ప్రిక్వార్టర్స్‌లో నా లీ, రద్వాన్‌స్కా
న్యూయార్క్: అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ ఐదో సీడ్ నా లీ (చైనా), మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో నా లీ 6-2, 7-5తో లారా రాబ్సన్ (బ్రిటన్)పై; రద్వాన్‌స్కా 6-4, 7-6 (7/1)తో పావ్లీచెంకోవా (రష్యా)పై గెలిచారు.
మరోవైపు రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్), ఆరో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), 13వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్‌లో అజరెంకా 6-3, 6-1తో అలెగ్జాండ్రా వొజ్నియాక్ (కెనడా)పై, క్విటోవా 6-2, 6-4తో జవనోవ్‌స్కీ (సెర్బియా)పై గెలిచారు. 2011 చాంపియన్, 11వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)ను తొలి రౌండ్‌లో బోల్తా కొట్టించిన అమెరికా యువతార విక్టోరియా దువాల్ పోరాటం రెండో రౌండ్‌లో ముగిసింది. హంతుచోవా (స్లొవేకియా) 6-2, 6-3తో దువాల్‌ను ఓడించింది.
పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్‌లో ఏడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-3, 6-2, 6-1తో కార్లోస్ బెర్లాక్ (అర్జెంటీనా)పై... రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6-2, 6-1, 6-0తో దుత్రా సిల్వా (బ్రెజిల్)పై అలవోకగా గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నారు. నాలుగో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-3, 6-7 (5/7), 6-1, 6-2తో బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై, ఎనిమిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-3, 7-5, 7-5తో రాబర్ట్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. 10వ సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా), 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా), 18వ సీడ్ టిప్సరెవిచ్ (సెర్బియా), 19వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్) కూడా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
దివిజ్‌కు తొలి విజయం
పురుషుల డబుల్స్‌లో భారత రైజింగ్ స్టార్ దివిజ్ శరణ్ కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ విజయాన్ని నమోదు చేశాడు. యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)తో కలిసి బరిలోకి దిగిన దివిజ్ తొలి రౌండ్‌లో 6-1, 7-5తో హాస్-సిసిలింగ్ (నెదర్లాండ్స్) జోడిని ఓడించాడు.
భూపతి జోడికి షాక్
ఈ సీజన్ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న భారత స్టార్ మహేశ్ భూపతి పురుషుల డబుల్స్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. భూపతి-పిలిఫ్ పెట్‌షెనర్ (జర్మనీ) ద్వయం 3-6, 6-7 (4/7)తో డానియల్ నెస్టర్-పోస్పిసిల్ (కెనడా) జంట చేతిలో ఓడింది. లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట 6-4, 7-6 (7/4)తో నిమినెన్ (ఫిన్లాండ్) -తుర్సునోవ్ (రష్యా) జోడిపై నెగ్గింది.