gunj
-
మిర్చి ధర మోత..!
చాదర్ఘాట్: పచ్చడి సీజన్ రాలేదు కానీ మిర్చి ధర మోత మోగుతోంది. గురువారం మలక్పేట వ్యవసాయ మార్కెట్ (గంజ్)లో మిర్చి ధర క్వింటాకు రూ.20 వేలు ధర పలికింది. రెండు మూడేళ్లలో మిర్చికి ఈ స్థాయిలో ధర దక్కలేదు. మహబూబ్నగర్, కర్నూల్ నుంచి మాత్రమే మిర్చి దిగుమతి కావడంతో ధర ఒకేసారి పెరిగింది. ప్రధానంగా దిగుబడి తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతేడాది ఇదే సమయంలో ఘాటు రకం క్వింటాల్ రూ.13 వేలు వరకు పలుకగా, ఈసారి 7 వేలకు పైగా అధికంగా ధర నమోదైంది. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్కు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 3,198 బస్తాలు దిగుమతయ్యాయి. రెండు మూడు రోజులక్రితం రూ.16 వేలు నుంచి 18 వేల వరకు పలికిన ధర రెండు రోజుల్లో రూ.20 వేలుకు చేరింది. గత ఏడాది ఇదే సీజన్లో దాదాపు 10 వేల బస్తాలు దిగుమతి కాగా, క్వింటాకు రూ.12 వేలు మాత్రమే ధర పలికింది. బహిరంగ మార్కెట్లోనూ కిలో ధర రూ. 220లకు పెరిగింది. ఈ ఏడాది పచ్చి మిర్చి ధర ఎక్కువగా ఉండటంతో ముందుగానే కోశారు. దీంతో పండు మిర్చి ఉత్పత్తి తగ్గింది. ధరల పెరుగుదలకు ఇది కారణమైంది. ధరలు ఇలానే కొనసాగితే క్వింటాలు రూ.22 వేలు దాటవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దిగుమతి పెరిగితే ధరలకు కళ్ళెం మిర్చి దిగుమతి పెరిగితే ధర నియంత్రణలోకి వస్తుంది. నెల రోజుల వరకు ధరలు ఈ విధంగానే ఉండే అవకాశాలున్నాయి. గత ఏడాది ఈ సీజన్లో క్వింటాకు రూ.12 వేలు మాత్రమే వుంది. దిగుమతి తగ్గడంతోనే మిర్చి ధర పెరిగింది. – వెంకటేశం, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, వ్యవసాయ మార్కెట్, హైదరాబాద్. -
చెప్పుకోదగ్గ పని
పిల్లలు అంటే... వెన్నెల్లో అందమైన ఆటలు.పిల్లలు అంటే.... ముద్దు ముద్దు ముచ్చట్లు.పిల్లలు అంటే... ఇంటిపై వెలిగే ఇంద్రచాపాలు.అయితే పిల్లలంటే... ఇప్పుడు పసితనం మాత్రమే కాదు... పరుల కోసం ఆలోచించడం కూడా. వారికి తమ పరిధిలో సేవ చేయడం కూడా. పిల్లలకు చదివే లోకం. అయితే వారు ఆ లోకానికే పరిమితమైపోవడం లేదు. ఆ లోకం నుంచి మరో లోకంలోకి చూస్తున్నారు. తమలాంటి పిల్లల గురించి ఆలోచిస్తున్నారు.పొద్దుట, సాయంత్ర వేళల్లో ‘ఎక్స్వెజైడ్’ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐదు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసు ఉన్న వంద మంది పిల్లలు ముంబైలోని ఇరవైకి పైగా కాలనీలు తిరిగి పన్నెండు వేలకు పైగా చెప్పుల జతలను సేకరించి... ‘హమారా ఫుట్పాత్’ ‘గూంజ్’ ‘ఏంజెల్’ ‘ఆస్కార్’... మొదలైన ఫౌండేషన్లకు ఇచ్చారు. ‘‘స్కూలుకు వెళ్లే చాలామంది పేద పిల్లలకు కాళ్లకు చెప్పులు ఉండవు. అలాంటి పిల్లలకు చెప్పులు సమకూర్చడానికి పిల్లలందరూ కదిలారు. దీనివల్ల రెండు మంచి పనులు జరుగుతాయి. ఒకటి... పేద పిల్లలకు సహాయపడటం. రెండు... వారిలో మానవతాదృక్పథం పెరగడం. ఇప్పుడు ఏర్పడిన పునాది మీద వారు సమాజానికి ఉపయోగపడే ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలరు’’ అంటున్నాడు ఎక్స్వెజైడ్ వ్యవస్థాకుడు హుషాంగ్ గొట్టె. కేవలం చెప్పుల