Wimbledon Tournament
-
వింబుల్డన్ టోర్నీకి నాదల్ దూరం!
ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లో ఓడిన స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ వింబుల్డన్ టోర్నీలో ఆడే అవకాశాలు కనిపించడంలేదు. మట్టికోర్టులపైనే జరిగే పారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్‌కు సన్నద్ధం కావడానికి నాదల్ జూలైలో గ్రాస్ కోర్టులపై జరిగే వింబుల్డన్ టోర్నీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు. 2008, 2010లో వింబుల్డన్ విజేతగా నిలిచిన నాదల్ చివరిసారి ఈ టోరీ్నలో 2022లో పాల్గొన్నాడు. -
Wimbledon Tennis tournament: ‘క్వీన్’ రిబాకినా
లండన్: కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడికి తలొగ్గకుండా... తొలి సెట్ కోల్పోయినా ఆందోళన చెందకుండా... ఆద్యంతం పట్టుదలతో పోరాడిన కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా తన ‘గ్రాండ్’కలను సాకారం చేసుకుంది. శనివారం జరిగిన వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల రిబాకినా చాంపియన్‌గా అవతరించింది. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ రిబాకినా 3–6, 6–2, 6–2తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్స్ జబర్‌ను ఓడించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన తొలి కజకిస్తాన్ ప్లేయర్‌గా రిబాకినా చరిత్ర సృష్టించింది. విజేతగా నిలిచిన రిబాకినాకు 20 లక్షల బ్రిటిష్ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్ జబర్‌కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. తడబడి... నిలబడి ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జబర్ ఫైనల్లోనూ జోరు కొనసాగించింది. వైవిధ్యభరిత డ్రాప్ షాట్లు, పాసింగ్ షాట్లతో చెలరేగిన జబర్ మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసి 32 నిమిషాల్లో సెట్‌ను దక్కించుకుంది. తొలి సెట్ కోల్పోయినా రిబాకినా పట్టుదల కోల్పోలేదు. రెండో సెట్లోని తొలి గేమ్‌లోనే జబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబాకినా అదే జోరులో ఐదో గేమ్‌లోనూ బ్రేక్ సాధించి 4–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శక్తివంతమైన సర్వీస్‌లు, ఫోర్‌హ్యాండ్ షాట్లతో విజృంభించిన రిబాకినా 39 నిమిషాల్లో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని తొలి గేమ్‌లో మళ్లీ జబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబాకినా... ఆ తర్వాత ఏడో గేమ్‌లో మరోసారి జబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఎనిమిదో గేమ్‌లో రిబాకినా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. నేడు జొకోవిచ్ (సెర్బియా), కిరియోస్ (ఆస్ట్రేలియా) మధ్య పురుషుల సింగిల్స్ ఫైనల్ జరుగుతుంది. ఫైనల్ గణాంకాలు రిబాకినా ఆన్స్ జబర్ 4 ఏస్‌లు 4 3 డబుల్‌ఫాల్ట్‌లు 1 17/36 నెట్ పాయింట్లు 7/14 4/6 బ్రేక్ పాయింట్లు 2/11 29 విన్నర్స్ 17 33 అనవసర తప్పిదాలు 24 86 మొత్తం పాయింట్లు 80 -
Wimbledon 2022: నిక్ కిరియోస్‌పై 10 వేల డాలర్ల జరిమానా
ఆస్ట్రేలియాకు చెందిన వివాదాస్పద టెన్నిస్ ప్లేయర్ నిక్ కిరియోస్‌పై వింబుల్డన్ టోర్నీ నిర్వాహకులు 10 వేల డాలర్ల (రూ. 7 లక్షల 90 వేలు) జరిమానా విధించారు. తొలి రౌండ్ మ్యాచ్ అనంతరం గ్యాలరీలోని ఓ ప్రేక్షకుడివైపు కిరియోస్ ఉమ్మి వేశాడు. మ్యాచ్ సందర్భంగా ఆ ప్రేక్షకుడు విసిగించాడని, అందుకే అతనివైపు ఉమ్మి వేశానని కిరియోస్ అన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు అనుచిత ప్రవర్తన కారణంగా 13 మంది ప్లేయర్లపై జరిమానా విధించారు. -
జొకోవిచ్‌కు అనుకూలం
