agnieszka radwanska
-
రద్వాన్‌స్కా గట్టెక్కింది
♦ పోరాడి గెలిచిన పోలండ్ స్టార్ ♦ జొకోవిచ్, నాదల్ ముందంజ ♦ మూడో సీడ్ ప్లిస్కోవాకు షాక్ వింబుల్డన్ టోర్నమెంట్ లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో తొమ్మిదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రద్వాన్‌స్కాకు అమెరికా ప్రత్యర్థి మెక్‌హలే నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. చివరకు రద్వాన్‌స్కా 5–7, 7–6 (9/7), 6–3తో క్రిస్టియానా మెక్‌హలే (అమెరికా)పై గెలిచి గట్టెక్కింది. తొలి సెట్‌ను కోల్పోయిన పోలండ్ స్టార్‌కు రెండో సెట్ కూడా దాదాపు చేజారినంత పనైంది. చివరకు ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీయగా అక్కడ కూడా మెక్‌హలే ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఒక్కో పాయింట్ కోసం రద్వాన్‌స్కా తన శక్తి నంతా కూడదీసుకొని పోరాడింది. ఈ సెట్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడటంతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. 2 గంటల 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రద్వాన్‌స్కా 6 ఏస్‌లు సంధించగా, ప్రత్యర్థి 5 ఏస్‌లు సాధించింది. మెక్‌హలే సర్వీస్‌ను రద్వాన్‌స్కా మూడు సార్లు బ్రేక్ చేసింది. అమెరికా క్రీడాకారిణి 42 అనవసర తప్పిదాలు చేస్తే... రద్వాన్‌స్కా 14 మాత్రమే చేసింది. మరో వైపు ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్, మూడో సీడ్ కరొలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే కంగుతింది. ప్రపంచ మూడో ర్యాంకర్ ప్లిస్కోవాకు 6–3, 5–7, 2–6తో స్లోవేకియా క్రీడాకారిణి, 87 ర్యాంకర్ రైబరికొవా షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) 6–0, 7–5తో మకరోవా (రష్యా)ను ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంప్, 13వ సీడ్ జెలీనా ఒస్టాపెంకో (లాత్వియా) కూడా 4–6, 7–6 (7/4), 6–3తో ఫ్రాన్కోయిస్ అబండా (కెనడా)పై, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–2, 6–4తో విక్మయెర్ (బెల్జియం)పై నెగ్గారు. జొకోవిచ్, నాదల్ అలవోకగా... పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సీడెడ్ ఆటగాళ్లు నొవాక్ జొకోవిచ్, రాఫెల్ నాదల్ ముందంజ వేశారు. రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–2, 6–2, 6–1తో అడమ్ పావ్లసెక్ (చెక్ రిపబ్లిక్)పై సునాయస విజయం సాధించాడు. ఆరంభం నుంచి అసాధారణ ఆటతీరు కనబరిచిన నొవాక్ కేవలం గంటా 33 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించాడు. స్పెయిన్ స్టార్ నాలుగో సీడ్ నాదల్ వరుస సెట్లలో 6–4, 6–2, 7–5తో డోనాల్డ్ యంగ్ (అమెరికా)పై గెలుపొందగా... 13వ సీడ్ డిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–2, 6–1తో బాగ్దటిస్ (సైప్రస్)పై నెగ్గాడు. 15వ సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 7–6 (7/1), 6–4, 6–4తో ఎడ్మండ్ (బ్రిటన్)పై గెలువగా, 29వ సీడ్ డెల్ పొట్రోకు 4–6, 4–6, 6–7 (3/7)తో ఎమెస్ట్ గుల్బిస్ (లాత్వియా) చేతిలో చుక్కెదురైంది. 8వ సీడ్ తియెమ్ (ఆస్ట్రియా) 5–7, 6–4, 6–2, 6–4తో గైల్స్ సైమన్ (ఫ్రాన్స్)పై, డ్యుడి సెలా (ఇజ్రాయెల్) 6–7 (5/7), 7–6 (7/5), 5–7, 7–6 (7/5), 6–3తో 23వ సీడ్ జాన్ ఇస్నర్ (అమెరికా)పై గెలిచారు. జీవన్, పేస్ అవుట్ జీవన్ నెదున్‌చెజియాన్ తొలి గ్రాండ్‌స్లామ్ సంబరం తొలి రౌండ్‌తోనే ముగిసింది. పురుషుల డబుల్స్‌లో జీవన్ (భారత్)–జరెడ్ డోనాల్డ్సన్ (అమెరికా) జంట 7–6 (7/4), 7–5, 6–7 (3/7), 0–6, 3–6తో జే క్లార్క్– మార్కస్ విల్స్ (బ్రిటన్) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. ఓడినప్పటికీ ఐదు సెట్ల మ్యాచ్‌లో జీవన్ ద్వయం చక్కని పోరాటపటిమ కనబరిచింది. మరో మ్యాచ్‌లో వెటరన్ స్టార్ లియాండర్ పేస్ కూడా తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. పేస్ (భారత్)– అదిల్ శమస్దిన్ (కెనడా) ద్వయం 6–4, 6–4, 2–6, 6–7 (2/7), 8–10తో జులియన్ నోలే– ఫిలిప్ ఒస్వాల్డ్ (ఆస్ట్రియా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
సింగిల్స్ చాంప్ రద్వాన్‌స్కా
సింగపూర్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)... మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ రద్వాన్‌స్కా 6-2, 4-6, 6-3తో ప్రపంచ ఐదో ర్యాంకర్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. 26 ఏళ్ల రద్వాన్‌స్కా కెరీర్లో ఇది 17వ సింగిల్స్ టైటిల్. విజేతగా నిలిచిన ఈ పోలండ్ ప్లేయర్‌కు 18 లక్షల డాలర్ల (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది. 1972లో మొదలైన ఈ టోర్నీ చరిత్రలో పోలండ్ క్రీడాకారిణికి టైటిల్ దక్కడం ఇదే తొలిసారి. -
రద్వాన్‌స్కా ఇంటికి
