రద్వాన్‌స్కా గట్టెక్కింది | Wimbledon 2017: Federer and Kerber both in action, Pliskova out | Sakshi
Sakshi News home page

రద్వాన్‌స్కా గట్టెక్కింది

Published Fri, Jul 7 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

రద్వాన్‌స్కా గట్టెక్కింది

రద్వాన్‌స్కా గట్టెక్కింది

పోరాడి గెలిచిన పోలండ్‌ స్టార్‌
♦  జొకోవిచ్, నాదల్‌ ముందంజ
♦  మూడో సీడ్‌ ప్లిస్కోవాకు షాక్‌   వింబుల్డన్‌ టోర్నమెంట్‌


లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తొమ్మిదో సీడ్‌ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్‌) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.  గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో రద్వాన్‌స్కాకు అమెరికా ప్రత్యర్థి మెక్‌హలే నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. చివరకు రద్వాన్‌స్కా 5–7, 7–6 (9/7), 6–3తో క్రిస్టియానా మెక్‌హలే (అమెరికా)పై గెలిచి గట్టెక్కింది. తొలి సెట్‌ను కోల్పోయిన పోలండ్‌ స్టార్‌కు రెండో సెట్‌ కూడా దాదాపు చేజారినంత పనైంది. చివరకు ఈ సెట్‌ టైబ్రేక్‌కు దారితీయగా అక్కడ కూడా మెక్‌హలే ఏమాత్రం తగ్గలేదు.

దీంతో ఒక్కో పాయింట్‌ కోసం రద్వాన్‌స్కా తన శక్తి నంతా కూడదీసుకొని పోరాడింది. ఈ సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్‌ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడటంతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. 2 గంటల 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రద్వాన్‌స్కా 6 ఏస్‌లు సంధించగా, ప్రత్యర్థి 5 ఏస్‌లు సాధించింది. మెక్‌హలే సర్వీస్‌ను రద్వాన్‌స్కా మూడు సార్లు బ్రేక్‌ చేసింది. అమెరికా క్రీడాకారిణి 42 అనవసర తప్పిదాలు చేస్తే... రద్వాన్‌స్కా 14 మాత్రమే చేసింది.

  మరో వైపు ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీఫైనలిస్ట్, మూడో సీడ్‌ కరొలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) రెండో రౌండ్లోనే కంగుతింది. ప్రపంచ మూడో ర్యాంకర్‌ ప్లిస్కోవాకు 6–3, 5–7, 2–6తో స్లోవేకియా క్రీడాకారిణి, 87 ర్యాంకర్‌ రైబరికొవా షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్‌ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) 6–0, 7–5తో మకరోవా (రష్యా)ను ఓడించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంప్, 13వ సీడ్‌ జెలీనా ఒస్టాపెంకో (లాత్వియా) కూడా 4–6, 7–6 (7/4), 6–3తో ఫ్రాన్కోయిస్‌ అబండా (కెనడా)పై, 14వ సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌) 6–2, 6–4తో విక్‌మయెర్‌ (బెల్జియం)పై నెగ్గారు.

జొకోవిచ్, నాదల్‌ అలవోకగా...
పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో సీడెడ్‌ ఆటగాళ్లు నొవాక్‌ జొకోవిచ్, రాఫెల్‌ నాదల్‌ ముందంజ వేశారు. రెండో సీడ్‌  జొకోవిచ్‌ (సెర్బియా) 6–2, 6–2, 6–1తో అడమ్‌ పావ్లసెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై సునాయస విజయం సాధించాడు. ఆరంభం నుంచి అసాధారణ ఆటతీరు కనబరిచిన నొవాక్‌ కేవలం గంటా 33 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించాడు. స్పెయిన్‌ స్టార్‌ నాలుగో సీడ్‌ నాదల్‌ వరుస సెట్లలో 6–4, 6–2, 7–5తో డోనాల్డ్‌ యంగ్‌ (అమెరికా)పై గెలుపొందగా... 13వ సీడ్‌ డిమిత్రోవ్‌ (బల్గేరియా) 6–3, 6–2, 6–1తో బాగ్దటిస్‌ (సైప్రస్‌)పై నెగ్గాడు. 15వ సీడ్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) 7–6 (7/1), 6–4, 6–4తో ఎడ్మండ్‌ (బ్రిటన్‌)పై గెలువగా, 29వ సీడ్‌ డెల్‌ పొట్రోకు 4–6, 4–6, 6–7 (3/7)తో ఎమెస్ట్‌ గుల్బిస్‌ (లాత్వియా) చేతిలో చుక్కెదురైంది. 8వ సీడ్‌ తియెమ్‌ (ఆస్ట్రియా) 5–7, 6–4, 6–2, 6–4తో గైల్స్‌ సైమన్‌ (ఫ్రాన్స్‌)పై, డ్యుడి సెలా (ఇజ్రాయెల్‌) 6–7 (5/7), 7–6 (7/5), 5–7, 7–6 (7/5), 6–3తో 23వ సీడ్‌ జాన్‌ ఇస్నర్‌ (అమెరికా)పై గెలిచారు.

జీవన్, పేస్‌ అవుట్‌
జీవన్‌ నెదున్‌చెజియాన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ సంబరం తొలి రౌండ్‌తోనే ముగిసింది. పురుషుల డబుల్స్‌లో జీవన్‌ (భారత్‌)–జరెడ్‌ డోనాల్డ్‌సన్‌ (అమెరికా) జంట 7–6 (7/4), 7–5, 6–7 (3/7), 0–6, 3–6తో జే క్లార్క్‌– మార్కస్‌ విల్స్‌ (బ్రిటన్‌) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. ఓడినప్పటికీ ఐదు సెట్ల మ్యాచ్‌లో జీవన్‌ ద్వయం చక్కని పోరాటపటిమ కనబరిచింది. మరో మ్యాచ్‌లో వెటరన్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ కూడా తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. పేస్‌ (భారత్‌)– అదిల్‌ శమస్దిన్‌ (కెనడా) ద్వయం 6–4, 6–4, 2–6, 6–7 (2/7), 8–10తో జులియన్‌ నోలే– ఫిలిప్‌ ఒస్వాల్డ్‌ (ఆస్ట్రియా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement