తున్నారు. ఈ విధానం అమలు చేస్తే ప్రతి బస్తాను కోసి.. పరిశీలించాల్సి ఉంటుందని, అందుకోసం మార్కెట్లో బస్తా వెంట బస్తాను పేర్చాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాక నిత్యం మార్కెట్‌కు 15వేలకు మించి బస్తాలు రాకుండా నియంత్రించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ–నామ్ విధానాలు అమలు చేసేందుకు సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంటుందని, సరుకు ఎక్కువగా వచ్చినప్పుడు ఆన్లైన్ విధానం(సర్వర్) మొరాయిస్తే సమస్యలు తలెత్తుతాయంటున్నారు. మిర్చి కొనుగోళ్లకు ఈ–నామ్ సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు. ప్రయత్నాలు ఫలించేనా? ఓ వైపు ప్రభుత్వ ఆదేశాలు.. మరో వైపు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అధికార యంత్రాంగానికి ఈ–నామ్ అమలు సవాల్‌గా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పర్సన్ ఇన్చార్జ్ అయిన జాయింట్ కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానం వ్యాపారులతో సమావేశం నిర్వహించి.. మిర్చి కొనుగోళ్లలో ఈ–నామ్ విధానాన్ని తప్పక పాటించాలని సూచించారు. అయితే వ్యాపారులు మాత్రం పలు కారణాలు, ఇబ్బందుల గురించి వివరించారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మం మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి రత్నం సంతోష్‌కుమార్ పలుమార్లు వ్యాపారులతో సమావేశం నిర్వహించి.. ఈ–నామ్ అమలుపై వివరించారు. ఈ క్రమంలో పలు రకాల చర్యలు కూడా చేపట్టారు. రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాపారులు ఈ–నామ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అమలు విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నా.. ఫలితం ఉంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే నిత్యం మార్కెట్‌కు 20వేల బస్తాల మిర్చి విక్రయానికి వస్తోంది. అమలులో అక్రమాలకు చెక్ ఈ–నామ్ పూర్తిస్థాయిలో అమలు చేస్తే అక్రమాలను నివారించే అవకాశం ఉంది. దళారీ వ్యవస్థ నిర్మూలనతోపాటు అక్రమాలకు అవకాశం ఉండదు. పోటీ ధర లభిస్తుంది. కాంటాల్లో మోసం ఉండదు. కమీషన్ విధానంలో అక్రమాలు ఉండవు. ఆన్లైన్ విధానంలోనే అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయి. మార్కెట్ పారదర్శకంగా నిర్వహించబడుతుంది. దేశం నలుమూలల నుంచి వ్యాపారులు పంటను కొనుగోలు చేసుకోవచ్చు. దీంతో రైతులకు న్యాయమైన ధర లభిస్తుంది. సరుకు పరిమితం చేస్తే ఓకే.. నిత్యం 15వేల బస్తాల మిర్చిని విక్రయానికి తెప్పిస్తే ఈ–నామ్ విధానం అమలు చేసేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రతి బస్తాను పరిశీలించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సరుకు పెద్ద మొత్తంలో విక్రయానికి వస్తే ఈ–నామ్ పద్ధతిలో కొనుగోలు చేయడం సాధ్యం కాదు. – కొప్పు నరేష్కుమార్, ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు -
ఎవరికో.. ఈ–నామ్!
నారాయణపేట / జడ్చర్ల : మార్కెట్ యార్డుల్లో ఇష్టారాజ్యంగా కొనసాగే జీరో దందాను నివారించడానికి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్ (జాతీయ వ్యవసాయ మార్కెటింగ్) విధానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో 2016 సెప్టెంబర్ 8న నుంచి ఈ విధానం అమల్లో ఉంది. అందులో భాగంగానే జిల్లాలోని మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట, బాదేపల్లి (జడ్చర్ల) మార్కెట్ యార్డుల్లో ఈ విధానం కొనసాగుతోంది. అయితే, ఈ–నామ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న మార్కెట్లకు ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని నాలుగు మార్కెట్ల నుంచి ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, బాదేపల్లి మార్కెట్ల నుంచి డాక్యుమెంటరీ సమర్పించగా.. నారాయణపేట, దేవరకద్ర మార్కెట్ యార్డు అధికారులు నివేదికలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. వాటిని ఈనెల 15వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. దేశంలోని అన్ని యార్డుల వివరాలను పరిశీలించి 26వ తేదీన కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటిస్తుంది. అమలు ఇలా... ఈ నామ్ పరిధిలోకి వచ్చిన మార్కెట్‌యార్డుల్లో కందులు, వేరుశనగ, గుర్రం శనగలు, పెసర, జొన్నలు, ఆముదాలు, వరిధాన్యం, పత్తి, చింతపండు, చింతగింజలు, తెల్ల, నల్ల కుసుమలు తదితర ధాన్యాన్ని ఆన్లైన్ విధానంలోనే కొనుగోలు చేస్తున్నారు. రైతు మార్కెట్‌కు తెచ్చిన ధాన్యాన్ని ఎంట్రెన్స్‌లోనే గేట్పాస్ తీసుకోవడం, విక్రయానికి పెట్టడం, ఆన్లైన్ ట్రేడింగ్ చేయడం, తూకాలు, ధరలు ప్రకటించడం, విక్రయాలు పూర్తికాగానే వ్యాపారులు రైతులకు బ్యాంకు ద్వారా లేక నేరుగా డబ్బులు చెల్లించడం, ఈ పాస్‌ను రైతు కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలి. ఈ ధాన్యాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఇంటర్నేట్లో చూసుకోని ఆన్లైన్ టెండర్లు వేసుకొని కొనుగోలు చేసుకోచ్చు. ధర ఎక్కువగా కోడ్ చేసిన వ్యాపారులకు ధాన్యం విక్రయించి రైతు లాభసాటి ధర పొందవచ్చు. పక్కగా అమలైతేనే.. మార్కెట్‌యార్డుకు వచ్చే సరుకు లెక్కల్లో తప్పుడు గీతలు, సిండికెట్లతో ధరలను నియంత్రించడం లాంటి వాటికి తెరపడుతుంది. బుక్కచిట్టీలపై కొనుగోళ్లకు, అధిక కమిషన్లు వసూళ్లకు అవకాశం చెక్‌పడుతుంది. డబ్బుల కోసం రైతులు నెలల కొద్ది వేచి ఉండాల్సిన పనిలేదు. తక్‌పట్టీలు ఆన్లైన్ ద్వారానే రైతులకు అందుతాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే జీరో దందాకు చెక్ పెట్టినట్లే. డాక్యుమెంటరీ తయారీ ప్రధాన మంంత్రి ‘ఇనామ్’కు డక్యూమెంటరీని తయారు చేసేందుకు పలు ఆంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఏప్రిల్1, 2017 నుంచి 31 డిసెంబర్, 2018 వరకు ఈ నామ్ ద్వారా కోనుగోలు జరిగిన వాటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నామ్ ద్వారా ఇంత వరకు రైతులు ఎంత మంది తమ సరులకు విక్రయించారు. ఏయే ధాన్యాలను ఎంత మొత్తంలో విక్రయించారు. లాట్ నంబర్లు, వ్యాపారస్థులు వేసిన టెండర్లు, ధరల కోడ్లు, రైతులకు చెల్లింపులు, ధాన్యం తూకాలు తదితర వాటిని డక్యూమెంటరీగా తయారీ చేసి పంపించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. అవార్డుల కోసం ప్రతిపాదనలు జిల్లా నుంచి రెండు వ్యవసాయ మార్కెట్ యార్డులను ఈ–నామ్ ఎక్స్లెంట్ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుతోపాటు మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డులను ఈ–నామ్ ఎక్స్లెంట్ అవార్డుల కోసం నివేదికలను తయారు చేసి పంపారు. ఈ రెండు మార్కెట్లో ఈ–నామ్ విధానం అమలు, పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు, ఆదాయం, మౌళిక వసతులు, తదితర వనరులకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తదితర వాటిని నివేదించారు. 2017–18 సంవత్సరానికి సంబంధించి బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు రూ.2.34 కోట్లు, మహబూబ్‌నగర్ యార్డుకు రూ.1.70 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆయా వివరాలను ఈనామ్ ఎక్స్లెంట్ అవార్డుల కోసం కేంద్రానికి నివేదించినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి భాస్కరయ్య తెలిపారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ–నామ్ అవార్డులను ప్రకటించనుందని ఆయన పేర్కొన్నారు. -