- ఇవనోవిచ్, వొజ్నియాకి కూడా - వింబుల్డన్ టోర్నీ లండన్: విశ్రాంతి దినం తర్వాత... వింబుల్డన్‌లో సోమవారం సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తోపాటు ఇద్దరు మాజీ నంబర్‌వన్‌లు అనా ఇవనోవిచ్ (సెర్బియా), కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) ఇంటిముఖం పట్టారు. నిరుటి రన్నరప్, 19వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ) మూడో రౌండ్లో 6-4, 3-6, 6-1తో 11వ సీడ్ ఇవనోవిచ్‌ను బోల్తా కొట్టించగా... నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 22వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 6-3, 6-0తో రద్వాన్‌స్కాకు షాక్ ఇచ్చింది. బార్బరా జహ్లవోవా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 7-5తో 16వ సీడ్ వొజ్నియాకిపై నెగ్గింది. ఈ గెలుపుతో మూడో రౌండ్లో రెండో సీడ్ నా లీ (చైనా)పై తాను సాధించిన విజయం గాలివాటం కాదని ఈ చెక్ రిపబ్లిక్ అమ్మాయి నిరూపించింది. కెరీర్లో 33వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న స్ట్రికోవా తొలిసారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించడం విశేషం. మరోవైపు ఇతర నాలుగో రౌండ్ మ్యాచ్‌ల్లో 13వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా) 7-6 (7/5), 7-5తో 25వ సీడ్ అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై; ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-2తో షుయె పెంగ్ (చైనా)పై; 23వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-0, 6-2తో స్మిట్కోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఆండీ ముర్రే జోరు పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో ముర్రే 6-4, 6-3, 7-6 (8/6)తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలిచాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 7-6 (10/8), 6-4, 6-4తో జెరెమి చార్డీ (అమెరికా)ను ఓడించాడు. పేస్ జోడి ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నాలుగో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం రెండో రౌండ్లో 6-1, 2-6, 3-6తో బుటోరాక్ (అమెరికా)-తిమీ బాబోస్ (హంగేరి) జోడి చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో నా లీ, రద్వాన్‌స్కా
న్యూయార్క్: అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ ఐదో సీడ్ నా లీ (చైనా), మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో నా లీ 6-2, 7-5తో లారా రాబ్సన్ (బ్రిటన్)పై; రద్వాన్‌స్కా 6-4, 7-6 (7/1)తో పావ్లీచెంకోవా (రష్యా)పై గెలిచారు. మరోవైపు రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్), ఆరో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), 13వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో అజరెంకా 6-3, 6-1తో అలెగ్జాండ్రా వొజ్నియాక్ (కెనడా)పై, క్విటోవా 6-2, 6-4తో జవనోవ్స్కీ (సెర్బియా)పై గెలిచారు. 2011 చాంపియన్, 11వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)ను తొలి రౌండ్లో బోల్తా కొట్టించిన అమెరికా యువతార విక్టోరియా దువాల్ పోరాటం రెండో రౌండ్లో ముగిసింది. హంతుచోవా (స్లొవేకియా) 6-2, 6-3తో దువాల్ను ఓడించింది. పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో ఏడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-3, 6-2, 6-1తో కార్లోస్ బెర్లాక్ (అర్జెంటీనా)పై... రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6-2, 6-1, 6-0తో దుత్రా సిల్వా (బ్రెజిల్)పై అలవోకగా గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నారు. నాలుగో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-3, 6-7 (5/7), 6-1, 6-2తో బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై, ఎనిమిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-3, 7-5, 7-5తో రాబర్ట్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. 10వ సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా), 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా), 18వ సీడ్ టిప్సరెవిచ్ (సెర్బియా), 19వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్) కూడా మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. దివిజ్‌కు తొలి విజయం పురుషుల డబుల్స్‌లో భారత రైజింగ్ స్టార్ దివిజ్ శరణ్ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ విజయాన్ని నమోదు చేశాడు. యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)తో కలిసి బరిలోకి దిగిన దివిజ్ తొలి రౌండ్లో 6-1, 7-5తో హాస్-సిసిలింగ్ (నెదర్లాండ్స్) జోడిని ఓడించాడు. భూపతి జోడికి షాక్ ఈ సీజన్ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న భారత స్టార్ మహేశ్ భూపతి పురుషుల డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. భూపతి-పిలిఫ్ పెట్షెనర్ (జర్మనీ) ద్వయం 3-6, 6-7 (4/7)తో డానియల్ నెస్టర్-పోస్పిసిల్ (కెనడా) జంట చేతిలో ఓడింది. లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట 6-4, 7-6 (7/4)తో నిమినెన్ (ఫిన్లాండ్) -తుర్సునోవ్ (రష్యా) జోడిపై నెగ్గింది.