లండన్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి జోరు మీదున్న వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి మెయిన్ ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. 2019 చాంపియన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్లో బ్రిటన్‌కు చెందిన టీనేజర్ జాక్ డ్రేపర్‌తో తలపడతాడు. తొలి రౌండ్ దాటితే రెండో రౌండ్లో జొకోవిచ్‌కు 2018 రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) ఎదురయ్యే అవకాశముంది. అంతా సవ్యంగా సాగిపోతే క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా), సెమీఫైనల్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)తో జొకోవిచ్ ఆడాల్సి రావొచ్చు. టాప్–10 సీడింగ్స్‌లో ఉన్నప్పటికీ రుబ్లెవ్, సిట్సిపాస్ గ్రాస్ కోర్టు స్పెషలిస్ట్‌లు కాకపోవడం జొకోవిచ్‌కు అనుకూలాంశం. ఎనిమిది సార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ ఆరో సీడ్‌గా ఈ టోర్నీలో ఆడనున్నాడు. వాస్తవానికి ఫెడరర్‌కు ఏడో సీడింగ్ కేటాయించినా ... నాలుగో సీడ్‌గా ఉన్న డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) టోర్నీ నుంచి వైదొలగడంతో సీడింగ్స్‌లో మార్పులు జరిగాయి. దాంతో ఫెడరర్ కు ‘డ్రా’లోని కింది పార్శ్వంలో చోటు లభించింది. తొలి రౌండ్లో ఫ్రాన్స్ ప్లేయర్ మనారినోతో ఫెడరర్ ఆడతాడు. వింబుల్డన్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న ఫెడరర్ స్థాయికి తగ్గట్టు ఆడితే మరో సారి ఫైనల్‌కు చేరుకునే అవకాశముంది. కరోనా కారణంగా గత ఏడాది వింబుల్డన్ టోర్నీని రద్దు చేశారు. హలెప్ దూరం... మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా) కాలి పిక్క గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది. ఇదే గాయంతో ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఆడలేకపోయిన సిమోనా శుక్రవారం తాను వింబుల్డన్‌లో ఆడటం లేదని ప్రకటించింది. మహిళల డబుల్స్ విభాగంలో భారత స్టార్ సానియా మీర్జా అమెరికాకు చెందిన బెథానీ మాటెక్ సాండ్స్‌తో కలసి ఆడనుంది. తొలి రౌండ్లో ఆరో సీడ్ అలెక్సా గురాచీ (చిలీ)–డెసిరె క్రాజిక్ (అమెరికా) జోడీతో సానియా –బెథానీ ద్వయం తలపడనుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ (భారత్) జోడీ కొంటినెన్ (ఫిన్లాండ్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంటతో ఆడుతుంది. -
11 గంటల 5 నిమిషాలు...
వింబుల్డన్ టోర్నీలో ఇద్దరు అనామకుల మధ్య తొలిరౌండ్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణమే మ్యాచ్‌కు ముందు కూడా ఉంది. కోర్టు నంబర్–18లో మ్యాచ్ అంటే సాధారణ అభిమానులెవరూ పట్టించుకునే పరిస్థితే లేదు. కానీ హోరాహోరీగా సాగిన ఆ సమరం సాధారణ మ్యాచ్‌గా ముగియలేదు. గంటలను దాటి మూడు రోజుల పాటు సాగి కొత్త చరిత్రను సృష్టించింది. ఈ పోరులో ఫలితం వచ్చే సమయానికి కోర్టు చుట్టుపక్కల నిలబడటానికి కూడా చోటు లేనంతగా జనం దీని కోసం ఎగబడిన పరిస్థితి కనిపించింది. ఏకంగా 11 గంటల 5 నిమిషాల పాటు (22–24 జూన్ మధ్య) జరిగిన ఈ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలో సుదీర్ఘ మ్యాచ్‌గా నిలిచిపోగా... జాన్ ఇస్నర్ (అమెరికా), నికోలస్ మహుత్ (ఫ్రాన్స్) తమ అసాధారణ ఆటతో ఈ చరిత్రలో భాగమయ్యారు. జూన్ 22... అలా మొదలైంది... 2010 వింబుల్డన్ రెండో రోజు షెడ్యూల్ ప్రకారమే ఇస్నర్, మహుత్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఇస్నర్ 23వ సీడ్ కాగా, మహుత్ క్వాలిఫయర్. ఈ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వారు కూడా ఊహించి ఉండరు. ఇద్దరూ పట్టుదలగా పోరాడటంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగలేదు. నాలుగు సెట్లలో ఇద్దరు చెరో రెండు గెలుచుకొని సమఉజ్జీలుగా నిలిచారు. 2 గంటల 54 నిమిషాల పాటు ఆట సాగింది. అంటే అసాధారణమేమీ కాదు. అయితే వెలుతురులేమి కారణంగా ఆటను నిలిపివేశారు. (సాయంత్రం గం. 6.13 నుంచి రాత్రి గం. 9.07 వరకు); స్కోరు: 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3). జూన్ 23... ఘనతకు శ్రీకారం... మరో సెట్ మాత్రమే మిగిలింది. ముగియడానికి ఎంతో సేపు పట్టదని నిర్వాహకులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చివరి సెట్‌కు ఆట చేరుకున్న తర్వాత మొదలైంది అసలు సమరం. నువ్వా నేనా అంటూ ఇస్నర్, మహుత్ తలపడ్డారు. ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. టోర్నీ నిబంధనల ప్రకారం చివరి సెట్లో టైబ్రేక్ లేకపోవడం... తుది ఫలితం కోసం స్కోరులో కనీసం రెండు గేమ్‌ల అంతరం ఉండాల్సిందే కాబట్టి ఆట సాగుతూ పోయింది. ఒకసారి ఇస్నర్ పైచేయి సాధిస్తే వెంటనే మహుత్ తగిన రీతిలో జవాబిచ్చాడు. అలా ఏకంగా 7 గంటల 4 నిమిషాల పాటు భీకరంగా ఆడినా ఆట ముగియలేదు. సూర్యుడు మాత్రం తన వల్ల కాదంటూ తప్పుకోవడంతో మ్యాచ్ ఆగిపోయింది. (మధ్యాహ్నం గం. 2.05 నుంచి రాత్రి గం. 9.07 వరకు), స్కోరు: చివరి సెట్ టైబ్రేక్‌లో 59–59 జూన్ 24... ఘనమైన ముగింపు... రెండో రోజు ఆటలోనే సుదీర్ఘ మ్యాచ్‌గా పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. టెన్నిస్ అభిమానులంతా అన్నీ వదిలి ఈ మ్యాచ్ వేదిక వద్దకు అమితాసక్తితో వచ్చేశారు. మళ్లీ అదే తంతు... ఒక్కో పాయింట్ కోసం ఆగని పోరాటం. ఎంతవరకు వీరు ఆడగలరని అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. చివరకు 1 గంట 7 నిమిషాల తర్వాత తుది ఫలితం వచ్చింది. ఇస్నర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో మహుత్‌పై గెలిచాడు. విజయానందంతో ఇస్నర్ కుప్పకూలిపోగా, మహుత్లో కూడా చెప్పలేనంత నైరాశ్యం కనిపించింది. 2004 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫ్యాబ్రిస్ సాంతోరో, ఆర్నార్డ్ క్లెమెంట్ మధ్య 6 గంటల 33 నిమిషాలపాటు జరిగిన సుదీర్ఘ మ్యాచ్ రికార్డు దీంతో బద్దలైంది. నిజానికి చివరి సెట్ (8 గంటల 11 నిమిషాలు) ఒక్కటే ఈ రికార్డును పడగొట్టేసింది. ఇద్దరికీ హ్యాట్సాఫ్... మహామహుల ఫిట్‌నెస్‌కే పరీక్ష పెట్టే టెన్నిస్‌లో ఐదు సెట్ల పోరాటాలు ఎప్పుడూ కూడా అంత సులువు కాదు. అలాంటిది 665 నిమిషాల పాటు వీరు కోర్టులో శ్రమించారు. ప్రాణం పోతుందన్నట్లుగా ప్రతీ పాయింట్ కోసం పోరాడారు. ఆ పట్టుదల, నిబద్ధత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదో ఒక దశలో ఇక చాలు నా వల్ల కాదు అన్నట్లుగా చేతులెత్తేయలేదు. ఈ పాయింట్ పోతే పోనీ మ్యాచ్ ముగిసిపోతుంది కదా అనుకోలేదు. కోలుకునేందుకు, కండరాలు పట్టేయకుండా ఉండేందుకు ఐస్బాత్లు, మసాజ్లతోపాటు రికవరీ షేక్‌లు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత తాము సాధించిన ఘనతలు చూసుకునేసరికి వారిద్దరూ ఒకటైపోయారు. ఒక్క మ్యాచ్ కోసం ఏకంగా 11 గంటల 5 నిమిషాలు ఆడిన ఇస్నర్ పూర్తిగా అలసిపోవడంతో ఈ టోర్నీ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. రెండో రౌండ్లో ఇస్నర్ 0–6, 3–6, 2–6తో థీమో బాకెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. కొన్ని విశేషాలు... సుదీర్ఘ మ్యాచ్... సుదీర్ఘ సెట్... ఒక సెట్లో అత్యధిక గేమ్‌లు (138), ఒక మ్యాచ్‌లో అత్యధిక గేమ్‌లు (183), ఒక మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు (216; ఇస్నర్ 113+మహుత్ 103), ఒక మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు (980)...ఇలా ఎన్నో ఘనతలు ఈ మ్యాచ్ ఖాతాలో చేరాయి. ఇతరత్రా చూస్తే పలు అవార్డులు ఈ మ్యాచ్‌కు దక్కగా... తర్వాతి రోజుల్లో పుస్తకాలు, వీడియో ఆల్బమ్‌లు, డాక్యుమెంటరీలు పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌పై రూపొందించారు. చివరగా... లాక్డౌన్ నేపథ్యంలో ఇటీవలే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఈ మొత్తం 11 గంటల 5 నిమిషాల మ్యాచ్‌ను విరామం లేకుండా యూట్యూబ్‌లో పెడితే పెద్ద సంఖ్యలో జనం చూశారు. లైవ్ టెన్నిస్ లేని ఈ సమయంలో మీరు ఎన్ని గంటలు ఈ చరిత్రాత్మక మ్యాచ్‌ను చూడగలరో ప్రయత్నించండి. -
థీమ్ నిష్క్రమణ వింబుల్డన్ టోర్నీ
లండన్: గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన డొమినిక్ థీమ్ వింబుల్డన్ టోర్నమెంట్లో మాత్రం తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ ఆస్ట్రియా ఆటగాడు మార్కోస్ బగ్ధాటిస్ (సైప్రస్)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 4–6, 5–7తో రెండు సెట్లను చేజార్చుకొని మూడో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో థీమ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 4–6, 3–6, 4–6తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో నాదల్ 6–3, 6–3, 6–2తో డూడీ సెలా (ఇజ్రాయెల్)పై, జ్వెరెవ్ 7–5, 6–2, 6–0తో డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై, డెల్‌పొట్రో 6–3, 6–4, 6–3తో గొజోవిక్ (జర్మనీ)పై గెలిచారు. క్విటోవా ఇంటిముఖం... మహిళల సింగిల్స్‌లో 2011, 2014 చాంపియన్, ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బెలారస్ అమ్మాయి సస్నోవిచ్ 6–4, 4–6, 6–0తో క్విటోవాపై సంచలన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–2, 7–5తో బ్రాడీ (బ్రిటన్)పై, టాప్ సీడ్ సిమోనా హాలెప్ (రొమేనియా) 6–2, 6–4తో కురిమి (జపాన్)పై గెలిచారు. ఫెడరర్ రికార్డు బద్దలు వరుసగా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లు ఆడిన ప్లేయర్‌గా స్పెయిన్ ఆటగాడు ఫెలిసియానో లోపెజ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (వరుసగా 65) పేరిట ఉన్న ఈ రికార్డును వరుసగా 66వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న లోపెజ్ బద్దలు కొట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో లోపెజ్ 6–3, 6–4, 6–2తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై గెలిచాడు. -
రద్వాన్‌స్కా గట్టెక్కింది
♦ పోరాడి గెలిచిన పోలండ్ స్టార్ ♦ జొకోవిచ్, నాదల్ ముందంజ ♦ మూడో సీడ్ ప్లిస్కోవాకు షాక్ వింబుల్డన్ టోర్నమెంట్ లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో తొమ్మిదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రద్వాన్‌స్కాకు అమెరికా ప్రత్యర్థి మెక్‌హలే నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. చివరకు రద్వాన్‌స్కా 5–7, 7–6 (9/7), 6–3తో క్రిస్టియానా మెక్‌హలే (అమెరికా)పై గెలిచి గట్టెక్కింది. తొలి సెట్‌ను కోల్పోయిన పోలండ్ స్టార్‌కు రెండో సెట్ కూడా దాదాపు చేజారినంత పనైంది. చివరకు ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీయగా అక్కడ కూడా మెక్‌హలే ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఒక్కో పాయింట్ కోసం రద్వాన్‌స్కా తన శక్తి నంతా కూడదీసుకొని పోరాడింది. ఈ సెట్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడటంతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. 2 గంటల 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రద్వాన్‌స్కా 6 ఏస్‌లు సంధించగా, ప్రత్యర్థి 5 ఏస్‌లు సాధించింది. మెక్‌హలే సర్వీస్‌ను రద్వాన్‌స్కా మూడు సార్లు బ్రేక్ చేసింది. అమెరికా క్రీడాకారిణి 42 అనవసర తప్పిదాలు చేస్తే... రద్వాన్‌స్కా 14 మాత్రమే చేసింది. మరో వైపు ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్, మూడో సీడ్ కరొలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే కంగుతింది. ప్రపంచ మూడో ర్యాంకర్ ప్లిస్కోవాకు 6–3, 5–7, 2–6తో స్లోవేకియా క్రీడాకారిణి, 87 ర్యాంకర్ రైబరికొవా షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) 6–0, 7–5తో మకరోవా (రష్యా)ను ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంప్, 13వ సీడ్ జెలీనా ఒస్టాపెంకో (లాత్వియా) కూడా 4–6, 7–6 (7/4), 6–3తో ఫ్రాన్కోయిస్ అబండా (కెనడా)పై, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–2, 6–4తో విక్మయెర్ (బెల్జియం)పై నెగ్గారు. జొకోవిచ్, నాదల్ అలవోకగా... పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సీడెడ్ ఆటగాళ్లు నొవాక్ జొకోవిచ్, రాఫెల్ నాదల్ ముందంజ వేశారు. రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–2, 6–2, 6–1తో అడమ్ పావ్లసెక్ (చెక్ రిపబ్లిక్)పై సునాయస విజయం సాధించాడు. ఆరంభం నుంచి అసాధారణ ఆటతీరు కనబరిచిన నొవాక్ కేవలం గంటా 33 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించాడు. స్పెయిన్ స్టార్ నాలుగో సీడ్ నాదల్ వరుస సెట్లలో 6–4, 6–2, 7–5తో డోనాల్డ్ యంగ్ (అమెరికా)పై గెలుపొందగా... 