మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి నిల్వలు
చాదర్‌ఘాట్: పచ్చడి సీజన్ రాలేదు కానీ మిర్చి ధర మోత మోగుతోంది. గురువారం మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ (గంజ్)లో మిర్చి ధర క్వింటాకు రూ.20 వేలు ధర పలికింది. రెండు మూడేళ్లలో మిర్చికి ఈ స్థాయిలో ధర దక్కలేదు. మహబూబ్‌నగర్, కర్నూల్ నుంచి మాత్రమే మిర్చి దిగుమతి కావడంతో ధర ఒకేసారి పెరిగింది. ప్రధానంగా దిగుబడి తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతేడాది ఇదే సమయంలో ఘాటు రకం క్వింటాల్ రూ.13 వేలు వరకు పలుకగా, ఈసారి 7 వేలకు పైగా అధికంగా ధర నమోదైంది.
హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 3,198 బస్తాలు దిగుమతయ్యాయి. రెండు మూడు రోజులక్రితం రూ.16 వేలు నుంచి 18 వేల వరకు పలికిన ధర రెండు రోజుల్లో రూ.20 వేలుకు చేరింది. గత ఏడాది ఇదే సీజన్‌లో దాదాపు 10 వేల బస్తాలు దిగుమతి కాగా, క్వింటాకు రూ.12 వేలు మాత్రమే ధర పలికింది. బహిరంగ మార్కెట్‌లోనూ కిలో ధర రూ. 220లకు పెరిగింది. ఈ ఏడాది పచ్చి మిర్చి ధర ఎక్కువగా ఉండటంతో ముందుగానే కోశారు. దీంతో పండు మిర్చి ఉత్పత్తి తగ్గింది. ధరల పెరుగుదలకు ఇది కారణమైంది. ధరలు ఇలానే కొనసాగితే క్వింటాలు రూ.22 వేలు దాటవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దిగుమతి పెరిగితే ధరలకు కళ్ళెం
మిర్చి దిగుమతి పెరిగితే ధర నియంత్రణలోకి వస్తుంది. నెల రోజుల వరకు ధరలు ఈ విధంగానే ఉండే అవకాశాలున్నాయి. గత ఏడాది ఈ సీజన్‌లో క్వింటాకు రూ.12 వేలు మాత్రమే వుంది. దిగుమతి తగ్గడంతోనే మిర్చి ధర పెరిగింది. – వెంకటేశం, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, వ్యవసాయ మార్కెట్, హైదరాబాద్.
Comments
Please login to add a commentAdd a comment