Malakpet market
-
మలక్‌పేట్ మెట్రో వద్ద అగ్ని ప్రమాదంలో కుట్ర.. స్పాట్లో పెట్రోల్ డబ్బాలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద మంటలు చెలరేగడం తీవ్ర కలకలం సృష్టించింది. మంట్లలో ఐదు బైకులు కాలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో, చాదర్ ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్, కోఠి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల ప్రకారం.. మలక్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైకుల వద్ద మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో, ఐదు బైకులు మంటల్లో కాలిపోయినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా కోఠి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.ఇక, మలక్‌పేట్ మెట్రో వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం ఉందని పోలీసులు గుర్తించారు. బైకులు మంటల్లో కాలిపోయిన స్థలంలో పెట్రోల్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. ఈ క్రమంలో మెట్రోస్టేషన్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
తగ్గని ఉల్లి ధర
హైదరాబాద్: ఉల్లి గడ్డ ధర సామాన్యులను కంగుతినిపిస్తోంది. దాదాపు నెల రోజులుగా కిలో రూ.60 నుంచి 70 పైనే ఉంది. దీంతో రేటు తగ్గుతుందని ఎదురు చూస్తున్న మధ్యతరగతి ప్రజలు నిరాశ చెందుతున్నారు. వాస్తవంగా కొత్త పంట వస్తుండడంతో రేటు తగ్గుతుందని భావించినా పరిస్థితి మారలేదు. దీనికి కారణం కమీషన్ ఏజెంట్ల, వ్యాపారుల మాయాజాలం కూడా కారణమని ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీరంతా ఒక్కటై ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉల్లి ధరలు పెంచేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ నుంచి కూడా మలక్‌పేట్ మార్కెట్‌కు ఉల్లిగడ్డ దిగుమతి పెరిగింది. రోజుకుదాదాపు 70–80 లారీల ఉల్లి దిగుమతి అవుతోంది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది లారీ సంఖ్య ఎక్కువగా ఉందని మలక్‌పేట్ మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇప్పటికే ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఈ ఏడాది నగరానికి ఉల్లి రాక పెరిగినా ధరలు మాత్రం తగ్గడం లేదని రిటైల్ వ్యాపారులు అంటున్నారు. గతేడాది నవంబర్‌లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.30 ఉండగా ఈ ఏడాది రూ.60 పైనే పలుకుతోంది. వారం రోజులుగా మహారాష్ట్ర నుంచి భారీగా ఉల్లి సరఫరా పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి ఉల్లి ధరలు తగ్గించడం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. జంట నగరాల మార్కెట్లలో ఉల్లిగడ్డ నిల్వచేయడానికి తగిన గోదాముల వసతి లేక పోవడంవల్లే ఈ పరిస్థితి వస్తోందని వారంటున్నారు. -
మలక్‌పేట గంజ్‌లో కరోనా కలకలం..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని మలక్‌పేట గంజ్‌లో పనిచేసే ఇద్దరి వల్ల మార్కెట్లోని ముగ్గురు వ్యాపారులకు.. తద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. వ్యాపారుల ద్వారానే వేర్వేరు ప్రాంతాల్లో పదిమందికి పైగా కరోనా బారిన పడ్డారు. గ్రేటర్లో పాజిటివ్ కేసులు ఒక అంకెకు పరిమితమయ్యాయని ఉపశమనం పొందుతున్న తరుణంలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరిగాయి. మార్కెట్లు, వ్యాపారుల ద్వారానే ఇవి వ్యాప్తి చెందినట్లు గుర్తించి మార్కెట్లు, వ్యాపార కార్యకలాపాలు జరిగే ప్రాంతాల్లో మరింతపకడ్బందీ చర్యలు తప్పనిసరి అని జీహెచ్ఎంసీ భావించింది. అందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని అన్ని మార్కెట్లు, రైతుబజార్లు, ఇతరత్రా వ్యాపార కేంద్రాలన్నింటినీ తనిఖీ చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ ఆరుగురు జోనల్, 30 మంది డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలతోపాటుగా దిగువ వాటిని పాటించాలని, అధికారులు ప్రతినిత్యం మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. (ఆకలి ఓడగా.. ఆమె నవ్వగా!) ⇔ పరిశుభ్రత: మార్కెట్లు, రైతుబజార్లు, వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. పారిశుధ్య చర్యలు మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ⇔ క్రిమి సంహారకాల స్ప్రే: సదరు ప్రాంతాల్లో క్రిమి సంహారకాల స్ప్రేయింగ్ కార్యక్రమాలు ప్రతి నిత్యం జరగాలి. అవసరాన్ని బట్టి రోజుకు రెండు పర్యాయాలు సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేయాలి. ⇔ ఆరోగ్య పరీక్షలు: మార్కెట్లలో నిత్యావసరాలు, రైతుబజార్లలో కూరగాయలు విక్రయించే వారందరికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ⇔ భౌతికదూరం: కనీస దూరం పాటిస్తూ భౌతిక దూరం అమలు తప్పనిసరిగా అమలు చేయాలి. ఒకే చోట ఎక్కువమంది పోగవడం వల్ల వారిలో ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా అది ఎంతోమందిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. వీటన్నింటి అమలుకు సంబంధిత డిప్యూటీ, జోనల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని లోకేశ్‌కుమార్ సూచించారు. జీహెచ్ఎంసీకి ప్రశంసలు.. గ్రేటర్ హైదరాబాద్‌లో పారిశుధ్యం, తదితర కార్యక్రమాల నిర్వహణకు జీహెచ్ఎంసీ కొంగొత్త విధానాలు అమలు చేస్తోందని కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ సెక్రటరీ దుర్గాశంకర్ మిశ్రా ప్రశంసించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన కార్యక్రమాలతో పారిశుధ్య విభాగం రూపొందించిన వీడియోక్లిప్ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆయన అభినందనలు తెలిపారు. అన్ని స్థానిక సంస్థలు కూడా ప్రజలెక్కువగా ఉండే ప్రాంతాల్లో శానిటైజేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. దీన్ని మునిసిపల్ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ రీట్వీట్ చేశారు.(కరోనా యోధులకు సైన్యం సలాం ) వాళ్లు సరే.. మార్కెట్లు, రైతుబజార్ల సంగతలా ఉండగా ప్రముఖులు, దాతల పంపిణీ కార్యక్రమాల పేరిట జరుగుతున్న తంతులో ఏమాత్రం భౌతిక దూరం పాటించడం లేదు. మంత్రుల నుంచి నగర మేయర్ రామ్మోహన్ వరకు పలువురు ప్రజాప్రతినిధులు ఆయా సరుకులు, శానిటైజర్లు, పుచ్చకాయల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. షెల్టర్‌హోమ్‌లు తదితర ప్రాంతాల్లో సబ్బులు, శానిటైజర్లు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భౌతిక దూరం కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఇటీవల జరిగిన ఓ పంపిణీలో భౌతిక దూరం కనిపించలేదు. కేవలం ఫొటోలకు ఫోజులిచ్చేందుకేనా ఈ పంపిణీ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటే క్యూలో నిలబెట్టకుండా.. దాతలు, ప్రజాప్రతినిధులు గుమికూడకుండా వాటిని అందజేయలేరా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
మిర్చి ధర మోత..!
చాదర్‌ఘాట్: పచ్చడి సీజన్ రాలేదు కానీ మిర్చి ధర మోత మోగుతోంది. గురువారం మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ (గంజ్)లో మిర్చి ధర క్వింటాకు రూ.20 వేలు ధర పలికింది. రెండు మూడేళ్లలో మిర్చికి ఈ స్థాయిలో ధర దక్కలేదు. మహబూబ్‌నగర్, కర్నూల్ నుంచి మాత్రమే మిర్చి దిగుమతి కావడంతో ధర ఒకేసారి పెరిగింది. ప్రధానంగా దిగుబడి తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతేడాది ఇదే సమయంలో ఘాటు రకం క్వింటాల్ రూ.13 వేలు వరకు పలుకగా, ఈసారి 7 వేలకు పైగా అధికంగా ధర నమోదైంది. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 3,198 బస్తాలు దిగుమతయ్యాయి. రెండు మూడు రోజులక్రితం రూ.16 వేలు నుంచి 18 వేల వరకు పలికిన ధర రెండు రోజుల్లో రూ.20 వేలుకు చేరింది. గత ఏడాది ఇదే సీజన్లో దాదాపు 10 వేల బస్తాలు దిగుమతి కాగా, క్వింటాకు రూ.12 వేలు మాత్రమే ధర పలికింది. బహిరంగ మార్కెట్లోనూ కిలో ధర రూ. 220లకు పెరిగింది. ఈ ఏడాది పచ్చి మిర్చి ధర ఎక్కువగా ఉండటంతో ముందుగానే కోశారు. దీంతో పండు మిర్చి ఉత్పత్తి తగ్గింది. ధరల పెరుగుదలకు ఇది కారణమైంది. ధరలు ఇలానే కొనసాగితే క్వింటాలు రూ.22 వేలు దాటవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దిగుమతి పెరిగితే ధరలకు కళ్ళెం మిర్చి దిగుమతి పెరిగితే ధర నియంత్రణలోకి వస్తుంది. నెల రోజుల వరకు ధరలు ఈ విధంగానే ఉండే అవకాశాలున్నాయి. గత ఏడాది ఈ సీజన్లో క్వింటాకు రూ.12 వేలు మాత్రమే వుంది. దిగుమతి తగ్గడంతోనే మిర్చి ధర పెరిగింది. – వెంకటేశం, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, వ్యవసాయ మార్కెట్, హైదరాబాద్. -
గిట్టుబాటు ధర కోసం ధర్నా
హైదరాబాద్: మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. టీపీసీసీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఆధ్వర్యంలో మలక్‌పేటలోని గంజ్ మార్కెట్లో మిర్చి రైతుల కష్టాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం వారికి ఇస్తున్న మద్దతుధరపై ఆరా తీశారు. గిట్టుబట్టు ధర కల్పించేదాకా తాము మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ధర్నా అనంతరం చీఫ్ సెక్రటరీ ఎస్.పి.సింగ్ కు విజ్ఞాపన పత్రం అందజేశారు. పండించిన పంటను నిల్వ ఉంచుకోవటానికి కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటు చేయాలని కోరారు. -
