రద్వాన్‌స్కా ఇంటికి
- ఇవనోవిచ్, వొజ్నియాకి కూడా
- వింబుల్డన్ టోర్నీ
లండన్: విశ్రాంతి దినం తర్వాత... వింబుల్డన్‌లో సోమవారం సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తోపాటు ఇద్దరు మాజీ నంబర్‌వన్‌లు అనా ఇవనోవిచ్ (సెర్బియా), కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) ఇంటిముఖం పట్టారు. నిరుటి రన్నరప్, 19వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ) మూడో రౌండ్‌లో 6-4, 3-6, 6-1తో 11వ సీడ్ ఇవనోవిచ్‌ను బోల్తా కొట్టించగా... నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 22వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 6-3, 6-0తో రద్వాన్‌స్కాకు షాక్ ఇచ్చింది.
బార్బరా జహ్లవోవా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 7-5తో 16వ సీడ్ వొజ్నియాకిపై నెగ్గింది. ఈ గెలుపుతో మూడో రౌండ్‌లో రెండో సీడ్ నా లీ (చైనా)పై తాను సాధించిన విజయం గాలివాటం కాదని ఈ చెక్ రిపబ్లిక్ అమ్మాయి నిరూపించింది. కెరీర్‌లో 33వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న స్ట్రికోవా తొలిసారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించడం విశేషం. మరోవైపు ఇతర నాలుగో రౌండ్ మ్యాచ్‌ల్లో 13వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా) 7-6 (7/5), 7-5తో 25వ సీడ్ అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై; ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-2తో షుయె పెంగ్ (చైనా)పై; 23వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-0, 6-2తో స్మిట్కోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.
ఆండీ ముర్రే జోరు
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో ముర్రే 6-4, 6-3, 7-6 (8/6)తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలిచాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 7-6 (10/8), 6-4, 6-4తో జెరెమి చార్డీ (అమెరికా)ను ఓడించాడు.
పేస్ జోడి ఓటమి
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో నాలుగో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం రెండో రౌండ్‌లో 6-1, 2-6, 3-6తో బుటోరాక్ (అమెరికా)-తిమీ బాబోస్ (హంగేరి) జోడి చేతిలో ఓడిపోయింది.