జతల సేకరణ మాత్రమే కాదు.... రకరకాల కాలనీలు తిరిగి చందాలు వసూలు చేసి ఆ సొమ్మును పేద విద్యార్థుల కోసం వెచ్చిస్తున్నారు. ‘‘కాళ్లకు చెప్పులు లేని పేదలు ఒక పక్క... చెప్పులు పాత పడకుండానే... కొత్తవి కొనేవారు ఇంకో పక్క. పాత చెప్పులను అలా మూలకు పడేసే బదులు వాటిని పేదలకు ఇవ్వడం ద్వారా వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చినట్లు ఉంటుంది. మనసుకు తృప్తి మిగులుతుంది. ధనవంతుల ఇళ్లలోనే కాదు... మధ్యతరగతి ఇళ్లలో కూడా ఒకటి రెండు ఎక్స్ట్రా చెప్పుల జతలు ఉంటున్నాయి’’ అంటున్నారు గొట్టె.పదమూడు సంవత్సరాల రియాన్ కర్బాయి ఎన్నోసార్లు చెప్పుల సేకరణకు వెళ్లాడు. అయితే కొద్దిమంది మాత్రం ప్రతికూలంగా స్పందించారు. అంతమాత్రాన... రియాన్ బాధపడి వెనక్కు తగ్గలేదు. తన ముద్దు మాటలతో వారిలో మార్పు వచ్చేలా చేశాడు. ఇలాంటి పిల్లలు ‘ఎక్స్వెజైడ్’లో ఎంతోమంది ఉన్నారు.కొత్త చెప్పుల జత పాతబడకుండానే... కొత్త చెప్పులు కొనమని మారాం చేసేవాడు రియాన్. అలాంటి రియాన్... ఇప్పుడు తన చెప్పుల గురించి ఆలోచించకుండా చెప్పులు లేని పేద పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు.‘‘మా పిల్లాడిలో నాయకత్వ లక్షణాలు పెరగడం గమనించాను’’ అని సంతోషంగా చెబుతుంది రియాన్ తల్లి నాజ్నీన్.‘‘రకరకాల వ్యక్తులతో, రకరకాల వయసు వారితో మాట్లాడడం వల్ల తమదైన దృక్పథం ఏర్చర్చుకునే అవకాశం ఏర్పడుతుంది’’ అంటున్నారు నాజ్నీన్.‘ఎక్స్వెజైడ్’ సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ మరింత పెరగడమే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతున్నాయి.పదమూడు సంవత్సరాల పక్జిన్ తాను డ్రైవ్లో పాల్గొనడమే కాదు... స్కూల్లో తన ఫ్రెండ్స్ ఆసక్తి చూపేలా ప్రయత్నిస్తోంది. ‘‘మంచి పని చేస్తున్నావు... అని టీచర్లు, తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది’’ అంటుంది పక్జిన్.కొందరు పిల్లలు అయితే... తమ పాకెట్ మనీని కూడా పేద పిల్లల అవసరాల కోసం వినియోగిస్తున్నారు. దాతల పేర్లను పార్శీ కమ్యూనిటి న్యూస్పేపర్ ‘పార్శీ టైమ్’లో ప్రచురించడం ద్వారా ఇతరులలో ప్రేరణ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు పిల్లలు ‘షూ డొనేట్’పై ఆకర్షణీయమైన పోస్టర్లు రూపొందిస్తున్నారు.మరికొందరు తమ సేవాకార్యక్రమాలకు వేదికగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. దాతల నుంచి మంచి స్పందన ఉంది. అయితే సేకరించిన చెప్పులను స్టోర్ చేయడమే కష్టంగా మారింది. దీంతో మరో గోడౌన్ను అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది. ‘‘సేవ గురించి పాఠ్య పుస్తకాల్లోనో, ఇతర పుస్తకాల్లోనో చదువుకోవడం వేరు. స్వయంగా అందులో భాగం కావడం వేరు. దీనివల్ల సేవాగుణంలో ఉన్న తృప్తి స్వయంగా గ్రహించగలుగుతారు’’ అంటున్నాడు అంధేరీలోని ఒక రిటైర్డ్ ఉద్యోగి.చెప్పుల జతలను సేకరించడం, అవసరం ఉన్నవారికి వాటిని పంచడం... అనేది ప్రస్తుతానికైతే ‘ఎక్స్వెజైడ్’ ముఖ్యకార్యక్రమం కావచ్చుగానీ... భవిష్యత్లో మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటారు. వారు మరిన్ని మంచిపనులు చేయాలని ఆశిద్దాం.