‘నామ్‌’మాత్రమే!  | Mirchi Crop Not Purchase In Khammam | Sakshi
Sakshi News home page

‘నామ్‌’మాత్రమే! 

Published Thu, Feb 21 2019 6:54 AM | Last Updated on Thu, Feb 21 2019 6:54 AM

Mirchi Crop Not Purchase In Khammam - Sakshi

ఖమ్మంవ్యవసాయం: మిర్చి పంట విక్రయాల్లో రైతులు దోపిడీకి గురికాకుండా.. ధర, తూకం, కమీషన్లలో దళారులు దగా చేయకుండా.. దళారీ వ్యవస్థకు చెక్‌ పెడుతూ.. ఆన్‌లైన్‌ విధానంలో పోటీ ధర కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ–నామ్‌) విధానం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా మిర్చి పంట కొనుగోళ్లలో ఈ–నామ్‌ అమలుపై ప్రభుత్వం, వ్యాపారుల మధ్య పొసగడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మూడేళ్ల క్రితమే ఈ–నామ్‌ను ప్రవేశపెట్టారు. తొలుత పత్తి, ఆ తర్వాత అపరాల కొనుగోళ్లకు దీనిని అమలు చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఈ విధానం అమలు జరగడం లేదు.

ఇందులో తొలి రెండు దశలైన పంటను గేట్‌ ఎంట్రీ చేసుకోవడం, పంట కొనుగోలు చేసిన వ్యాపారులు ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌ చేయడం మాత్రమే అమలవుతున్నాయి. ఇక మిగిలిన అంశాలు అమలు కావట్లేదు. ముఖ్యంగా ఖమ్మం మార్కెట్‌కు ప్రధానంగా విక్రయానికి వచ్చే పంట మిర్చి. ఈ పంట కొనుగోళ్లలో పూర్వపు పద్ధతులను మాత్రమే పాటిస్తున్నారు. మూడేళ్లుగా ఎంత ప్రయత్నించినా.. మిర్చి కొనుగోళ్లలో ఈ–నామ్‌ అడుగు ముందుకు పడట్లేదు. రైతులు ధర దోపిడీకి గురవుతుండడంతో ఈ–నామ్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా వ్యాపారులు పలు కారణాలు చూపడం.. జిల్లాస్థాయి అధికారులు వ్యాపారులతో సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో పంట కొనుగోళ్లలో అక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మిర్చి కొనుగోళ్లలో అమలుకాని ‘నామ్‌’ 
మిర్చి పంటకు జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ మేరకు వ్యాపారులు ధర నిర్ణయించి.. కొనుగోలు చేస్తుంటారు. కొనుగోళ్లు కేవలం వ్యాపారుల చేతుల్లో మాత్రమే ఉండడంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధానం అమలు చేసేందుకు అవాంతరాలు చోటు చేసుకుంటున్నాయి. మూడేళ్లుగా మార్కెటింగ్‌ శాఖ అధికారులు మిర్చి కొనుగోళ్లలో ఈ–నామ్‌ అమలుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. కార్యరూపం దాల్చడం లేదు. అయితే జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు ఎక్కువగా ఉండడం.. ధర విషయంలో గత సంఘటనలు మార్కెట్‌లో పునరావృతం కాకుండా ఉండేందుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా, అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని, ఈ–నామ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ–నామ్‌కు ముందుకు రాని వ్యాపారులు 
జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధానం అమలులో వ్యాపారులు ముందుకు రావట్లేదు. మిర్చి పంట కొనుగోళ్లలో అనేక ఇబ్బందులు ఉంటాయని, ఈ పంటకు ఈ–నామ్‌ అమలు సరైంది కాదని వ్యాపారులు తమ వాదన వినిపిస్తున్నారు. ఈ విధానం అమలు చేస్తే ప్రతి బస్తాను కోసి.. పరిశీలించాల్సి ఉంటుందని, అందుకోసం మార్కెట్‌లో బస్తా వెంట బస్తాను పేర్చాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాక నిత్యం మార్కెట్‌కు 15వేలకు మించి బస్తాలు రాకుండా నియంత్రించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ–నామ్‌ విధానాలు అమలు చేసేందుకు సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంటుందని, సరుకు ఎక్కువగా వచ్చినప్పుడు ఆన్‌లైన్‌ విధానం(సర్వర్‌) మొరాయిస్తే సమస్యలు తలెత్తుతాయంటున్నారు. మిర్చి కొనుగోళ్లకు ఈ–నామ్‌ సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు.
 
ప్రయత్నాలు ఫలించేనా?  
ఓ వైపు ప్రభుత్వ ఆదేశాలు.. మరో వైపు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అధికార యంత్రాంగానికి ఈ–నామ్‌ అమలు సవాల్‌గా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పర్సన్‌ ఇన్‌చార్జ్‌ అయిన జాయింట్‌ కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానం వ్యాపారులతో సమావేశం నిర్వహించి.. మిర్చి కొనుగోళ్లలో ఈ–నామ్‌ విధానాన్ని తప్పక పాటించాలని సూచించారు. అయితే వ్యాపారులు మాత్రం పలు కారణాలు, ఇబ్బందుల గురించి వివరించారు.

జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి, ఖమ్మం మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి రత్నం సంతోష్‌కుమార్‌ పలుమార్లు వ్యాపారులతో సమావేశం నిర్వహించి.. ఈ–నామ్‌ అమలుపై వివరించారు. ఈ క్రమంలో పలు రకాల చర్యలు కూడా చేపట్టారు. రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాపారులు ఈ–నామ్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అమలు విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నా.. ఫలితం ఉంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే నిత్యం మార్కెట్‌కు 20వేల బస్తాల మిర్చి విక్రయానికి వస్తోంది.

అమలులో అక్రమాలకు చెక్‌ 
ఈ–నామ్‌ పూర్తిస్థాయిలో అమలు చేస్తే అక్రమాలను నివారించే అవకాశం ఉంది. దళారీ వ్యవస్థ నిర్మూలనతోపాటు అక్రమాలకు అవకాశం ఉండదు. పోటీ ధర లభిస్తుంది. కాంటాల్లో మోసం ఉండదు. కమీషన్‌ విధానంలో అక్రమాలు ఉండవు. ఆన్‌లైన్‌ విధానంలోనే అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయి. మార్కెట్‌ పారదర్శకంగా నిర్వహించబడుతుంది. దేశం నలుమూలల నుంచి వ్యాపారులు పంటను కొనుగోలు చేసుకోవచ్చు. దీంతో రైతులకు న్యాయమైన ధర లభిస్తుంది.  
 
సరుకు పరిమితం చేస్తే ఓకే.. 
నిత్యం 15వేల బస్తాల మిర్చిని విక్రయానికి తెప్పిస్తే ఈ–నామ్‌ విధానం అమలు చేసేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రతి బస్తాను పరిశీలించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సరుకు పెద్ద మొత్తంలో విక్రయానికి వస్తే ఈ–నామ్‌ పద్ధతిలో కొనుగోలు చేయడం సాధ్యం కాదు.  – కొప్పు నరేష్‌కుమార్, ఖమ్మం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement