ఈ-నామ్ పోర్టల్‌తో వెయింగ్ మిషన్ అనుసంధానం
ప్రయోగాత్మకంగా మలక్‌పేట మార్కెట్‌లో ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్‌ను ఈ-నామ్ పోర్టల్‌తో అనుసంధానం చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌లో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు వచ్చిన మిర్చి పంటను ఈ-నామ్‌తో అనుసంధానం చేసిన ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ ద్వారా తూకం వేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కొద్దిరోజుల్లో మార్కెట్‌కు చేరనున్న మిర్చి పంటను ఈ- నామ్ ద్వారా కొనుగోలు చేయనున్న నేపథ్యంలో వ్యాపారులకు, రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై సమీక్షించారు.
పెద్దనోట్ల రద్దుతో మార్కెట్‌లో పని చేసే హమాలీలకు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు, మార్కెట్ కార్యకలాపాలకు బ్యాంకుల నుంచి అధిక మొత్తం నగదు డ్రా చేసుకునేందుకు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్‌లో మొబైల్ ఏటీఎంతో పాటు బ్యాంకర్లతో సంప్రదించి తగుచర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఆయన చెప్పారు. సమావేశంలో హైదరాబాద్ మార్కెటింగ్ రీజనల్ జాయింట్ డెరైక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.