13వ సీడ్ డిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–2, 6–1తో బాగ్దటిస్ (సైప్రస్)పై నెగ్గాడు. 15వ సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 7–6 (7/1), 6–4, 6–4తో ఎడ్మండ్ (బ్రిటన్)పై గెలువగా, 29వ సీడ్ డెల్ పొట్రోకు 4–6, 4–6, 6–7 (3/7)తో ఎమెస్ట్ గుల్బిస్ (లాత్వియా) చేతిలో చుక్కెదురైంది. 8వ సీడ్ తియెమ్ (ఆస్ట్రియా) 5–7, 6–4, 6–2, 6–4తో గైల్స్ సైమన్ (ఫ్రాన్స్)పై, డ్యుడి సెలా (ఇజ్రాయెల్) 6–7 (5/7), 7–6 (7/5), 5–7, 7–6 (7/5), 6–3తో 23వ సీడ్ జాన్ ఇస్నర్ (అమెరికా)పై గెలిచారు. జీవన్, పేస్ అవుట్ జీవన్ నెదున్‌చెజియాన్ తొలి గ్రాండ్‌స్లామ్ సంబరం తొలి రౌండ్‌తోనే ముగిసింది. పురుషుల డబుల్స్‌లో జీవన్ (భారత్)–జరెడ్ డోనాల్డ్సన్ (అమెరికా) జంట 7–6 (7/4), 7–5, 6–7 (3/7), 0–6, 3–6తో జే క్లార్క్– మార్కస్ విల్స్ (బ్రిటన్) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. ఓడినప్పటికీ ఐదు సెట్ల మ్యాచ్‌లో జీవన్ ద్వయం చక్కని పోరాటపటిమ కనబరిచింది. మరో మ్యాచ్‌లో వెటరన్ స్టార్ లియాండర్ పేస్ కూడా తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. పేస్ (భారత్)– అదిల్ శమస్దిన్ (కెనడా) ద్వయం 6–4, 6–4, 2–6, 6–7 (2/7), 8–10తో జులియన్ నోలే– ఫిలిప్ ఒస్వాల్డ్ (ఆస్ట్రియా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
వాళ్లు వచ్చేది డబ్బు కోసమే..!
గాయంతో తప్పుకున్న ఆటగాళ్లపై ఫెడరర్ వ్యాఖ్య లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లోనే (సింగిల్స్) ఓటమిపాలైనా ప్రతీ ఆటగాడికి 35 వేల పౌండ్ల (దాదాపు రూ. 29.31 లక్షలు) కనీస ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఇది కొన్ని చిన్న స్థాయి టోర్నీలు గెలుచుకుంటే వచ్చేదానికంటే ఎక్కువే! ఒక ఆటగాడు మ్యాచ్ మధ్యలో గాయంతో తప్పుకున్నా కూడా అతనికి ఈ మొత్తం దక్కుతుంది. ఈ సారి టోర్నీ తొలి రౌండ్లో ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు (పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి) మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. దీనిపై స్టార్ ప్లేయర్, ఏడు సార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన రోజర్ ఫెడరర్ అసహనం వ్యక్తం చేశాడు. వారు డబ్బు కోసమే ఆడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఫెడరర్ ప్రత్యర్థి డల్గొపలోవ్ (ఉక్రెయిన్) ఇలాగే నిష్క్రమించగా, జొకోవిచ్‌తో తలపడిన మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా) కూడా గాయంతోనే ఆటను మధ్యలో ముగించాడు. ‘నా దృష్టిలో వారికి దక్కుతున్న మొత్తం చాలా ఎక్కువే. గాయంతో కూడా ఇక్కడికి వచ్చి వారు ఏదో అద్భుతం జరగవచ్చని ఆశిస్తారు. పూర్తి ఫిట్‌గా లేని ఆటగాళ్లు ముందే తప్పుకొని వేరేవాళ్లకు అవకాశం ఇస్తే మంచిది. ఇలాంటి ఆటగాళ్లు డబ్బు కోసమే బరిలోకి దిగుతున్నారని చెప్పగలను’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు. సెంటర్ కోర్టులో పెద్ద ఆటగాళ్ల మ్యాచ్ చూసేందుకు భారీ మొత్తమున్న టికెట్లు కొని జనం వస్తారని, ఇది వారిని తీవ్రంగా నిరాశపరుస్తుందని అతను చెప్పాడు. నష్టపోయిన ప్రేక్షకుల కోసం తానూ, జొకోవిచ్ కలిసి మ్యాచ్ ఆడాల్సిందేమోనని ఫెడెక్స్ సరదాగా అన్నాడు. ‘ఆట బోర్ కొట్టింది’... ఆస్ట్రేలియా ఆటగాడు బెర్నార్డ్ టామిక్ ప్రదర్శన కూడా వివాదాస్పదంగా మారింది. అతను పూర్తి ఫిట్‌గా ఉన్నా మిషా జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన మ్యాచ్‌లో కనీస పోటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. పైగా మ్యాచ్ ముగిసిన తర్వాత ‘ఎందుకో కారణం చెప్పలేను కానీ నాకు ఆ సమయంలో టెన్నిస్ బోర్ కొట్టింది’ అని చెప్పుకున్నాడు. దాంతో టామిక్ తన ప్రైజ్‌మనీ వెనక్కి ఇవ్వాలంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ అతను... ఫెడరర్, జొకోవిచ్ ఇలాగే ఇచ్చేస్తే నేను కూడా ఏదో ఒక సంస్థకు విరాళంగా ఇస్తాను అని వ్యాఖ్యానించాడు. -
'పచ్చిక' పండగొచ్చింది
►నేటి నుంచి వింబుల్డన్ టోర్నీ ►బరిలో ముర్రే,, నాదల్, జొకోవిచ్ ►మహిళల సింగిల్స్‌లో ఒస్టాపెంకోపై చూపు లండన్: సోమవారం నుంచి ప్రారంభం కానున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్ సాధించాలని మాజీ చాంపియన్, రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) బరిలోకి దిగుతున్నాడు. గతేడాది ఇదే టోర్నీ సెమీస్‌లో మిలోస్ రావ్‌నిక్ (కెనడా) చేతిలో పరాజయం పాలయ్యాక దాదాపు అందరూ ఫెడెక్స్ పని అయిపోయిందని భావించారు. అయితే ఈ ఏడాది కాలంలో తనను ఇబ్బంది పెడుతున్న మొకాలి గాయానికి సర్జరీ చేసుకుని కొత్త శక్తి యుక్తులు సంతరించుకుని తను మునుపటి ఫెడరర్‌ను గుర్తుకు తెస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అద్వితీయ ఆటతీరుతో ఫెడరర్ చెలరేగిపోయి ఏకంగా చాంపియన్‌గా నిలిచాడు. దీంతో తన గ్రాండ్‌స్లామ్ సంఖ్య 18కి పెంచుకున్నాడు. మరోవైపు తనకెంతో ఇష్టమైన వింబుల్డన్‌కు మెరుగ్గా సిద్ధమయ్యేందుకు ఫ్రెంచ్ ఓపెన్‌కు సైతం డుమ్మా కొట్టాడు. ఇప్పటికే ఏడుసార్లు విజేతగా నిలిచి పీట్ సంప్రాస్ (అమెరికా)తో సమంగా నిలిచిన ఫెడెక్స్.. రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఈ టైటిల్‌ను సాధించాలని భావిస్తున్నాడు. ప్రస్తుత ఫామ్ చూస్తే ఈ టోర్నీలో ఫెడరర్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనున్నాడు. మరోవైపు తన సమకాలీకులు ప్రపంచ నం.1 ఆండీ ముర్రే (బ్రిటన్), నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఫామ్‌లో లేకపోవడం.. రఫెల్ నాదల్ (స్పెయిన్) మొకాలి గాయంతో ఇబ్బంది పడుతుండడం దృష్ట్యా ఫెడెక్స్ ఈసారి టైటిల్ సాధిస్తాడని తన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది గ్రాస్ కోర్టులపై చెలరేగిన ఫెడరర్.. హాలే టెన్నిస్ టైటిల్‌ను తొమ్మిదోసారి కైవసం చేసుకోవడం విశేషం. ముర్రే, జొకోవిచ్, నాదల్ ప్రస్తుతం గాయాలతో సతమతమవుతున్నారిని వాకు కోలుకుంటే తన ప్రత్యర్థులుగా పరిగణిస్తానని ఫెడరర్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్ డొల్గొపొలోవ్తో వింబుల్డన్ పోరును ఫెడెక్స్ ప్రారంభించనున్నాడు. మరోవైపు రికార్డుస్థాయిలో 10 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధిం చిన నాదల్.. వింబుల్డన్‌లో మాత్రం అంతంత మాత్రంగానే రాణించాడు. ఇప్పటివరకు 15 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించి ఆల్‌టైమ్ హైలో రెండోస్థానంలో ఉన్న నాదల్.. వింబుల్డన్‌లో మాత్రం రెండుసార్లు మాత్రమే విజేతగా నిలిచాడు. చివరగా 2010లో విజేతగా నిలిచిన స్పెయిన్‌స్టార్.. గత ఐదేళ్లలో ప్రిక్వార్టర్ దశను దాటడంలో విఫలమయ్యాడు. మరోవైపు ఓ వైపు మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న నాదల్.. గ్రాస్ కోర్టుపై ఎలా రాణిస్తాడో చూడాలి. తొలిరౌండ్లో తను జాన్ మిల్మాన్ (ఆస్ట్రేలియా)తో నాదల్ తలపడనున్నాడు. మరోవైపు ప్రపంచ నం.1, ముర్రేకు ఈ ఏడాది కలసి రాలేదు. ఇప్పటివరకు ఎనిమిది టోర్నీలు ఆడగా.. కేవలం దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో విజేత నిలవడం మినహా మిగతా టోర్నీలో ఘోరంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లలో వరుసగా ప్రిక్వార్టర్స్, సెమీస్‌లో వెనుదిరిగాడు. ఇటీవల జరిగిన క్వీన్స్ క్లబ్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ 90వ ర్యాంకర్, జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) చేతిలో తొలిరౌండ్లోనే ఓటమిపాలయ్యాడు. దీంతో సొంతగడ్డపై జరుగుతున్న గ్రాండ్‌స్లామ్‌లో సత్తాచాటాలని ముర్రే భావిస్తున్నాడు. తొలి రౌండ్లో అలెగ్జాండర్ బుబ్లిక్ (రష్యా)తో ముర్రే ఆడనున్నాడు. మరోవైపు మూడుసార్లు చాంపియన్, ప్రపంచ మాజీ నం.1. నోవాక్ జొకోవిచ్ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇటీవల ఈస్ట్‌బోర్న్‌లో జరిగిన సన్నాహక టోర్నీలో విజయం సాధించడం జొకో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుందనడంలో సందేహం లేదు. జనవరిలో దోహా ఓపెన్ నెగ్గిన తర్వాత సెర్బియన్ స్టార్ గెలిచిన టోర్నీ ఇదే కావడం విశేషం. మరోవైపు ఏడాది నుంచి నం.1 స్థానానికి