మలక్‌పేట మార్కెట్లో ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట గంజ్ మార్కెట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మిర్చి పంటకు గిట్టుబాటు ధరను కల్పించి కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తోందని.. ఆగ్రహించిన మిర్చి రైతులు మార్కెట్ మెయిన్‌గేట్ ఎదటు బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. -
ఈ-నామ్ పోర్టల్‌తో వెయింగ్ మిషన్ అనుసంధానం
ప్రయోగాత్మకంగా మలక్‌పేట మార్కెట్లో ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్‌ను ఈ-నామ్ పోర్టల్‌తో అనుసంధానం చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్లో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు వచ్చిన మిర్చి పంటను ఈ-నామ్‌తో అనుసంధానం చేసిన ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ ద్వారా తూకం వేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కొద్దిరోజుల్లో మార్కెట్‌కు చేరనున్న మిర్చి పంటను ఈ- నామ్ ద్వారా కొనుగోలు చేయనున్న నేపథ్యంలో వ్యాపారులకు, రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. పెద్దనోట్ల రద్దుతో మార్కెట్లో పని చేసే హమాలీలకు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు, మార్కెట్ కార్యకలాపాలకు బ్యాంకుల నుంచి అధిక మొత్తం నగదు డ్రా చేసుకునేందుకు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్లో మొబైల్ ఏటీఎంతో పాటు బ్యాంకర్లతో సంప్రదించి తగుచర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఆయన చెప్పారు. సమావేశంలో హైదరాబాద్ మార్కెటింగ్ రీజనల్ జాయింట్ డెరైక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి కొందామన్నా కన్నీళ్లే!
సాక్షి, హైదరాబాద్: కరువొస్తే ఢిల్లీ పీఠాన్నీ వణికించగల ఉల్లిగడ్డ రోజురోజుకూ ఘాటెక్కుతోంది.. కోస్తేనే కాదు కొందామన్నా కన్నీళ్లు పెట్టించడానికి సిద్ధమవుతోంది.. రాష్ట్రంలో కొరత నెలకొనడంతో కొద్దిరోజు లుగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, పొరుగు రాష్ట్రాల నుంచి అవసరమైన స్థాయిలో రాకపోతుండడమే దీనికి కారణమవుతోంది. రాష్ట్రానికి రోజుకు సరాసరి 40 వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డ అవసరం. కానీ కొద్దిరోజు లుగా రోజూ కేవలం 25 వేల క్వింటాళ్లకు మించి సరఫరా కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్ నగరానికే రోజుకు 10 వేల క్వింటాళ్ల ఉల్లి అవసరం కాగా ప్రస్తుతం 6 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా అవుతోందని అంటున్నారు. గతేడాది హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌కు రోజూ తొమ్మిది వేల క్వింటాళ్ల ఉల్లి సరఫరా కాగా తాజాగా శుక్రవారం కేవలం ఆరు వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా కావడం పరిస్థితేమిటో స్పష్టం చేస్తోంది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డ ధర రూ. 9వరకు ఉండగా... ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ. 21కు చేరింది. మరికొద్ది రోజుల్లోనే ఉల్లిగడ్డ ధర కిలో రూ. 25 నుంచి రూ. 35 వరకు పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర దెబ్బ.. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల హెక్టార్లలో ఉల్లిసాగు జరుగుతుండగా... ఒక్క మహారాష్ట్రలోనే మూడు లక్షల హెక్టార్లలో సాగవుతుంది. ఇక్కడి నేలలు ఉల్లిసాగుకు అనువైనవి కాదు. దీంతో 90 శాతం మహారాష్ట్ర నుంచే దిగుమతి అవుతోంది. మహారాష్ట్రలో ఉల్లి విత్తనం కొరత, దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఈసారి సాగు బాగా తగ్గిపోయి, ఉల్లిగడ్డ ఉత్పత్తి పడిపోయింది. పట్టించుకుంటేనే.. ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులు అంటున్నారు. లేకుంటే కొరతను అడ్డుకోవడం, ధరలను నియంత్రించడం చాలా కష్టమని వారు పేర్కొంటున్నారు. కొరత, ధరల పెరుగుదల నేపథ్యంలో... ఇప్పటికే కొందరు వ్యాపారులు ఉల్లిని నల్లబజారుకు తరలించినట్లు తెలి సింది. ఇక ఉల్లిగడ్డను తక్కువ ధరకే అందించేందుకు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉల్లి కొరతపై మార్కెటింగ్ అధికారి లక్ష్మీబాయిని ‘సాక్షి’ స్పందన కోరగా శుక్రవారం ఉల్లి కొరతపైనా, ధరలపైనా చర్చించినట్లు చెప్పారు.