ana ivanovic
-
టెన్నిస్ కు సెర్బియా బ్యూటీ గుడ్ బై
బెల్గ్రేడ్: సెర్బియా బ్యూటీ, మాజీ ప్రపంచ నంబర్ వన్ అనా ఇవనోవిచ్ తన టెన్నిస్ జీవితానికి గుబ్ బై చెప్పేసింది. ఇటీవల కాలంలో అత్యున్నత స్థాయిలో రాణించలేకపోతున్న అనా ఇవనోవిచ్ 29 ఏళ్లకే అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పింది. ఈ విషయాన్నిబాధాతప్త హృదయంతో ప్రకటించిన ఇవనోవిచ్.. ఇప్పటివరకూ తనకు మద్దతుగా నిలిచిన అందరీకి ధన్యవాదాలు తెలియజేసింది. 2008లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను సాధించడం ద్వారా గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి సెర్బియా మహిళగా రికార్డులెక్కిన ఇవనోవిచ్.. బుధవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. 'నేను రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడానికి పెద్దగా కారణం ఏమీ లేదు. నేను అత్యున్నత స్థాయిలో రాణించలేనని కారణంతోనే ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను. ఇది చాలా కఠిన నిర్ణయం. కానీ ఆనందంగానే టెన్నిస్ కు గుడ్ బై చెబుతున్నా. నా వయసు ఐదేళ్లు ఉన్నప్పుడే టెన్నిస్ ఆటపై మక్కువ పుట్టింది. ఇందుకు నా తల్లి దండ్రులు ఎంతో సహకరించారు. నా స్థాయిని పెంచుకుంటూ నంబవన్ వరకూ ఎదిగా. నా కెరీర్లో చాలా ఎత్తులు చూశా. మళ్లీ ఆ స్థాయిని చూస్తానని అనుకోవడం లేదు.అందుకే ఈ వీడ్కోలు నిర్ణయం'అని అనా ఇవనోవిచ్ స్పష్టం చేసింది. -
మాజీ నంబర్ వన్‌కు మళ్లీ షాక్!
ప్రపంచ మాజీ నంబర్‌వన్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) వరుసగా రెండో ఏడాది యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ విభాగంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో అనామక ప్లేయర్ చేతిలో ఇవనోవిచ్ పరాజయం పాలైంది. తొలి రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 89వ ర్యాంకర్, చెక్ రిపబ్లిక్ కు చెందిన డెనిసా అలెర్టోవా 6-7 (4/7), 1-6తో మాజీ నంబర్ వన్ ఇవనోవిచ్ పై నెగ్గి రెండో రౌండ్ కి దూసుకెళ్లింది. 2008లో ఫ్రెంచ్ నెగ్గిన తర్వాత ఇవనోవిచ్ మరో మేజర్ టోర్నీని నెగ్గలేదు. 2012లో క్వార్టర్స్, 2013లో నాలుగో రౌండ్ మాత్రమే యూఎస్ ఓపెన్‌లో ఆమె చెప్పుకోదగ్గ ప్రదర్శనలు. మ్యాచ్ అనంతరం ఇవనోవిచ్ మాట్లాడుతూ... సాధ్యమైనంతగా తక్కువ తప్పిదాలు చేసేందుకు ప్రయత్నించినా తన వల్ల కావడం లేదని 28 ఏళ్ల సెర్బియా భామ చెప్పింది. 'గతేడాది గాయం కారణంగా ర్యాంకుల్లో దిగజారాను. ప్రస్తుతం 31ర్యాంక్ లో కొనసాగుతున్నాను. తొలి రౌండ్లో చివర్లో తప్పిదం కారణంగా ట్రై బ్రేకర్‌లో సెట్ కోల్పోయాను' అని ఇవనోవిచ్ వివరించింది. మరోవైపు రియో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మోనికా పుయిగ్ (పోర్టోరికో) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. చైనా ప్లేయర్ సాయ్‌సాయ్ జెంగ్ 6-4, 6-2 తేడాతో పుయిగ్ పై సంచలన విజయం సాధించింది. -
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఇవనోవిచ్ అవుట్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శనివారం జరిగిన పోరులో మాజీ చాంపియన్ అనా ఇవనోవిచ్ మూడో రౌండ్లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉక్రెయిన్ కు చెందిన 18వ సీడ్ క్రీడాకారిణి ఎలినా స్వితోలినా 6-4, 6-4 తేడాతో ఇవనోవిచ్ పై విజయం సాధించింది. వరుస రెండు సెట్లను కైవసం చేసుకున్న స్వితోలినా అంచనాలు మించి రాణించి నాల్గో రౌండ్లోకి ప్రవేశించింది. -
సెర్బియా బ్యూటీ చీర సింగారం