దూరమైన జొకోవిచ్.. ఈసారి సత్తా చాటా ఎలాగైనా తన ర్యాంకును దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాడు. తొలిరౌండ్లో మర్టిన్ క్లిజాన్ (స్లొవేకియా)తో జొకోవిచ్ తలపడనున్నాడు. అందిరి చూపు ఒస్టాపెంకోపైనే.. మహిళల సింగిల్స్ విభాగంలో అందరి దృష్టి జెలీనా ఒస్టాపెంకో(లాత్వియా)పైనే కేంద్రీకృతమైంది. స్టార్ ప్లేయర్లకు షాకిస్తూ ఫ్రెంచ్ ఓపెన్ రూపంలో తొలి గ్రాండ్‌స్లామ్ నెగ్గిన ఒస్టాపెంకోను వింబుల్డన్‌లో ఫేవరెట్‌గా భావిస్తున్నారు. రోలాండ్ గారోస్ విజయం గాలివాటం కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఒస్టాపెంకోపై ఎంతైనా ఉంది. మరోవైపు సెరెనా విలియమ్స్ (అమెరికా), మరియా షరపోవా (రష్యా)తదీతర స్టార్ ప్లేయర్ల గైర్హాజరీతో ఈసారి చాంపియన్‌గా ఎవరు నిలుస్తారనో ఆత్రుత అభిమానుల్లో నెలకొంది. నం.1 ర్యాంకుతోపాటు తొలి గ్రాండ్‌స్లామ్‌ను త్రుటిలో కోల్పోయిన సిమోనా హాలెప్ (రొమేనియా) ఈసారి ఎలాగైనా తొలి గ్రాండ్‌స్లామ్‌ను నెగ్గాలని కృతనిశ్చయంతో ఉంది. రోలాండ్ గారోస్‌లో తొలిరౌండ్లోనే ఓటమిపాలై ఓపెన్ శకంలో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టిన మొదటి ప్రపంచ నం.1 ప్లేయర్‌గా అపఖ్యాతి మూట గట్టుకున్న ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ) ఈసారి తన సత్తాచాటాలని భావిస్తోంది. తొలిరౌండ్లో అలెగ్జాండ్రా సాస్నోవిచ్ (బెలారస్)తో ఒస్టాపెంకో, మరినా ఎరాకోవిచ్ (న్యూజిలాండ్)తో హెలెప్, ఇరినా పాల్కని (అమెరికా)తో కెర్బర్ తలపడనున్నారు. మరోవైపు పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), ప్రపంచ మాజీ నం.1, విక్టోరియన్ అజారెంకా (డెన్మార్క్), వీనస్ విలియమ్స్ (అమెరికా), కరోలనా ప్లిస్కోవా (చెక్‌రిపబ్లిక్) ఉఇఉఉలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మ్యాచ్‌లు సా.4 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
ఒకే పార్శ్వంలో ముర్రే, నాదల్
మరోవైపు ఫెడరర్, జొకోవిచ్ ∙ వింబుల్డన్ టోర్నీ ‘డ్రా’ విడుదల లండన్: అంతా అనుకున్నట్లు జరిగితే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)... ఈసారి తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే సెమీఫైనల్లో తొలుత మాజీ చాంపియన్, నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)ను దాటాల్సి ఉంటుంది. ఈ ఇద్దరూ ఒకే పార్శ్వంలో ఉండటంతో సెమీఫైనల్లో తలపడే అవకాశముంది. మరో పార్శ్వంలో రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఉన్నారు. దాంతో వీరిద్దరూ సెమీఫైనల్లోనే అమీతుమీ తేల్చుకునే చాన్స్ ఉంది. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)తో ముర్రే... మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా)తో జొకోవిచ్... డల్గొపలోవ్ (ఉక్రెయిన్)తో ఫెడరర్... జాన్ మిల్మన్ (ఆస్ట్రేలియా)తో నాదల్ ఆడతారు. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా), మాజీ విజేత షరపోవా (రష్యా) గైర్హాజరీలో పలువురు ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో ఆడనుంది. క్వార్టర్ ఫైనల్లో ఆమెకు ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ మాజీ విజేత స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) ఎదురయ్యే అవకాశముంది. మహిళల డబుల్స్‌లో 13వ సీడింగ్ పొందిన సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం) ద్వయం తొలి రౌండ్లో నవోమి ఒసాకా (జపాన్)–షుయె జాంగ్ (చైనా) జోడీతో ఆడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట డస్టిన్ బ్రౌన్–మిషా జ్వెరెవ్ (జర్మనీ) జోడీతో... లియాండర్ పేస్ (భారత్)–ఆదిల్ షమస్దీన్ (కెనడా) జోడీ నోల్–ఒస్వాల్డ్ (ఆస్ట్రియా) జంటతో... దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) ద్వయం ఎడ్మండ్ (బ్రిటన్)–సుసా (పోర్చుగల్) జంటతో... జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్)–డొనాల్డ్సన్ (అమెరికా) జోడీ క్లార్క్–విల్లీస్ (బ్రిటన్) జంటతో తలపడతాయి. -
‘వింబుల్డన్’ వైల్డ్ కార్డు అడగను...