ఈ నామ్.. గందరగోళం
జమ్మికుంట(హుజూరాబాద్) : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో మొదటి సారిగా పత్తి బస్తాలకు ఈ నామ్ పద్ధతిలో కొనుగోళ్లకు మంగళవారం అన్నిఏర్పాట్లు చేయగా మార్కెట్‌కు వచ్చిన పత్తి బస్తాలను ప్రధాన వ్యాపారులు ఎవరు ఆన్లైన్ కొనుగోళ్లకు ముందుకు రాలేదు. దీంతో బీ టైప్ వ్యాపారులు ఆన్లైన్ కొనుగోళ్లలో పాల్గొన్నారు. పోటీ లేక రైతులకు కనీస ధర లభించలేదని రైతులు వాపోయారు. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి 200 వాహనాల్లో రైతులు లూజ్ పత్తిని మార్కెట్‌కు తీసుకురాగా మార్కెటింగ్ శాఖ అధికారులు వాటికి వేలంపాటతో కొనుగోళ్లు జరిపారు. దీంతో గంట వ్యవధిలోనే లూజ్ పత్తి వాహనాలు మార్కెట్ యార్డు నుంచి వెళ్లిపోయాయి. బస్తాల్లో వచ్చిన పత్తికి మాత్రమే అధికారులు ఈ నామ్ పద్ధతి మొదలు పెట్టడంతో రైతులు మధ్యాహ్నం 1 గంటవరకు యార్డులో ఎదురు చూపులు తప్పలేదు. నామ్‌కు విరుద్ధంగా తూకాలు.. ఈ నామ్ పద్ధతిని అమలుకు శ్రీకారం చుట్టిన క్రమంలో మార్కెట్‌కు వచ్చిన పత్తి బస్తాలను ఆన్లైన్ కాకముందే యార్డులో అడ్తిదారులు కొందరు ధరలు నిర్ణయించి తూకాలు మొదలు పెట్టారు. దీంతో మార్కెట్ సూపర్వైజర్ గౌస్ తూకాలను నిలిపివేసి అడ్తిదారుల తీరుపై మండిపడ్డారు. నామ్ కొనుగోళ్లు ప్రారంభిస్తే ఎందుకు తుకాలు వేస్తున్నారని ప్రశ్నించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పొద్దంతా యార్డులో ఏలా ఉంటారని, లూజ్ పత్తి తీసుకువచ్చిన రైతులు అమ్మకాలు పూర్తిచేసుకుని మార్కెట్ బయటకు వెళ్తుంటే బస్తాల రైతులు ఏం పాపం చేశారని అడ్తిదారులు ప్రశ్నించారు. ఒక్క, బస్తా, రెండు బస్తాలు తీసుకు వచ్చిన రైతులు అన్లైన్ కోసం గంటల కొద్ది ఎదురు చూస్తారా అంటూ సూపర్వైజర్ను నిలదీశారు. దీంతో అడ్తిదారులు తూకాలను నిలిపివేసి ఈ నామ్ వరకు ఎదురు చూడక తప్పలేదు. ముందుకు రాని వ్యాపారులు.. మార్కెట్లో ఈ నామ్ అమల్లోకి రావడం...అందులో కేవలం బస్తాలకే అమలు చేయడంతో ప్రధాన వ్యాపారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో బీ టైపు వ్యాపారులు ఇష్టానుసరంగా రైతులు తీసుకువచ్చిన బస్తాల పత్తికి ఆన్లైన్లో ధరలు నిర్ణయించారు. క్వింటాల్‌కు రూ.4,170 పత్తి మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 96 క్వింటాళ్ల పత్తిని బస్తాల్లో తీసుకరాగా బీ టైప్ వ్యాపారులు ఆన్లైన్ క్వింటాల్ పత్తికి గరిష్ట ధర రూ. 4,170 నిర్ణయించారు. మోడల్ ధర రూ. 3,900, కనిష్ట ధర రూ. 3,500 చెల్లించారు. -
ఈ-నామ్ పోర్టల్‌తో వెయింగ్ మిషన్ అనుసంధానం
ప్రయోగాత్మకంగా మలక్‌పేట మార్కెట్లో ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్‌ను ఈ-నామ్ పోర్టల్‌తో అనుసంధానం చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్లో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు వచ్చిన మిర్చి పంటను ఈ-నామ్‌తో అనుసంధానం చేసిన ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ ద్వారా తూకం వేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కొద్దిరోజుల్లో మార్కెట్‌కు చేరనున్న మిర్చి పంటను ఈ- నామ్ ద్వారా కొనుగోలు చేయనున్న నేపథ్యంలో వ్యాపారులకు, రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. పెద్దనోట్ల రద్దుతో మార్కెట్లో పని చేసే హమాలీలకు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు, మార్కెట్ కార్యకలాపాలకు బ్యాంకుల నుంచి అధిక మొత్తం నగదు డ్రా చేసుకునేందుకు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్లో మొబైల్ ఏటీఎంతో పాటు బ్యాంకర్లతో సంప్రదించి తగుచర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఆయన చెప్పారు. సమావేశంలో హైదరాబాద్ మార్కెటింగ్ రీజనల్ జాయింట్ డెరైక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.