ఢిల్లీ : ఆటకే అందం తీసుకొచ్చే భామలు టెన్నిస్ క్రీడాకారిణులు. మెరుపు షాట్లతో అభిమానులను అలరించడంతోపాటుగా అందంలోనూ సూపర్ స్టార్లకు ధీటుగా నిలబడుతున్న భామలు చాలామందే వున్నారు. వారిలో సెర్బియన్ టెన్నిస్ బ్యూటీ అనా ఇవానోవిచ్ ఒకరు. ఇపుడు ఈ బ్యూటీ సాంప్రదాయ భారతీయ చీర కట్టుతో సంచలనం సృష్టిస్తోంది. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో ఆడేందుకు భారత్ వచ్చిన ఈ మెరుపు తీగ బంగారు రంగుచీరలో సింగారాలు ఒలకబోస్తూ ఒకఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో లైక్‌లు, షేర్ల వర్షం కురుస్తోంది. భారతీయ సంస్కృతికి ముగ్ధురాలైన ఈ అమ్మడు చీరలో తన అందం ఎంత ఎలివేట్ అవుతుందో చూసుకోవాలనుకుందిట. అందుకే చీర కట్టులో మెరిసి, మురిసిపోయింది. అంతటితో ఆగలేదు... వాటిని ట్విట్టర్లో అప్లోడ్ చేసింది. కామెంట్ చేయమని ఫ్యాన్స్‌ను కోరింది. ఇక అంతే....ఇపుడీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా 2008లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఎగరేసుకుపోయిన ఇవానోవిచ్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సైతం సొంతం చేసుకుంది. తర్వాత ఫామ్ ను కోల్పోయి మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. ఆరేళ్ల నిరీక్షణ తర్వాత తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇవనోవిచ్ అద్భుత ఆటతీరుతో ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
♦ ఆరేళ్ల తర్వాత సెమీస్‌లోకి ఇవనోవిచ్ ♦ సఫరోవా తొలిసారి ♦ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్ : అంచనాలకు మించి రాణించిన ‘సెర్బియా సుందరి’ అనా ఇవనోవిచ్... ‘చెక్ రిపబ్లిక్ చిన్నది’ లూసీ సఫరోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ ఇవనోవిచ్ 6-3, 6-2తో 19వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలుపొందగా... 13వ సీడ్ సఫరోవా 7-6 (7/3), 6-3తో 21వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)ను ఓడించింది. 2008లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ఇవనోవిచ్ ఆ తర్వాత మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. ఆరేళ్ల నిరీక్షణ తర్వాత తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇవనోవిచ్ అద్భుత ఆటతీరుతో ఫామ్‌లోకి రావడం విశేషం. 75 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇవనోవిచ్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. ముఖ్యంగా ఆమె సంధించిన ఫోర్‌హ్యాండ్ షాట్లకు స్వితోలినా వద్ద జవాబు లేకపోయింది. తొలి సెట్ ఆరంభంలో రెండుసార్లు స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఇవనోవిచ్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రేక్షకుల గ్యాలరీలో తన ప్రియుడు, జర్మనీ ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత జట్టులోని సభ్యుడు బాస్టియన్ ష్వాన్‌స్టీగర్ చూస్తుండగా ఇవనోవిచ్ తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లోనూ ఈ సెర్బియా బ్యూటీ తన హవా కొనసాగించింది. రెండో గేమ్‌లో, ఐదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఇవనోవిచ్ అదే ఊపులో సెట్‌ను దక్కించుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ మరియా షరపోవా (రష్యా)పై తాను సాధించిన విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ సఫరోవా మరోసారి అద్భుత ఆటతీరును ప్రదర్శించింది. గతేడాది ఇదే టోర్నీలో సెరెనా విలియమ్స్‌ను ఓడించి వెలుగులోకి వచ్చిన ముగురుజా దూకుడుకు పగ్గాలు వేస్తూ సఫరోవా తన కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరింది. తొలి సెట్లో 10 నిమిషాలపాటు సాగిన పదో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను నిలబెట్టుకున్నా... చివరకు టైబ్రేక్‌లో సఫరోవా పైచేయి సాధించింది. రెండో సెట్లోని ఆరో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సఫరోవా ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెమీఫైనల్లో స్థానాన్ని సంపాదించింది. గురువారం జరిగే సెమీస్‌లో ఇవనోవిచ్‌తో సఫరోవా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సఫరోవా 5-3తో ఆధిక్యంలో ఉండటం విశేషం. -
ఇవనో'విన్'