తన తాజా ర్యాంక్ ప్రకారం వింబుల్డన్ టోర్నమెంట్లో క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించినందున.... ‘మెయిన్ ‘డ్రా’లో చోటు కోసం వైల్డ్ కార్డుకు దరఖాస్తు చేసుకోబోనని రష్యా టెన్నిస్ స్టార్ షరపోవా తెలిపింది. -
జొకోవిచ్ శుభారంభం
సెరెనా, షరపోవా కూడా వింబుల్డన్ టోర్నమెంట్ లండన్: డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 6-4, 6-4, 6-4తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ నిషికోరి (జపాన్) 6-3, 6-7 (4/7), 6-2, 3-6, 6-3తో బొలెలీ (ఇటలీ)పై, ఏడో సీడ్ రావ్‌నిక్ (కెనడా) 6-2, 6-3, 3-6, 7-6 (7/4)తో ట్రెవర్ (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-2, 7-6 (7/4)తో మొరియా (జపాన్)పై, 26వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 6-0, 6-2, 7-6 (8/6)తో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)పై గెలుపొందారు.చివరిసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతోన్న మాజీ చాంపియన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) 6-3, 3-6, 6-4, 0-6, 9-11తో నిమినెన్ (ఫిన్లాండ్) చేతిలో ఓడిపోయి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. మహిళల సింగిల్స్ విభాగంలోనూ సీడెడ్ క్రీడాకారిణులు అలవోక విజయాలతో రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6-4, 6-1తో మార్గరీటా గ్యాస్పర్యాన్ (రష్యా)పై, నాలుగో సీడ్ షరపోవా (రష్యా) 6-2, 6-2తో జోనా కోంటా (బ్రిటన్)పై, ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) 6-1, 6-1తో యి ఫాన్ జు (చైనా)పై, 16వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6-0, 6-0తో మాడిసన్ బ్రింగిల్ (అమెరికా)పై విజయం సాధించారు. రెండో రౌండ్లో బోపన్న జంట: పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న-మెర్జియా 6-3, 6-7 (1/7), 6-1తో టిమ్ స్మిజెక్ (అమెరికా)-జిరీ వెస్లె (చెక్ రిపబ్లిక్)లపై గెలిచారు. -
రద్వాన్‌స్కా ఇంటికి
- ఇవనోవిచ్, వొజ్నియాకి కూడా - వింబుల్డన్ టోర్నీ లండన్: విశ్రాంతి దినం తర్వాత... వింబుల్డన్‌లో సోమవారం సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తోపాటు ఇద్దరు మాజీ నంబర్‌వన్‌లు అనా ఇవనోవిచ్ (సెర్బియా), కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) ఇంటిముఖం పట్టారు. నిరుటి రన్నరప్, 19వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ) మూడో రౌండ్లో 6-4, 3-6, 6-1తో 11వ సీడ్ ఇవనోవిచ్‌ను బోల్తా కొట్టించగా... నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 22వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 6-3, 6-0తో రద్వాన్‌స్కాకు షాక్ ఇచ్చింది. బార్బరా జహ్లవోవా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 7-5తో 16వ సీడ్ వొజ్నియాకిపై నెగ్గింది. ఈ గెలుపుతో మూడో రౌండ్లో రెండో సీడ్ నా లీ (చైనా)పై తాను సాధించిన విజయం గాలివాటం కాదని ఈ చెక్ రిపబ్లిక్ అమ్మాయి నిరూపించింది. కెరీర్లో 33వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న స్ట్రికోవా తొలిసారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించడం విశేషం. మరోవైపు ఇతర నాలుగో రౌండ్ మ్యాచ్‌ల్లో 13వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా) 7-6 (7/5), 7-5తో 25వ సీడ్ అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై; ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-2తో షుయె పెంగ్ (చైనా)పై; 23వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-0, 6-2తో స్మిట్కోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఆండీ ముర్రే జోరు పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో ముర్రే 6-4, 6-3, 7-6 (8/6)తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలిచాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 7-6 (10/8), 6-4, 6-4తో జెరెమి చార్డీ (అమెరికా)ను ఓడించాడు. పేస్ జోడి ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నాలుగో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం రెండో రౌండ్లో 6-1, 2-6, 3-6తో బుటోరాక్ (అమెరికా)-తిమీ బాబోస్ (హంగేరి) జోడి చేతిలో ఓడిపోయింది.