టెన్నిస్ కు సెర్బియా బ్యూటీ గుడ్ బై
బెల్గ్రేడ్: సెర్బియా బ్యూటీ, మాజీ ప్రపంచ నంబర్ వన్ అనా ఇవనోవిచ్ తన టెన్నిస్ జీవితానికి గుబ్ బై చెప్పేసింది. ఇటీవల కాలంలో అత్యున్నత స్థాయిలో రాణించలేకపోతున్న అనా ఇవనోవిచ్ 29 ఏళ్లకే అంతర్జాతీయ టెన్నిస్కు వీడ్కోలు చెప్పింది. ఈ విషయాన్నిబాధాతప్త హృదయంతో ప్రకటించిన ఇవనోవిచ్.. ఇప్పటివరకూ తనకు మద్దతుగా నిలిచిన అందరీకి ధన్యవాదాలు తెలియజేసింది.
2008లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను సాధించడం ద్వారా గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి సెర్బియా మహిళగా రికార్డులెక్కిన ఇవనోవిచ్.. బుధవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. 'నేను రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడానికి పెద్దగా కారణం ఏమీ లేదు. నేను అత్యున్నత స్థాయిలో రాణించలేనని కారణంతోనే ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను. ఇది చాలా కఠిన నిర్ణయం. కానీ ఆనందంగానే టెన్నిస్ కు గుడ్ బై చెబుతున్నా. నా వయసు ఐదేళ్లు ఉన్నప్పుడే టెన్నిస్ ఆటపై మక్కువ పుట్టింది. ఇందుకు నా తల్లి దండ్రులు ఎంతో సహకరించారు. నా స్థాయిని పెంచుకుంటూ నంబవన్ వరకూ ఎదిగా. నా కెరీర్లో చాలా ఎత్తులు చూశా. మళ్లీ ఆ స్థాయిని చూస్తానని అనుకోవడం లేదు.అందుకే ఈ వీడ్కోలు నిర్ణయం'అని అనా ఇవనోవిచ్ స్పష్టం చేసింది.