♦ ఆరేళ్ల తర్వాత క్వార్టర్స్‌లోకి ♦ నాలుగో రౌండ్లో మకరోవాపై గెలుపు ♦ నాలుగో సీడ్ బెర్డిచ్ బోల్తా ♦ నిషికోరి ముందంజ ♦ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్ : కొన్నేళ్ల క్రితం ఎర్రమట్టి కోర్టులో దుమ్ము రేపి ఆ తర్వాత వెనుకబడి పోయిన సెర్బియా స్టార్ అనా ఇవనోవిచ్ మళ్లీ గాడిలో పడింది. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్లో ఏడో సీడ్ ఇవనోవిచ్ 7-5, 3-6, 6-1తో తొమ్మిదో సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో 2007లో రన్నరప్‌గా నిలిచిన ఈ సెర్బియా బ్యూటీ 2008లో చాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత ఈ టోర్నీలో ఇవనోవిచ్ కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. తాజా విజయంతో ఇవనోవిచ్ ఈ టోర్నీలో ఆరేళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఈ మాజీ నంబర్‌వన్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీనే ఎదురైంది. ఆరంభంలో 0-2తో వెనుకబడిన ఇవనోవిచ్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో వర్షం రావడంతో దాదాపు రెండు గంటలపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. వర్షం వెలిశాక ఇవనోవిచ్ జోరు పెంచి తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్లో మకరోవా మెరిసింది. ఇవనోవిచ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో ఇవనోవిచ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. పదునైన షాట్లు సంధించడంతోపాటు మకరోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సెట్‌ను 6-1తో కైవసం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇవనోవిచ్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు 30 విన్నర్స్ షాట్లు కొట్టింది. క్వార్టర్ ఫైనల్లో 19వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)తో ఇవనోవిచ్ తలపడుతుంది. మరో నాలుగో రౌండ్ మ్యాచ్‌లో స్వితోలినా 6-2, 7-6 (11/9)తో 29వ సీడ్ అలీజా కార్నె (ఫ్రాన్స్)ను ఓడించింది. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్వితోలినా ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. స్వితోలినాతో ముఖాముఖి రికార్డులో ఇవనోవిచ్ 6-0తో ఆధిక్యంలో ఉంది. సోంగా సంచలనం పురుషుల సింగిల్స్ విభాగంలో సంచలనం నమోదైంది. నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. 14వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 6-3, 6-2, 6-7 (5/7), 6-3తో బెర్డిచ్ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్) 6-3, 6-4, 6-2తో గబాష్విలి (రష్యా)పై గెలిచాడు. ఈ విజయంతో నిషికోరి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో నాలుగుసార్లు ఈ టోర్నీలో ఆడిన అతను ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. అంతేకాకుండా 82 ఏళ్ల తర్వాత ఓ జపాన్ ప్లేయర్ ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరాడు. చివరిసారి 1931, 1933లో జపాన్ నుంచి జిరో సతో ఈ ఘనత సాధించాడు. నేటి ప్రిక్వార్టర్స్ మధ్యాహ్నం గం. 2.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఇవనోవిచ్ జోరు
♦ ప్రిక్వార్టర్స్‌లో సెర్బియా స్టార్ ♦ షరపోవా, మకరోవా కూడా ♦ 11వ సీడ్ కెర్బర్‌కు షాక్ ♦ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్ : తొలి రెండు రౌండ్లలో చెమటోడ్చిన మాజీ చాంపియన్ అనా ఇవనోవిచ్ మూడో రౌండ్లో మాత్రం చెలరేగింది. కేవలం 52 నిమిషాల్లో తన ప్రత్యర్థి ఆట కట్టించింది. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ఏడో సీడ్ ఇవనోవిచ్ 6-0, 6-3తో డోనా వెకిక్ (క్రొయేషియా)పై అలవోకగా గెలిచింది. 19 విన్నర్స్ కొట్టిన ఇవనోవిచ్ 11 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ షరపోవా (రష్యా), తొమ్మిదో సీడ్ మకరోవా (రష్యా), 13వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) కూడా ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో షరపోవా 6-3, 6-4తో 26వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై, మకరోవా 6-2, 6-4తో వెస్నినా (రష్యా)పై, సఫరోవా 6-3, 7-6 (7/2)తో 20వ సీడ్ సబీనా లిసికి (జర్మనీ)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో ముగురుజా (స్పెయిన్) 4-6, 6-2, 6-2తో 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ)పై, ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 6-3, 6-4తో ఎనిమిదో సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) పై సంచలన విజయం సాధించారు. రెండో రౌండ్లో మూడో సీడ్, నిరుటి రన్నరప్ సిమోనా హలెప్‌ను బోల్తా కొట్టించిన మిర్యానా లూసిచ్ బరోనీ (క్రొయేషియా) మూడో రౌండ్లో 6-4, 3-6, 5-7తో అలీజా కార్నె (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. ఎదురులేని ఫెడరర్ పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) తన జోరును కొనసాగిస్తున్నాడు. మూడో రౌండ్లో ఫెడరర్ 6-4, 6-3, 6-2తో దామిర్ జుముర్ (బోస్నియా అండ్ హెర్జెగోవినా)పై గెలిచాడు. 20వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మూడో రౌండ్లో నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-1, 6-7 (5/7), 6-3, 6-4తో పెయిర్ (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-4, 6-3, 6-2తో జాన్సన్ (అమెరికా)పై, 12వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్) 6-2, 6-7 (6/8), 6-7 (6/8), 6-3, 6-1తో నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)పై, 20వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 3-6, 6-3, 6-1, 4-6, 6-1తో బెర్లోక్ (అర్జెంటీనా)పై నెగ్గారు. సానియా జంట ముందంజ మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-3, 6-4తో ఫోరెట్జ్-హెసి (ఫ్రాన్స్)లపై నెగ్గింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో పేస్ (భారత్)-నెస్టర్ (కెనడా) 7-6 (7/3), 6-2తో బెగెమన్ (జర్మనీ)-నోల్ (ఆస్ట్రియా)లపై, రోహన్ బోపన్న (భారత్)-మెర్జియా (రుమేనియా) 3-6, 6-3, 7-5తో ఆస్టిన్ క్రాయిసెక్-డొనాల్డ్ యంగ్ (అమెరికా)లపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. -
రద్వాన్‌స్కా ఇంటికి
- ఇవనోవిచ్, వొజ్నియాకి కూడా - వింబుల్డన్ టోర్నీ లండన్: విశ్రాంతి దినం తర్వాత... వింబుల్డన్‌లో సోమవారం సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తోపాటు ఇద్దరు మాజీ నంబర్‌వన్‌లు అనా ఇవనోవిచ్ (సెర్బియా), కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) ఇంటిముఖం పట్టారు. నిరుటి రన్నరప్, 19వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ) మూడో రౌండ్లో 6-4, 3-6, 6-1తో 11వ సీడ్ ఇవనోవిచ్‌ను బోల్తా కొట్టించగా... నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 22వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 6-3, 6-0తో రద్వాన్‌స్కాకు షాక్ ఇచ్చింది. బార్బరా జహ్లవోవా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 7-5తో 16వ సీడ్ వొజ్నియాకిపై నెగ్గింది. ఈ గెలుపుతో మూడో రౌండ్లో రెండో సీడ్ నా లీ (చైనా)పై తాను సాధించిన విజయం గాలివాటం కాదని ఈ చెక్ రిపబ్లిక్ అమ్మాయి నిరూపించింది. కెరీర్లో 33వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న స్ట్రికోవా తొలిసారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించడం విశేషం. మరోవైపు ఇతర నాలుగో రౌండ్ మ్యాచ్‌ల్లో 13వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా) 7-6 (7/5), 7-5తో 25వ సీడ్ అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై; ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-2తో షుయె పెంగ్ (చైనా)పై; 23వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-0, 6-2తో స్మిట్కోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఆండీ ముర్రే జోరు పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో ముర్రే 6-4, 6-3, 7-6 (8/6)తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలిచాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 7-6 (10/8), 6-4, 6-4తో జెరెమి చార్డీ (అమెరికా)ను ఓడించాడు. పేస్ జోడి ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నాలుగో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం రెండో రౌండ్లో 6-1, 2-6, 3-6తో బుటోరాక్ (అమెరికా)-తిమీ బాబోస్ (హంగేరి) జోడి చేతిలో ఓడిపోయింది.