సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద మంటలు చెలరేగడం తీవ్ర కలకలం సృష్టించింది. మంట్లలో ఐదు బైకులు కాలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో, చాదర్ ఘాట్ నుంచి దిల్‌సుఖ్ నగర్, కోఠి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వివరాల ప్రకారం.. మలక్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైకుల వద్ద మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో, ఐదు బైకులు మంటల్లో కాలిపోయినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా కోఠి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
ఇక, మలక్‌పేట్ మెట్రో వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం ఉందని పోలీసులు గుర్తించారు. బైకులు మంటల్లో కాలిపోయిన స్థలంలో పెట్రోల్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. ఈ క్రమంలో మెట్రోస్టేషన్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment